నువ్వా.. నేనా ! | tdp leaders School seats controversy | Sakshi
Sakshi News home page

నువ్వా.. నేనా !

Published Sun, Jun 17 2018 1:08 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

tdp leaders School seats controversy

సాక్షి, గుంటూరు: స్కూల్‌ సీటు విషయంలో జరిగిన చిన్న వివాదం చినికిచినికి గాలివానగా మారింది. దాడికి పాల్పడ్డ వారి పక్షాన అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ రాజీ ప్రయత్నాలు చేస్తుండగా.. స్కూల్‌ యాజమాన్యానికి మద్దతుగా నిలిచిన అదే సామాజిక వర్గానికి చెందిన ఓ సీనియర్‌ ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో స్కూల్‌ సీటు వివాదం కాస్తా అధికార పార్టీ నేతల మధ్య చిచ్చు రేపింది. ఈ వ్యవహారాన్ని నేతలిద్దరూ ప్రిస్టేజ్‌గా తీసుకుని పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నారు. దాడి ఘటనపై ఏడుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు కీలక సూత్రధారుల్ని అరెస్ట్‌ చేయకుండా తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 తలలు పట్టుకున్న పోలీసులు
 నిందితులను అరెస్ట్‌ చేయాలంటూ సీనియర్‌ ఎమ్మెల్యే, వద్దంటూ ఎమ్మెల్సీ భీష్మించుకు కూర్చోవడంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. స్కూల్‌ సీటు వివాదంపై జిల్లాకు చెందిన అధికార పార్టీ ముఖ్యనేతలు ఇద్దరు ఢీ అంటే ఢీ అంటుండటం టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది. వివాదం మరింత ముదరక ముందే చినబాబు వద్ద పంచాయతీ పెట్టి గొడవను సద్దుమణచాలనే యోచనలో కొందరు జిల్లా నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..గుంటూరు నగరంలోని ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో సీటు కోసం వెళ్లిన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనుచరులు సిబ్బందిపై దాడిచేసి గాయపరిచారు. దీనిపై సీసీ ఫుటేజ్‌లతో స్కూల్‌ యాజమాన్యం పట్టాభీపురం పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 3వ తేదీన ఫిర్యాదు చేయడంతో ఏడుగురిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

అయితే, 13 రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్ట్‌ చేయకపోవడానికి ఎమ్మెల్సీ ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. స్కూల్‌ యాజమాన్యంతో మాట్లాడి రాజీ కుదురుస్తానంటూ ఎమ్మెల్సీ చెప్పడంతో పోలీసులు సైతం కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. స్కూల్‌ యాజమాన్యం కూడా అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్‌ చేయాలని, ఆ తరువాతే రాజీ అంటూ పోలీసులపై ఒత్తిడి పెంచడంతో వివాదం ముదిరింది. 

ఎమ్మెల్సీ పలుమార్లు స్కూల్‌ యాజమాన్యానికి ఫోన్‌ చేసినా రాజీకి రాని పరిస్థితి. దీంతో స్కూల్‌ సీటు వివాదం కాస్తా ఇద్దరు అధికారపార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరుగా మారింది. మంత్రి వర్గ విస్తరణ సమయంలో సైతం వీరిరువురూ మంత్రి పదవి కోసం పోటీపడటంతో అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు  నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. గతంలో ఉన్న విభేదాల వల్లే స్కూల్‌ సీటు విషయంలో జరిగిన గొడవను ఇద్దరూ ప్రిస్టేజ్‌గా తీసుకుని పోలీసులపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిసింది. ఈ వివాదం ముదిరి పాకాన పడకముందే చల్లార్చాలనే ఉద్దేశంతో జిల్లా టీడీపీ నేతలు కొందరు చినబాబు వద్ద పంచాయితీ పెట్టి వివాదాన్ని సద్దుమణిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement