Rural mla
-
పోతోంది ‘దేశం’ పరువు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : నేతల మధ్య విభేదాలు... పార్టీ ప్రతిష్టను దిగజార్చుతూ జరుగుతున్న వరుస పరిణామాలతో టీడీపీ వర్గాలు అంతర్మధనంలో పడ్డాయి. ముఖ్యంగా కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న అంతర్గత పోరుతో ఎప్పటికప్పుడు పార్టీ రచ్చకెక్కడం ఆందోళన రేకెత్తిస్తోంది. రెండు నెలల కిందట ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగడం... ఇటీవల ఆయిల్ మాఫియా నడుపుతున్న టీడీపీ నేతల బాగోతం బయటపడటం... తాజాగా ప్రభుత్వ రోడ్డును ఎమ్మెల్యే కొండబాబు కుటుంబీకులు ధ్వంసం చేయడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందన్న భయం నెలకొంది. విభేదాలెన్నెన్నో.... కాకినాడ అంతా తనదిగా భావిస్తూ, ఏం చేసినా అడిగే వారు లేరనే ధోరణితో ఎమ్మెల్యే కొండబాబు వ్యవహరించడం కొందరు టీడీపీ నేతలకు నచ్చడం లేదు. ఇక్కడ ఎవరూ వేలు పెట్టకూడదని, మంత్రైనా సరే అనే ధోరణిలో నియంతృత్వ పోకడకు పోతున్నారంటూ సహ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడుతోంది. దీంతో కొండబాబు లక్ష్యంగా పార్టీలోని ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. ఆయన కుటుంబీకులు, అనుచరులచే దందా సాగిస్తున్నారని, ముఖ్యంగా ఎమ్మెల్యే కొండబాబు సోదరుడు సత్యనారాయణ సూపర్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులతో గత కొంతకాలంగా వైరం కొనసాగిస్తున్నారు. ఆ మధ్య పిల్లి సత్తిబాబు లక్ష్యంగా పరోక్ష ఆరోపణలకు దిగారు. దందాలన్నీ వారే చేస్తున్నారని, అక్రమాలన్నీ అక్కడే జరుగుతున్నాయని పార్టీ కార్యకర్తల సమావేశంలో బహిర్గతమయ్యారు. మరో సందర్భంలో మంత్రి చినరాజప్పపై కూడా పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించినట్టు పార్టీలో చర్చ జరిగింది. మంత్రి సోదరుడే ఎక్కువగా సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ ఆరోపణలకు దిగినట్టు విస్తృత ప్రచారం సాగింది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ముందస్తుగా పసిగట్టి కొండబాబు హవాకు చెక్ పెట్టే ప్రయత్నాలు ప్రత్యర్థులు చేస్తున్నారు. ఆ మధ్య కాకినాడ కార్పొరేషన్ మేయర్ గిరీని తన వర్గీయునికి దక్కకుండా అధిష్టానం స్థాయిలో అంతర్గత ప్రత్యర్థులు చక్రం తిప్పారు. డిప్యూటీ మేయర్ పదవి కూడా కొండబాబు వర్గానికి దక్కకుండా హైజాక్ చేశారు. చివరికీ కో ఆప్షన్ పదవుల్లో కూడా కొండబాబుకు చెక్ పెట్టారు. అంతేకాకుండా ఆయిల్ మాఫియాలో కీలకంగా వ్యవహరించిన కొండబాబు అనుచరుడు గ్రంధి బాబ్జీ విషయంలోనూ ఆరోపణలు గుప్పుమన్నాయి.. తాజాగా రోడ్డు విషయంలో... మహలక్ష్మీనగర్‌లో రోడ్డు వేయకముందే ఆ స్థలం తమదని, ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయవద్దని రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ దృష్టికి ఎమ్మెల్యే కొండబాబు తీసుకెళ్లినట్టు సమాచారం. కానీ రూరల్ ఎమ్మెల్యే అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలా అనుకున్నట్టుగానే అక్కడ చకచకా రోడ్డు వేసేశారు. తాను చెప్పినట్టుగా వినకుండా ఏకపక్షాన రోడ్డు వేశారన్న అక్కసుతో ఎమ్మెల్యే కుటుంబీకులు ధ్వంస రచనకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంకేముంది రూరల్ ఎమ్మెల్యే పిల్లి దంపతులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మద్దతుగా నిలుస్తున్న మంత్రి కూడా అంతర్గతంగా పావులు కదిపారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి జరిగిన పరిణామాలను వివరించినట్టు తెలిసింది. « కలెక్టర్ ఆదేశాలతో ఎమ్మెల్యే కుటుంబీకులపై ఫిర్యాదు చేసే విషయంలో తీవ్ర ఒత్తిళ్లకు గురయ్యారు. నష్ట నివారణకు రంగంలోకి అధిష్టానం... కాకినాడలోని మహలక్ష్మీనగర్‌లో ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్డును ఎమ్మెల్యే కొండబాబు «కుటుంబీకులు ధ్వంసం చేసిన ఘటనతో టీడీపీ పరువు మంటగలిసిపోయింది. అధికారం ఉందని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. తమ వేగుల ద్వారా విషయాన్ని తెలుసుకుని అధిష్టానం రంగంలోకి దిగింది. నష్ట నివారణకు చర్యలకు ఉపక్రమించింది. విచారణకు ఆదేశాలిస్తే వివాదాన్ని పక్కదారి పట్టించొచ్చన్న ఉద్దేశంతో కలెక్టర్‌కు సీఎం వ్యూహాత్మక ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. సీఎం ఆగ్రహం, ఆదేశాలపై లీకులిచ్చి సీరియస్‌ను తగ్గించే ప్రయత్నం జరిగింది. కానీ ఆ రోజు దగ్గరి నుంచి ఇంతవరకు ఘటనపై అధికార వర్గాలు నోరు మెదపడం లేదు. విచారణాధికారిగా ట్రైనీ కలెక్టర్‌ను నియమించినా ఇంతవరకు విచారణ ముందుకు సాగడం లేదు. కింది స్థాయి అధికారులు కూడా ఆ వివాదం జోలికి పోవడం లేదు. ఎవరో ఒకరి చేత ధ్వంసం చేసిన రోడ్డును వేయించేసి వివాదాన్ని ముగించేసేందుకు యత్నాలు కూడా జరుగుతున్నాయి. -
అజ్ఞాతంలోకి టీడీపీ మహిళా ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికారులు పట్టించుకోలేదని ఇప్పటికే అలక మీదున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మరోసారి తన అక్కసును వెళ్లబుచ్చారు. తనను అవమానించేలా వ్యవహరించారని బీచ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు ఆమె భర్త, రూరల్ ప్రజాప్రతినిధులు కూడా కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. జరిగిన పరాభవాన్ని తట్టుకోలేక ఏకంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జిల్లా మంత్రులు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. దీంతో అట్టహాసంగా ప్రారంభిద్దామనుకున్న బీచ్ ఫెస్టివల్‌కు ఆదిలోనే నేతల షాక్ తగిలినట్టయ్యింది. భర్తను వేదికపైకి పిలవలేదని.. గతేడాది జరిగిన బీచ్ ఫెస్టివల్లో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రతికూల పరిస్థితి ఎదురైంది. సీఎం సమక్షంలో జరిగిన ప్రారంభ వేడుకల్లో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని పిలిచి ఆమె భర్త సత్తిబాబును పిలవకపోవడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున వేదిక వద్ద నిరసనతో పాటు ఆందోళన చేశారు. వేదికపైకి ఎక్కిన ఎమ్మెల్యేను కిందికి దిగిపోవాలని పిల్లి అనుచరులందరూ పెద్ద పెద్ద నినాదాలతో హల్చల్ చేశారు. వాస్తవానికి, ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమం. ఏ పదవిలోనూ లేని పిల్లి సత్తిబాబును పిలవాల్సిన అవసరం లేదు. అధికారులు అనుసరించిన తీరు సరైనదే. కానీ ఎమ్మెల్యే భర్త అన్న హోదాలో పిలవాలన్న డిమాండ్‌తో పరిస్థితి చేయిదాటిపోతుండడంతో సీఎం జోక్యం చేసుకుని పిల్లి సత్తిబాబును వేదికపైకి పిలిచారు. దీంతో వివాదం సద్దుమణిగింది. పట్టించుకోలేదన్న ఆవేదన బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్ల నుంచి ప్రారంభోత్సవం వరకు తనను పట్టించుకోలేదన్న ఆవేదనతో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్తిబాబు ఉన్నారు. అన్నీ తమకు తెలిసే జరగాలన్న అభిప్రాయంతో ఉన్న వారిని అధికారులు పట్టించుకోలేదు. ఇది పార్టీ కార్యక్రమం కాదని, పూర్తిగా అధికారిక కార్యక్రమమని అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంకేముంది రూరల్ ఎమ్మెల్యేకు రుచించలేదు. దీంతో ఎమ్మెల్యే వర్గం రగిలిపోతూ వచ్చింది. ప్రారంభోత్సవానికి గైర్హాజర్ అవమాన బాధతో కుంగిపోయి ఏకంగా ప్రారంభోత్సవానికి గైర్హాజయ్యారు. తమ ఎమ్మెల్యేకు పరాభవం జరిగిందని ఆ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ, సర్పంచ్‌లు, ఇతర నాయకులు కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఈ పరిణమాలను గమనించిన మంత్రులు కళా వెంకటరావు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప మంగళవారం ఉదయం నుంచి ‘ఎమ్మెల్యే అనంతలక్ష్మి’ ఫ్యామిలీకి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, ఎమ్మెల్యే, ఆమె భర్త, ఇతర నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో బుజ్జగింపు కుదరలేదు. ఎంత యత్నించినా ఫోన్లో కూడా ఎమ్మెల్యే అందుబాటులో రాకపోవడంతో చేసేదేం లేక షెడ్యూల్ ప్రకారంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంత్రులు కానిచ్చేశారు. అక్కసుతోనే.. అవమాన భారంతో రగిలిపోతున్న రూరల్ ఎమ్మెల్యేకు అధికారులు తీసుకున్న తాజా నిర్ణయం మరో సంకటంగా పరిణమించింది. వీఐపీ పాసులు తక్కువగా జారీ చేయడం గాయంపై కారం చల్లినట్టయ్యింది. పాసుల విషయంలో నియంత్రణ పాటించడంతో రూరల్ ఎమ్మెల్యే తట్టుకోలేక పోయారు. తన నియోజకవర్గ పరిధిలో జరిగిన కార్యక్రమానికి పాసుల పరిమితి ఏంటంటూ అధికారులపై విరుచుకుపడటం ప్రారంభించారు. ఇదే సందర్భంలో కొన్ని రోజులుగా ఎదురవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కినుక వహించారు. అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని, కనీసం కార్యక్రమానికి రమ్మని ఆహ్వానం పలకలేదని, ఏర్పాట్లలో కార్పొరేషన్ అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారని, ఫెస్టివల్‌కు ముందు నిర్వహించిన 2కే రన్‌కు ఆహ్వానించలేదని, తన సలహా లేకుండా, మాట వరస చెప్పకుండా ఏర్పాట్లన్నీ చేశారని, ప్రోటోకాల్ విషయంలో మేయర్కిచ్చిన ప్రాధాన్యం తనకు ఇవ్వలేదని, రూరల్‌లో జరిగిన కార్యక్రమంలో మేయర్‌కు పెద్దపీట వేయడమేంటన్న అక్కసుతో అలకబూనారు. -
సింహగర్జన
నెల్లూరు (సెంట్రల్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో ఎదురుకానున్న సమస్యలను అన్నివర్గాలు తలచుకుంటూ సింహపురిలో కార్మిక, కర్షక, విద్యార్థి, వృత్తిదారులు కదంతొక్కారు. ఏకంగా ఆరు దఫాలకు పైగా కలెక్టరేట్ మంగళవారం ముట్టడికి గురి కావడంతో కార్యకలాపాలు స్తంభించాయి. రాష్ట్రాన్ని విభజించిన సోనియాగాంధీకి కేంద్రమంత్రి పనబాక లక్ష్మి మద్దతు పలకడంపై జనాగ్రహం పెల్లుబికింది. ఏపీ ఎన్జీఓల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పనబాక లక్ష్మి ఇంటిని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు నగరంలో నాయీబ్రాహ్మణ, సింహపురి ఆటో మొబైల్స్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి మద్దతు పలికారు. వైఎస్సార్సీపీ నెల్లూరు నగర, రూరల్ సమన్వయకర్తలు పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీబొమ్మ, ఏసీ సెంటర్, ఎన్టీఆర్ సెంటర్, బోసు బొమ్మమీదుగా పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు జరిగిన భారీ ర్యాలీలో వేలాది మంది పాల్గొనడంతో ఒక్కసారిగా ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఈ ర్యాలీలో కేసీఆర్, సోనియా వేషధారణల్లో ఉన్న వ్యక్తులను చూసి మహిళలు దూషణల పర్వం కొనసాగించారు. అఘోరాలకన్నా ఘోరాతి ఘోరంగా సోనియా రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేస్తోం దంటూ మహిళలు శాపనార్థాలు పెట్టారు. సమైక్యాం ధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్లో సోనియాకు శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. న్యాయవాదులు, రిజిస్ట్రేషన్ శాఖాధికారుల ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. తెలుగు యువత ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్లో మూడు గాడిదలకు సోనియా, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ బొమ్మలను కట్టి వాటిపై కోడిగుడ్లు, టమోటాలు, రాళ్లతో దాడి చేసి సమైక్యాంధ్ర ఇవ్వకుంటే అసలు వ్యక్తులకు ఇదేగతి పడుతుందంటూ యువకులు నినాదాలు చేశారు. విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ విద్యుత్ భవన్ నుంచి పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించారు. కావలిలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర జేఏసీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మద్దూరుపాడు జాతీయ రహదారిపై లారీ ఓనర్స్ అసోసియేషన్ రాస్తారోకోతో పాటు వంటా వార్పు నిర్వహించి సమైక్య నినాదాలు చేశారు. సోనియా వేషధారణతో ఉన్న వ్యక్తిపై మహిళలు చెప్పులతో దాడి చేసి సోనియాకు ఇదే గతి పడుతుందంటూ హెచ్చరించారు. జవహర్‌భారతి పీజీ, డిగ్రీ, ఇంటర్ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తరగతులను బహిష్కరించి ర్యాలీలు నిర్వహించారు. కావలిలో మున్సిపల్ ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి ఉద్యోగులను ఉద్యమంలోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. పొదలకూరులో ఆటోలు, సు మోల యజమానులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మనుబోలు వద్ద జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించడంతో రాకపోకలు స్తంభించాయి. వెంకటాచలంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఉదయగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జర్నలిస్టులు, కార్మిక సంఘాలు, విద్యార్థి జేఏసీ, టీడీపీ ఆధ్వర్యంలో బస్టాండు సెంటర్లో నిరసనలతో పాటు వంటావార్పు చేపట్టారు. దుత్తలూరు నర్రవాడ సెంటర్లో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సూళ్లూరుపేటలో నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనకు నిరసనగా శిరోముం డనం ద్వారా తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు. పెళ్లకూరు, నాయుడుపేట మండలాల్లోని పాఠశాలలను స్వచ్ఛందంగా మూసివేయడంతో పాటు సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలను చేపట్టారు. గూడూరులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్, నాయకులు నాసిన నాగులు, చంద్రయ్య, యువజన నాయకుడు కోడూరు వీరారెడ్డి, జేఏసీ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో తోపుడు బండ్ల వ్యాపారులు సోనియాగాంధీకి పిండ ప్రదానం చేసి మానవ హారం నిర్వహించారు. చిట్టమూరు, కోట, వాకాడు మండలాల్లో కూడా విద్యార్థులు, వివిధ సంఘాలు సోనియా, కేసీఆర్ దిష్టి బొమ్మల దహనంతో నిరసనలను వ్యక్తం చేశారు. కోవూరులో ఎన్జీఓ కార్యాలయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాయి. బుచ్చిరెడ్డిపాళెంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి నియోజక వర్గంలో రాపూరు కాశీపేట సెంటర్లో విద్యార్థి సంఘాలు సమైక్యాంధ్ర పోరాట సమితుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సోనియా దిష్టి బొమ్మలను దహనం చేశారు. అంచెలంచెలుగా సమైక్యాంధ్ర ఉద్యమం మంగళవారం నాటికి తీవ్రరూపం దాల్చింది. రాష్ట్ర విభజన మానుకొని సమైక్యాంధ్రను ప్రకటించే వరకు ఉద్యమాలను ఆపేది లేదంటూ సమైక్యాంధ్ర జేఏసీ నేతలు స్పష్టం చేశారు.