ఆత్మగౌరవంపై అంతర్మథనం
Published Sun, Sep 1 2013 1:58 AM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM
సాక్షి, గుంటూరు :రాష్ట్ర విభజన ప్రకటనతో ఆగ్రహోదగ్రులైన సమైక్యవాదులు ఉవ్వెత్తున ఉద్యమబాట పట్టిన తరుణంలో దానికి పరోక్ష కారకుడిగా ముద్రపడిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో తలపెట్టిన బస్సు యాత్ర ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన రేపుతోంది. తెలంగాణ విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి తగుదునమ్మా అంటూ ఆ లేఖ ఇవ్వటానికిగల కారణాలు చెప్పేందుకు తెలుగు ఆత్మగౌరవ యాత్ర చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యమానికి కేంద్రబిందువుగా మారిన గుంటూరు జిల్లాలోనే ఈ యాత్ర కూడా మొదలుపెట్టడం ఇక్కడి నాయకులకు మింగుడుపడటం లేదు. గురజాల నియోజకవర్గం పొందుగల నుంచి మొదలై ఐదురోజులపాటు సత్తెనపల్లి, పెదకూరపాడు,
తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో కొనసాగనున్న ఈ యాత్ర షెడ్యూల్‌ను జిల్లాపార్టీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఇప్పటికే ప్రకటించారు. వాస్తవానికి విభజన నిర్ణయంలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన వైఖరిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో యాత్ర చేపట్టడం సరికాదేమోనన్న అనుమానాలు ఆ పార్టీ నేతల్లో అంతర్లీనంగా వినిపిస్తున్నాయి. దీనివల్ల పార్టీకి నష్టమవుతుందేమోనని అధినేత దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయనేమీ పట్టించుకోకపోవడంతో వారంతా తలలు పట్టుకుంటున్నారు.
సమైక్యవాదుల నుంచి ప్రతిఘటన తప్పదా?
విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చేసి.. కొన్నాళ్లు మౌనం దాల్చిన ఆయన అటు తరువాత కొత్త రాజధాని నిర్మించుకోవడానికి ప్యాకేజీలగురించి వాదించిన చంద్రబాబునాయుడు ఆత్మగౌరవ యాత్రకు జిల్లాలోని సమైక్యవాదులనుంచి ప్రతిఘటన తప్పదేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమం ఇంతలా సాగుతుంటే ఈ పరిస్థితుల్లో యాత్ర పేరుతో కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకంటూ పార్టీ సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. అయినా అధినేత నిర్ణయంలో మార్పు లేకపోవడంతో చేసేది లేక మిన్నకుంటున్నారు.
ఆత్మగౌరవంపై అంతర్మథనం
తెలుగుజాతి ఆత్మగౌరవం కాపాడేందుకు ఆనాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ.. ఈనాడు అదే తెలుగు ప్రజల్ని విడగొట్టేందుకు కారణమైందనే నిజాన్ని ఆ పార్టీ సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. 2008 అక్టోబర్ 18న ప్రణబ్‌ముఖర్జీకి రాసిన లేఖలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తున్నట్లు రాస్తున్నప్పుడు.. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల్ని కూడా కాపాడాలనే అంశాల్ని లేఖలో పెట్టాలని పయ్యావుల కేశవ్, దూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా వంటి కొందరు సీనియర్లు చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. అయితే ఆయన వాటిని పట్టించుకోలేదని పార్టీ వర్గాల భోగట్టా. 2009 డిసెంబర్ 7న హైదరాబాద్‌లో రోశయ్య కమిటీకి, 2012 డిసెంబర్ 27న షిండేకి రాసిన లేఖలోనూ విభజనకు కసరత్తు చేయడంటూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని ఎవరూ మరచిపోలేకపోతున్నారు.
సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని ఏర్పాటుకు రూ. 4 నుంచి 5 లక్షల కోట్లు ఇవ్వాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేయడం సీమాంధ్ర జిల్లాలవాసులకు తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఇన్ని సందర్భాల్లోనూ తెలుగువారి ఆత్మగౌరవం గుర్తుకురాని చంద్రబాబు.. తాజాగా బస్సుయాత్ర పేరుతో జిల్లాలోకి అడుగిడటంపైన సమైక్యవాదులు రగిలిపోతున్నారు. టీడీపీ నేతలు కూడా సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షల్లో కూర్చున్నా.. ప్రజల ఆదరణను దక్కించుకోవడంలో విఫలమయ్యారు. ఇప్పుడు నేరుగా అధినేతే జనంలోకి వస్తే ఎలాంటి పరాభవాన్ని ఎదుర్కొనాల్సి వస్తుందేమోనన్న ఆందోళన పార్టీవర్గాల్లో వ్యక్తమవుతోంది.
Advertisement
Advertisement