నెల్లూరు (సెంట్రల్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో ఎదురుకానున్న సమస్యలను అన్నివర్గాలు తలచుకుంటూ సింహపురిలో కార్మిక, కర్షక, విద్యార్థి, వృత్తిదారులు కదంతొక్కారు. ఏకంగా ఆరు దఫాలకు పైగా కలెక్టరేట్ మంగళవారం ముట్టడికి గురి కావడంతో కార్యకలాపాలు స్తంభించాయి. రాష్ట్రాన్ని విభజించిన సోనియాగాంధీకి కేంద్రమంత్రి పనబాక లక్ష్మి మద్దతు పలకడంపై జనాగ్రహం పెల్లుబికింది. ఏపీ ఎన్‌జీఓల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పనబాక లక్ష్మి ఇంటిని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
నెల్లూరు నగరంలో నాయీబ్రాహ్మణ, సింహపురి ఆటో మొబైల్స్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి మద్దతు పలికారు. వైఎస్సార్‌సీపీ నెల్లూరు నగర, రూరల్ సమన్వయకర్తలు పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీబొమ్మ, ఏసీ సెంటర్, ఎన్‌టీఆర్ సెంటర్, బోసు బొమ్మమీదుగా పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు జరిగిన భారీ ర్యాలీలో వేలాది మంది పాల్గొనడంతో ఒక్కసారిగా ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది.
ఈ ర్యాలీలో కేసీఆర్, సోనియా వేషధారణల్లో ఉన్న వ్యక్తులను చూసి మహిళలు దూషణల పర్వం కొనసాగించారు. అఘోరాలకన్నా ఘోరాతి ఘోరంగా సోనియా రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేస్తోం దంటూ మహిళలు శాపనార్థాలు పెట్టారు. సమైక్యాం ధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్లో సోనియాకు శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. న్యాయవాదులు, రిజిస్ట్రేషన్ శాఖాధికారుల ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్‌ను ముట్టడించారు.
తెలుగు యువత ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్లో మూడు గాడిదలకు సోనియా, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ బొమ్మలను కట్టి వాటిపై కోడిగుడ్లు, టమోటాలు, రాళ్లతో దాడి చేసి సమైక్యాంధ్ర ఇవ్వకుంటే అసలు వ్యక్తులకు ఇదేగతి పడుతుందంటూ యువకులు నినాదాలు చేశారు. విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ విద్యుత్ భవన్ నుంచి పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించారు. కావలిలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర జేఏసీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మద్దూరుపాడు జాతీయ రహదారిపై లారీ ఓనర్స్ అసోసియేషన్ రాస్తారోకోతో పాటు వంటా వార్పు నిర్వహించి సమైక్య నినాదాలు చేశారు. సోనియా వేషధారణతో ఉన్న వ్యక్తిపై మహిళలు చెప్పులతో దాడి చేసి సోనియాకు ఇదే గతి పడుతుందంటూ హెచ్చరించారు. జవహర్‌భారతి పీజీ, డిగ్రీ, ఇంటర్ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తరగతులను బహిష్కరించి ర్యాలీలు నిర్వహించారు. కావలిలో మున్సిపల్ ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి ఉద్యోగులను ఉద్యమంలోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. పొదలకూరులో ఆటోలు, సు మోల యజమానులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
మనుబోలు వద్ద జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించడంతో రాకపోకలు స్తంభించాయి. వెంకటాచలంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఉదయగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జర్నలిస్టులు, కార్మిక సంఘాలు, విద్యార్థి జేఏసీ, టీడీపీ ఆధ్వర్యంలో బస్టాండు సెంటర్‌లో నిరసనలతో పాటు వంటావార్పు చేపట్టారు. దుత్తలూరు నర్రవాడ సెంటర్లో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సూళ్లూరుపేటలో నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనకు నిరసనగా శిరోముం డనం ద్వారా తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు.
పెళ్లకూరు, నాయుడుపేట మండలాల్లోని పాఠశాలలను స్వచ్ఛందంగా మూసివేయడంతో పాటు సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలను చేపట్టారు. గూడూరులో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్, నాయకులు నాసిన నాగులు, చంద్రయ్య, యువజన నాయకుడు కోడూరు వీరారెడ్డి, జేఏసీ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో తోపుడు బండ్ల వ్యాపారులు సోనియాగాంధీకి పిండ ప్రదానం చేసి మానవ హారం నిర్వహించారు. చిట్టమూరు, కోట, వాకాడు మండలాల్లో కూడా విద్యార్థులు, వివిధ సంఘాలు సోనియా, కేసీఆర్ దిష్టి బొమ్మల దహనంతో నిరసనలను వ్యక్తం చేశారు. కోవూరులో ఎన్‌జీఓ కార్యాలయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాయి.
బుచ్చిరెడ్డిపాళెంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి నియోజక వర్గంలో రాపూరు కాశీపేట సెంటర్‌లో విద్యార్థి సంఘాలు సమైక్యాంధ్ర పోరాట సమితుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సోనియా దిష్టి బొమ్మలను దహనం చేశారు. అంచెలంచెలుగా సమైక్యాంధ్ర ఉద్యమం మంగళవారం నాటికి తీవ్రరూపం దాల్చింది. రాష్ట్ర విభజన మానుకొని సమైక్యాంధ్రను ప్రకటించే వరకు ఉద్యమాలను ఆపేది లేదంటూ సమైక్యాంధ్ర జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
సింహగర్జన
Published Wed, Aug 7 2013 4:44 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement