
పశ్చిమగోదావరి, చాటపర్రు (ఏలూరు రూరల్) : సోమవారం ఓ కరపత్రం టీడీపీ నేతలను కలవర పెట్టింది. గ్రామంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ఎండగడుతూ కొందరు వ్యక్తులు ప్రచురించిన కరపత్రం టీడీపీ నాయకుల చేతుల్లో పడింది. దీన్ని చదివిన నాయకులు ఉలిక్కిపడ్డారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రండి అంటూ చింతమనేని సవాల్ విసిరారు. వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక పెట్రోల్‌బంక్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఇదే సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఆదివారం రాత్రి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు పంపిణీ చేసిన కరపత్రాలను చింతమనేని ప్రభాకర్‌కు చూపించారు. గ్రామంలోని సుమారు 450 ఎకరాల చెరువులో అక్రమంగా చేపల సాగు చేస్తూ టీడీపీ నాయకులు దొంగచాటుగా లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారని కరపత్రంలో రాసి ఉంది. పాత మరుగుదొడ్లకు సున్నం కొట్టడంతో పాటు ఒకే ఇంట్లో రెండు లేదా మూడు దొడ్లు నిర్మించామంటూ లక్షల రూపాయలు బొక్కేశారని ఆరోపించారు. ఉపాధిహామీ పథకం పనుల్లో తప్పుడు మస్తర్లు వేసి టీడీపీ నాయకులు ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు కాజేశారని చెప్పారు. రూ.1.50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని రాశారు. ప్రజాస్వామ్యంలో బాధ్యత కల్గిన పౌరుడిగా ఈ పత్రాన్ని పంపిణీ చేస్తున్నట్టు కరపత్రంలో ఉంది. ఈ మొత్తం పాఠాన్ని చదివిన చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాసిన వాడికి దమ్ముంటే అభివృద్ధి పనులపై బహిరంగ చర్చలకు రావాలని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment