శ్రీకాకుళంలో షాడో మంత్రి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో ఇప్పుడు షాడో మంత్రి బయల్దేరాడు. మంత్రి పేరిట పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు వసూళ్ల దందాకు పాల్పడుతున్నాడు. ప్రభుత్వ అధికారిగా ఉంటూనే మంత్రి..తానేం చెబితే అంతేనంటూ అధికారుల్ని, నాయకుల్ని ఆడిస్తున్నారని సమాచారం. ఇతనిది మంత్రి సామాజిక వర్గం కావడంతో ఆ అమాత్యులు ఏమీ అనడం లేదు అని తెలుస్తోంది. కులం పేరుతో హవా చెలాయిస్తుండడమే కాకుండా మంత్రి పేరుతో వసూళ్లకు పాల్పడుతుండడాన్ని టీడీపీ కార్యకర్తలు సీరియస్‌గా తీసుకున్నారు. శుక్రవారం నుంచి పట్టణంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దృష్టికి నాయకులు ఈ విషయాల్ని తీసుకువెళ్లాని చూస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ విస్తరణాధికారుల బదిలీల్లో అధికారి చేతివాటం చూపించి భారీ వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అడిగినంతా ఇవ్వకపోతే దూర ప్రాంతాలకు బదిలీ చేయించేస్తానని బెదిరించినట్టు సమాచారం.
ఆఫీస్‌కూ డుమ్మా
స్థానిక రూరల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఈయన కొన్నాళ్లగా ఆఫీసుకు వెళ్లడం లేదు. మంత్రి స్థానికంగా ఉంటే ఆయన వెంట వెళ్లాలని చెబుతూ, మంత్రి ఊళ్లో లేకపోతే తనకు పనులు అప్పగించారని చెబుతూ తిరుగుతున్నాడని సిబ్బంది అంటున్నారు. ఇటీవల అంగన్‌వాడీలకు క్రీడాపరికరాలు సమకూర్చే నిమిత్తం రూ.20 లక్షలు మంజూరైతే అందులోనూ దండుకున్నారని సమాచారం. అలాగే జన్మభూమి కార్యక్రమ నిర్వహకులకు ప్రభుత్వం ఒక్కో పంచాయతీకి రూ.8 వేలు మంజూరు చేస్తే అందులోనూ తనకు వాటా ఇవ్వాలని అధికారి పట్టుబట్టారు. బట్టేరు ఇసుక ర్యాంప్‌లో స్థానిక టీడీపీ నేతతో కలసి సొమ్ము వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
యూనిఫాంలోనూ కక్కుర్తే
ఏటా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే యూనిఫాం విషయంలో కూడా షాడో మంత్రి ఒత్తిళ్లు తెచ్చినట్టు తెలిసింది. మహిళా సంఘాల నేతృత్వంలో యూనిఫాం కుట్టించాల్సింది పోయి ఈ కాంట్రాక్ట్‌ను పొరుగు జిల్లా వ్యక్తికి కట్టబెట్టడం ద్వారా రూ.లక్షలు చేతులు మారాయని సమాచారం. 2లక్షల మందికి పైగా విద్యార్థులకు యూనిఫాం కుట్టించేం దుకు జిల్లా వాసులకు కాంట్రాక్ట్ అప్పగించాల్సింది పోయి పొరుగు జిల్లా వ్యక్తికి కట్టబెట్టడం వెనుక భారీగా ఒత్తిళ్లు పనిచేశాయని చేశాయని పలువురు చెబుతున్నారు.