బీసీలకు ‘పచ్చ’ పార్టీ ఎర్రజెండా
Published Tue, Mar 11 2014 12:39 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :జిల్లాలో బీసీ సామాజికవర్గాల్లో బలమైన శెట్టిబలిజలకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒక సీటు ఇవ్వడమే గగనంగా కనిపిస్తోంది. ఆ వర్గం నుంచి బలమైన నేతగా గుర్తింపు పొందిన కొత్తపేట నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం(ఆర్‌ఎస్)కు ఇప్పటికే జెల్ల కొట్టింది. ‘ఆకాశంలో మబ్బులను చూసి ముంతలోని నీళ్లు ఒలకబోసుకున్న..’ చందంగా ఆర్‌ఎస్‌ను పక్కనబెట్టి తిరిగి పార్టీ లో చేరిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఆ నియోజకవర్గ టిక్కెట్ కట్టబెట్టారు. జిల్లాలో చంద్రబాబు బీసీలకు ఏ మేరకు మేలు చేస్తున్నారో, ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో ఇదో తార్కాణం. కొత్తపేటలో బీసీలను చిన్నచూపు చూసి, మరో సామాజికవర్గానికి పెద్దపీట వేసిన చంద్రబాబు అదే ఫార్ములా అమలుకు ఇప్పుడు రామచంద్రపురంలో కూడా తెర తీశారు.
సోమవారం రామచంద్రపురంలో చోటు చేసుకున్న పరిణామాలు బీసీ సామాజికవర్గాన్ని ఆత్మావలోకనంలోకి నెట్టేశాయి. రామచంద్రపురం టిక్కెట్ ఇవ్వకుండా పార్టీలో అణగదొక్కేస్తున్నారని, తమకు ఇచ్చే ప్రాధాన్యం ఏమిటో చెప్పాలని బీసీ నేతలు స్థానిక బలుసు కల్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో నిలదీసే వరకు వెళ్లింది. ఈ సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే మేడిశెట్టి రామారావు, జెడ్పీ ైమాజీ చెర్మన్ గుత్తుల బులిరాజు, మాజీ ఎంపీపీ ఇళ్ల సూర్యనారాయణ, అంగర చినగౌడ్ తదితరులు సమావేశం నుంచి బయటకు వచ్చేయడంతో వారిని బుజ్జగించడంపార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్పకు తల ప్రాణం తోకకు వచ్చినంత పనైంది. ఆ సీటు ఆశించిన ఆ వర్గ నాయకుడు కట్టా సూర్యనారాయణ ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. మరో సామాజికవర్గానికి చెందిన నాయకుడు యూవీవీఎస్ చౌదరి సమావేశం ప్రారంభంలోనే బయటికి వెళ్లిపోయి చివరకు పార్టీకి రాజీనామా కూడా చేశారు.
ఉన్న సీటునే
లాగేసుకుంటారా.. బాబూ?
ఈ రకంగా బీసీలను పార్టీలో అణగదొక్కే కుట్ర జరుగుతుండగా, అదే వైఎస్సార్ కాంగ్రెస్ మూడు చోట్ల ప్రాతినిధ్యం కల్పించేందుకు సిద్ధపడుతున్న విషయాన్ని వర్గం నేతలు గుర్తు చేస్తున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గోదావరి జిల్లాల నుంచి తమ సామాజికవర్గానికి రెండు మంత్రి పదవులు కూడా ఇవ్వగా, చంద్రబాబు ఉన్న సీటునే లాగేసుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా తమ వర్గానికి కేటాయించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.
జిల్లాలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న తమ సామాజికవర్గాన్ని ఒక్క కాకినాడ రూరల్ స్థానానికే పరిమితం చేస్తారా అని ఆ వర్గ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. కాగా తాజా పరిణామాలు టీడీపీలో బీసీ నేతలను పదవులు, ప్రాధాన్యంపరంగా తొక్కేసే చంద్రబాబు తీరును తేటతెల్లం చేస్తున్నాయంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బీసీ నేతలుగా రెడ్డి సుబ్రహ్మణ్యం, గుత్తుల పార్టీ కోసం శ్రమించగా ఇప్పుడు చంద్రబాబు ‘ఏరుదాటి తెప్ప తగలేసిన’ చందంగా వ్యవహరిస్తున్నారని కేడర్ మండిపడుతోంది. జిల్లాలో ఒక బలమైన సామాజికవర్గానికి కనీస ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీసీలను చిన్నచూపు చూసిన ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదన్న వాస్తవాన్ని వచ్చే వరుస ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు రుచి చూపిస్తామని ఆ వర్గ నేతలు హెచ్చరిస్తున్నారు.
Advertisement
Advertisement