సాక్షి ప్రతినిధి, కాకినాడ : నేతల మధ్య విభేదాలు... పార్టీ ప్రతిష్టను దిగజార్చుతూ జరుగుతున్న వరుస పరిణామాలతో టీడీపీ వర్గాలు అంతర్మధనంలో పడ్డాయి. ముఖ్యంగా కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న అంతర్గత పోరుతో ఎప్పటికప్పుడు పార్టీ రచ్చకెక్కడం ఆందోళన రేకెత్తిస్తోంది. రెండు నెలల కిందట ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగడం... ఇటీవల ఆయిల్ మాఫియా నడుపుతున్న టీడీపీ నేతల బాగోతం బయటపడటం... తాజాగా ప్రభుత్వ రోడ్డును ఎమ్మెల్యే కొండబాబు కుటుంబీకులు ధ్వంసం చేయడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందన్న భయం నెలకొంది.
విభేదాలెన్నెన్నో....
కాకినాడ అంతా తనదిగా భావిస్తూ, ఏం చేసినా అడిగే వారు లేరనే ధోరణితో ఎమ్మెల్యే కొండబాబు వ్యవహరించడం కొందరు టీడీపీ నేతలకు నచ్చడం లేదు. ఇక్కడ ఎవరూ వేలు పెట్టకూడదని, మంత్రైనా సరే అనే ధోరణిలో నియంతృత్వ పోకడకు పోతున్నారంటూ సహ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడుతోంది. దీంతో కొండబాబు లక్ష్యంగా పార్టీలోని ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. ఆయన కుటుంబీకులు, అనుచరులచే దందా సాగిస్తున్నారని, ముఖ్యంగా ఎమ్మెల్యే కొండబాబు సోదరుడు సత్యనారాయణ సూపర్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులతో గత కొంతకాలంగా వైరం కొనసాగిస్తున్నారు. ఆ మధ్య పిల్లి సత్తిబాబు లక్ష్యంగా పరోక్ష ఆరోపణలకు దిగారు. దందాలన్నీ వారే చేస్తున్నారని, అక్రమాలన్నీ అక్కడే జరుగుతున్నాయని పార్టీ కార్యకర్తల సమావేశంలో బహిర్గతమయ్యారు.
మరో సందర్భంలో మంత్రి చినరాజప్పపై కూడా పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించినట్టు పార్టీలో చర్చ జరిగింది. మంత్రి సోదరుడే ఎక్కువగా సెటిల్‌మెంట్లు, దందాలు చేస్తూ ఆరోపణలకు దిగినట్టు విస్తృత ప్రచారం సాగింది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ముందస్తుగా పసిగట్టి కొండబాబు హవాకు చెక్ పెట్టే ప్రయత్నాలు ప్రత్యర్థులు చేస్తున్నారు. ఆ మధ్య కాకినాడ కార్పొరేషన్ మేయర్ గిరీని తన వర్గీయునికి దక్కకుండా అధిష్టానం స్థాయిలో అంతర్గత ప్రత్యర్థులు చక్రం తిప్పారు. డిప్యూటీ మేయర్ పదవి కూడా కొండబాబు వర్గానికి దక్కకుండా హైజాక్ చేశారు. చివరికీ కో ఆప్షన్ పదవుల్లో కూడా కొండబాబుకు చెక్ పెట్టారు. అంతేకాకుండా ఆయిల్ మాఫియాలో కీలకంగా వ్యవహరించిన కొండబాబు అనుచరుడు గ్రంధి బాబ్జీ విషయంలోనూ ఆరోపణలు గుప్పుమన్నాయి..
తాజాగా రోడ్డు విషయంలో...
మహలక్ష్మీనగర్‌లో రోడ్డు వేయకముందే ఆ స్థలం తమదని, ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయవద్దని రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ దృష్టికి ఎమ్మెల్యే కొండబాబు తీసుకెళ్లినట్టు సమాచారం. కానీ రూరల్ ఎమ్మెల్యే అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలా అనుకున్నట్టుగానే అక్కడ చకచకా రోడ్డు వేసేశారు. తాను చెప్పినట్టుగా వినకుండా ఏకపక్షాన రోడ్డు వేశారన్న అక్కసుతో ఎమ్మెల్యే కుటుంబీకులు ధ్వంస రచనకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంకేముంది రూరల్ ఎమ్మెల్యే పిల్లి దంపతులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మద్దతుగా నిలుస్తున్న మంత్రి కూడా అంతర్గతంగా పావులు కదిపారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి జరిగిన పరిణామాలను వివరించినట్టు తెలిసింది. « కలెక్టర్ ఆదేశాలతో ఎమ్మెల్యే కుటుంబీకులపై ఫిర్యాదు చేసే విషయంలో తీవ్ర ఒత్తిళ్లకు గురయ్యారు.
నష్ట నివారణకు రంగంలోకి అధిష్టానం...
కాకినాడలోని మహలక్ష్మీనగర్‌లో ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్డును ఎమ్మెల్యే కొండబాబు «కుటుంబీకులు ధ్వంసం చేసిన ఘటనతో టీడీపీ పరువు మంటగలిసిపోయింది. అధికారం ఉందని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. తమ వేగుల ద్వారా విషయాన్ని తెలుసుకుని అధిష్టానం రంగంలోకి దిగింది. నష్ట నివారణకు చర్యలకు ఉపక్రమించింది. విచారణకు ఆదేశాలిస్తే వివాదాన్ని పక్కదారి పట్టించొచ్చన్న ఉద్దేశంతో కలెక్టర్‌కు సీఎం వ్యూహాత్మక ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. సీఎం ఆగ్రహం, ఆదేశాలపై లీకులిచ్చి సీరియస్‌ను తగ్గించే ప్రయత్నం జరిగింది. కానీ ఆ రోజు దగ్గరి నుంచి ఇంతవరకు ఘటనపై అధికార వర్గాలు నోరు మెదపడం లేదు. విచారణాధికారిగా ట్రైనీ కలెక్టర్‌ను నియమించినా ఇంతవరకు విచారణ ముందుకు సాగడం లేదు. కింది స్థాయి అధికారులు కూడా ఆ వివాదం జోలికి పోవడం లేదు. ఎవరో ఒకరి చేత ధ్వంసం చేసిన రోడ్డును వేయించేసి వివాదాన్ని ముగించేసేందుకు యత్నాలు కూడా జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment