తెగబడ్డ ‘తమ్ముళ్లు’ | TDP leaders to play politics while on Teacher MLC elections | Sakshi
Sakshi News home page

తెగబడ్డ ‘తమ్ముళ్లు’

Published Mon, Mar 23 2015 2:56 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

తెగబడ్డ ‘తమ్ముళ్లు’ - Sakshi

తెగబడ్డ ‘తమ్ముళ్లు’

* ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలనూ రాజకీయం చేసిన టీడీపీ నేతలు
* పోలింగ్ కేంద్రాల వద్దే విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ
* బెజవాడలో రంగంలోకి దిగి చక్రం తిప్పిన ఎమ్మెల్యే బోండా
* శిబిరాలు వేసుకుని మరీ రూ.3 వేల చొప్పున కవర్లలో పంపిణీ
* పోలింగ్ బూత్ వద్దే టీడీపీ, సీపీఎం నేతల బాహాబాహీ
* గుంటూరు-కృష్ణాలో 68.12% , ఉభయగోదావరిలో 83.71% పోలింగ్


ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణంగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలే కీలకపాత్ర పోషిస్తాయి. పార్టీల ఎన్నికల చిహ్నాలు లేకుండా జరిగే ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సహజంగా దూరంగా ఉంటాయి. ఈ ఎన్నికల్లో మిగతా అన్ని పార్టీలూ ఆ విధంగా దూరంగానే ఉన్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం గౌరవప్రదంగా సాగాల్సిన ఈ ఎన్నికల ప్రక్రియను అభాసుపాల్జేసింది. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు రెచ్చిపోయి ప్రవర్తించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించి డబ్బులు పంపిణీ చేశారు. బూత్‌ల వద్దకు చొచ్చుకెళ్లి ఓటర్లను ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారు. అడ్డువచ్చిన వారిని నోటికొచ్చినట్లు దూషించడమే కాకుండా భౌతిక దాడులకు సైతం తెగబడ్డారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి అనుచిత జోక్యాలు, ప్రత్యక్షంగా కల్పించుకోవడం వంటివి చేస్తున్న టీడీపీ నాయకులు.. పోలింగ్‌కు రెండురోజుల ముందే డబ్బులు, కానుకల పంపకానికి తెరతీశారు.
 
 ఇక పోలింగ్ రోజున అడ్డూ అదుపూ లేకుండా వ్యవహరించారు. విజయవాడలో ఎమ్మెల్యే బోండా ఉమా నేరుగా రంగంలోకి దిగారు. ‘డబ్బు పందేరం ప్రక్రియ’ను స్వయంగా పర్యవేక్షించారు. ‘ఇదేంటని’ ప్రశ్నించిన సీపీఎం నేతలపై దాడులకు ప్రోత్సహించారు. ఎమ్మెల్సీ స్థానానికి బరిలో ఉన్న మహిళా నేత తాడి శకుంతలపై బూతు పంచాంగంతో విరుచుకుపడ్డారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎక్కడికక్కడ ప్రేక్షకపాత్ర పోషించారనే విమర్శలు విన్పించాయి. గుంటూరులో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబులు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో.. కృష్ణా-గుంటూరు స్థానంలో 68.12 శాతం, తూర్పు, పశ్చిమగోదావరి స్థానంలో 83.71 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది.
 
 సాక్షి, నెట్‌వర్క్: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉదయం పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికే టీడీపీ నేతలు, కార్యకర్తలు బూత్‌ల వద్ద మోహరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోయి ప్రవర్తించారు. బెజవాడలో జరిగిన ఎన్నికల్లో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పోలింగ్ జరిగేచోటే టెంట్లు వేసుకుని కూర్చుని డబ్బు పంపిణీని పర్యవేక్షించారు. ఇదేమని ప్రశ్నించిన సీపీఎం నేతలపై స్థానిక టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న సహా అతని అనుచరులు దాడులకు దిగారు. గుంటూరులో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించడంతో ప్రత్యర్థి వర్గానికి చెందిన నేతలు అడ్డుకున్నారు.

విజయవాడలో..: నగరంలోని ఉపాధ్యాయులు, అధ్యాపక ఓటర్లకు బిషప్ హాజరయ్య స్కూల్‌లో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. అక్కడికి సమీప  పుష్పాహోటల్ సెంటర్‌లో టీడీపీ మద్దతుతో బరిలోకిదిగిన అభ్యర్థి ఏఎస్ రామకృష్ణ వర్గం శిబిరం ఏర్పాటు చేసుకుంది.
 
  వామపక్షాల మద్దతుతో యూటీఎఫ్ తరఫున పోటీ చేస్తున్న కేఎస్ లక్ష్మణరావు వర్గం కూడా శిబిరం వేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ఓటింగ్ పుంజుకున్న తరుణంలో టీడీపీ శిబిరానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, టీడీపీ ఫ్లోర్ లీడర్ గుడారపు హరిబాబు, కార్పొరేటర్లు చెన్నుపాటి గాంధీ, సాంబశివరావులు చేరుకున్నారు. వీరు శిబిరంలో ఉండగానే తెలుగు తమ్ముళ్లు డబ్బుల పంపిణీకి తెరదీశారు. విషయం తెలుసుకున్న సీపీఎం నేతలు డబ్బులు పంచుతున్న రామకృష్ణ వర్గీయులు సహా తెలుగు తమ్ముళ్లను పట్టుకున్నారు. వారి నుంచి రూ.3 వేలతో కూడిన కవర్లను స్వాధీనం చేసుకున్నారు.  వారి నుంచి రూ.1000, 500 నోట్లు స్వాధీనం చేసుకుని మీడియాకు చూపించారు. టీడీపీ నేతలు వామపక్షాల నేతలతో ఘర్షణకు దిగారు. తమకు చెందిన ఒకరిని విడిపించి తీసుకువెళ్లారు.

టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, టీడీపీ ఫ్లోర్‌లీడర్ హరిబాబు, కార్పొరేటర్లు.. సీపీఎం కార్యకర్తలపై దాడికి దిగారు.  దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీపీఎం నాయకుడు విష్ణువర్దన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కృష్ణాజిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు, పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు రంగంలోకి దిగారు. టీడీపీ తమ్ముళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న 13 వెయ్యి రూపాయల నోట్లను సీపీఎం నేతలు తహసీల్దార్ శివరావుకు అప్పగించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కోడ్ ఉల్లంఘించి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ప్రచారం నిర్వహించారు.  పోలింగ్ కేంద్రం వద్ద సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. గుంటూరు హిందూ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రయత్నించారు. దీనిపై అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మద్దతు దారులుపోలీసులకు ఫిర్యాదు చేశారు.  మళ్లీ ఇదే కేంద్రానికి వెళ్లేందుకు మంత్రి రావెల కిషోర్‌బాబు యత్నించగా వామపక్ష కార్యకర్తలు చెప్పడంతో పోలీసులు  అడ్డుకున్నారు.
 
 ఉభయగోదావరి జిల్లాల్లో..
 ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ నేతలు రెచ్చిపోయి వ్యవహరించారు. టీడీపీ మద్దతుతో బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్యరాజు)కు ఆ పార్టీ నేతలు పూర్తిస్థాయిలో దన్నుగా నిలిచారు. ఏలూరులో మేయర్ షేక్ నూర్జహాన్, డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు పోలింగ్ కేంద్రాల వద్దే ఉన్నారు. మరో అభ్యర్థి డాక్టర్ పరుచూరి కృష్ణారావుకు టీడీపీలోని ఓ వర్గం నేతలు గుట్టుచప్పుడు కాకుండా మద్దతు ఇచ్చినట్టు ప్రచారం సాగింది.  తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో నిబంధనలు ఉల్లంఘించిన వైన్‌షాపు యజమానిపై అధికారులు కేసు నమోదు చేశారు. రాజమండ్రిలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.3 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
 
 ఒకే ఒక్క ఓటు కోసం పోలింగ్ కేంద్రం
 తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని వై.రామవరం మండలం డొంకరాయిలో కేవలం ఒక్క ఓటు కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
 
రౌడీలా బోండా తీరు: ఎమ్మెల్సీ అభ్యర్థి తాడి శకుంతల
 ‘‘ఎమ్మెల్యేగా హుందాగా వ్యవహరించాల్సిన బోండా ఉమామహేశ్వరరావు రౌడీలా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే బోండా, నగర టీడీపీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న తమ అనుచరులతో ఉన్నప్పటికీ పోలీసులు వారిని ఎందుకు అనుమతించారు. పోలీసులు టీడీపీ నేతలను మాత్రమే పోలింగ్  కేంద్రం వద్దకు అనుమతించి మీడియా ప్రతినిధులను, ఇతర పార్టీల నాయకులు ఎందుకు కట్టడి చేశారు?. ఎమ్మెల్యే బోండా తన అనుచరులతో కలసి డబ్బులు పంచి రౌడీయిజం చేశారు. శాసనసభలో మహిళల పట్ల ఆయనకు గౌరవం లేదు. బయట కూడా అలాగే ప్రవర్తిస్తే జనం ఊరుకోరు.’’
 
జిల్లా     ప్రధాన పోరు వీరి మధ్యే
 గుంటూరు-కృష్ణా    కె.ఎస్ లక్ష్మణరావు(పీడీఎఫ్), ఎ.ఎస్.రామకృష్ణ(టీడీపీ)
 ఉభయ గోదావరి జిల్లాలు    కేవీవీ సత్యనారాయణరాజు(టీడీపీ),
రాము సూర్యారావు(పీడీఎఫ్), పరుచూరి కృష్ణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement