సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికారులు పట్టించుకోలేదని ఇప్పటికే అలక మీదున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మరోసారి తన అక్కసును వెళ్లబుచ్చారు. తనను అవమానించేలా వ్యవహరించారని బీచ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు ఆమె భర్త, రూరల్ ప్రజాప్రతినిధులు కూడా కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. జరిగిన పరాభవాన్ని తట్టుకోలేక ఏకంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జిల్లా మంత్రులు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. దీంతో అట్టహాసంగా ప్రారంభిద్దామనుకున్న బీచ్ ఫెస్టివల్‌కు ఆదిలోనే నేతల షాక్ తగిలినట్టయ్యింది.
భర్తను వేదికపైకి పిలవలేదని..
గతేడాది జరిగిన బీచ్ ఫెస్టివల్‌లో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రతికూల పరిస్థితి ఎదురైంది. సీఎం సమక్షంలో జరిగిన ప్రారంభ వేడుకల్లో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని పిలిచి ఆమె భర్త సత్తిబాబును పిలవకపోవడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున వేదిక వద్ద నిరసనతో పాటు ఆందోళన చేశారు. వేదికపైకి ఎక్కిన ఎమ్మెల్యేను కిందికి దిగిపోవాలని పిల్లి అనుచరులందరూ పెద్ద పెద్ద నినాదాలతో హల్‌చల్ చేశారు. వాస్తవానికి, ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమం. ఏ పదవిలోనూ లేని పిల్లి సత్తిబాబును పిలవాల్సిన అవసరం లేదు. అధికారులు అనుసరించిన తీరు సరైనదే. కానీ ఎమ్మెల్యే భర్త అన్న హోదాలో పిలవాలన్న డిమాండ్‌తో పరిస్థితి చేయిదాటిపోతుండడంతో సీఎం జోక్యం చేసుకుని పిల్లి సత్తిబాబును వేదికపైకి పిలిచారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
పట్టించుకోలేదన్న ఆవేదన
బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్ల నుంచి ప్రారంభోత్సవం వరకు తనను పట్టించుకోలేదన్న ఆవేదనతో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్తిబాబు ఉన్నారు. అన్నీ తమకు తెలిసే జరగాలన్న అభిప్రాయంతో ఉన్న వారిని అధికారులు పట్టించుకోలేదు. ఇది పార్టీ కార్యక్రమం కాదని, పూర్తిగా అధికారిక కార్యక్రమమని అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంకేముంది రూరల్ ఎమ్మెల్యేకు రుచించలేదు. దీంతో ఎమ్మెల్యే వర్గం రగిలిపోతూ వచ్చింది.
ప్రారంభోత్సవానికి గైర్హాజర్
అవమాన బాధతో కుంగిపోయి ఏకంగా ప్రారంభోత్సవానికి గైర్హాజయ్యారు. తమ ఎమ్మెల్యేకు పరాభవం జరిగిందని ఆ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ, సర్పంచ్‌లు, ఇతర నాయకులు కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఈ పరిణమాలను గమనించిన మంత్రులు కళా వెంకటరావు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప మంగళవారం ఉదయం నుంచి ‘ఎమ్మెల్యే అనంతలక్ష్మి’ ఫ్యామిలీకి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, ఎమ్మెల్యే, ఆమె భర్త, ఇతర నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో బుజ్జగింపు కుదరలేదు. ఎంత యత్నించినా ఫోన్‌లో కూడా ఎమ్మెల్యే అందుబాటులో రాకపోవడంతో చేసేదేం లేక షెడ్యూల్ ప్రకారంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంత్రులు కానిచ్చేశారు.
అక్కసుతోనే..
అవమాన భారంతో రగిలిపోతున్న రూరల్ ఎమ్మెల్యేకు అధికారులు తీసుకున్న తాజా నిర్ణయం మరో సంకటంగా పరిణమించింది. వీఐపీ పాసులు తక్కువగా జారీ చేయడం గాయంపై కారం చల్లినట్టయ్యింది. పాసుల విషయంలో నియంత్రణ పాటించడంతో రూరల్ ఎమ్మెల్యే తట్టుకోలేక పోయారు. తన నియోజకవర్గ పరిధిలో జరిగిన కార్యక్రమానికి పాసుల పరిమితి ఏంటంటూ అధికారులపై విరుచుకుపడటం ప్రారంభించారు. ఇదే సందర్భంలో కొన్ని రోజులుగా ఎదురవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కినుక వహించారు. అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని, కనీసం కార్యక్రమానికి రమ్మని ఆహ్వానం పలకలేదని, ఏర్పాట్లలో కార్పొరేషన్ అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారని, ఫెస్టివల్‌కు ముందు నిర్వహించిన 2కే రన్‌కు ఆహ్వానించలేదని, తన సలహా లేకుండా, మాట వరస చెప్పకుండా ఏర్పాట్లన్నీ చేశారని, ప్రోటోకాల్ విషయంలో మేయర్‌కిచ్చిన ప్రాధాన్యం తనకు ఇవ్వలేదని, రూరల్‌లో జరిగిన కార్యక్రమంలో మేయర్‌కు పెద్దపీట వేయడమేంటన్న అక్కసుతో అలకబూనారు.
Comments
Please login to add a commentAdd a comment