
‘సాయంత్రంలోగా నీ అంతు చూస్తా...’
► వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థికి టీడీపీ ఎమ్మెల్యే హెచ్చరిక
►సోదరుడి కుమారుడిపై పోటీ చేయడమే..
► సైకిల్‌కు ఓటు వేయాలంటూ ప్రచారం
సాక్షి, కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే(టీడీపీ) వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు), ఆయన సోదరుడు సత్యనారాయణ హద్దుమీరి ప్రవర్తించారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను బెదిరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. నిబంధనలను ఉల్లంఘించారు. ఎన్నికల కేంద్రాల వద్ద ప్రచారం చేశారు.
‘సాయంత్రం నాలుగు గంటలకల్లా నీ అంతు చూస్తా’ అంటూ వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి అంకడి సత్తిబాబును ఎమ్మెల్యే కొండబాబు బెదిరించారు. ఎమ్మెల్యే కొండబాబు అన్న సత్యనారాయణ కుమారులు ఉమాశంకర్ 14వ డివిజన్, ప్రసాద్ 23వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు.
14వ డివిజన్ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా అంకడి సత్తిబాబు బరిలోకి దిగారు. ఎక్కడ తన కుమారుడు ఓడిపోతాడోనన్న భయంతో వనమాడి సత్యనారాయణ మంగళవారం 14వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభపెట్టారు. తన కుమారుడికి ఓటు వేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద తిష్టవేసిన టీడీపీ నేతలను ఎందుకు అడ్డుకోవడం లేదని సత్తిబాబు పోలీసులను ప్రశ్నించారు. దీంతో వనమాడి సత్యనారాయణ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి సత్తిబాబుపై బూతు పురాణం అందుకున్నారు.
ఇంతలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కొండబాబు.. సత్తిబాబు వైపు వేలు చూపిస్తూ ‘సాయంత్రం నాలుగు గంటల్లోపు నీ అంతు చూస్తా’ అని బెదిరించారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే కొండబాబు కాకినాడలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ సైకిల్‌కు ఓట్లు వేయాలని ప్రచారం చేశారు. అంతేకాకుండా తన అనుచరులతో పలు డివిజన్లలో భారీగా దొంగ ఓట్లు వేయించారు.