నిషిత్ తన స్నేహితుడు రాజా రవిచంద్ర వర్మ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి నారాయణ కుమారుడి నిషిత్ మృతికి అతివేగమే కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. నిషిత్ తన స్నేహితుడు రాజా రవిచంద్ర వర్మతో కలిసి గతరాత్రి బెంజ్ కారులో రైడ్‌కు వెళ్లాడు. అయితే హైదరాబాద్‌లో గతరాత్రి ఈదురు గాలులతో భారీవర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దాంతో వారిద్దరూ వర్షం తెరిపి ఇచ్చేవరకూ కొద్దిసేపు ఓ స్నేహితుడి ఇంట్లో వేచి ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం స్నేహితులు ఇద్దరూ కారులో బయల్దేరారని, అయితే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టినట్లు సమాచారం.
తెల్లవారుజామున రెండు, రెండున్నర సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అక్కడ ఉన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అతివేగంగా పిల్లర్‌ను ఢీకొనడంతో కారు ముందుభాగం మధ్యలోకి వచ్చేయడంతో పాటు బెలూన్స్ కూడా పగిలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. దాంతో వారిద్దరూ చిక్కకుపోవడంతో ఛాతీ, పొట్ట భాగంగా చిధ్రమైనట్లు తెలిపారు. వారిని కారులో నుంచి బయటకు తీయడానికి సుమారు రెండు గంటల సమయం పట్టినట్లు చెబుతున్నారు.
అలాగే ప్రమాద సమయంలో వీరిద్దరూ సీటు బెల్టు పెట్టుకోలేదని కూడా చెబుతున్నారు. దుర్ఘటన జరిగిన గంట తర్వాత పోలీసులు అక్కడకు చేరుకున్నట్లు తెలిపారు. నిషిత్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, అతని స్నేహితుడు రాజా రవిచంద్ర వర్మలో కొద్దిగా కదలికలు కనిపించాయని, దీంతో 108కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. వారిద్దర్ని అపోలో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం ఉస్మానియా వైద్యులు మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించారు.