స్థానిక ఎమ్మెల్సీ సీటుపైనే ఆశలు!
►ఎమ్మెల్యే కోటాలో దక్కని అవకాశం
►స్థానిక సంస్థల కోటాలో అభ్యర్థిని ప్రకటించని వైనం
►మండిపడుతున్న తెలుగు తముళ్లు
►పట్టించుకోని మంత్రులు, ఎంపీలు
సాక్షిప్రతినిధి, గుంటూరు : ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించలేకపోయిన సామాజికం వర్గం వారికి ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇస్తామని టీడీపీ అధినాయకత్వం హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చడంలో టీడీపీ అధినేత చంద్రబాబు విఫలమయ్యారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో జిల్లాకు చెందిన నాయకులకు తీవ్ర నిరాశ ఎదురైంది.
స్ధానిక సంస్థల కోటాలో పోటీచేసే అభ్యర్థులను సైతం జిల్లాల వారీగా ప్రకటించిన చంద్రబాబు గుంటూరు జిల్లాలో మాత్రం పేర్లు ప్రకటించలేదు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశిం చిన కాపు సామాజిక వర్గానికి చెందిన దాసరి రాజామాస్టారు, చందు సాంబశివరావు, పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న మన్నవ సుబ్బారావు, తాడికొండ నియోజకవర్గానికి చెందిన సత్తెనపల్లి నియోజకవర్గం సీటును త్యాగం చేసిన నిమ్మకాయల రాజనారాయణ, బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్ కనీసం స్దానిక సంస్దల నుంచి అయినా అవకాశం దక్కకపోతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నారు.
వీరితోపాటు స్ధానిక సంస్ధల కోటాలో ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు సోదరుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ టీడీపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. జేఆర్ పుష్పరాజ్‌కు కార్పొరేషన్ పదవిని ఇస్తానని అధినేత హామీ ఇవ్వడంతో ఆ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు గెలిపించినా తమకు తగిన గుర్తింపు లేదని నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని ప్రాంతంగా గుంటూరు జిల్లాను ప్రకటించినా గుర్తింపు మాత్రం కృష్ణాజిల్లా నాయకులకే ఎక్కువ దక్కుతోందని, విజయవాడ పరిసరాల్లోనే అబివృద్ధి ఎక్కువుగా జరుగుతోందని ఇక్కడి నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీలు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావ పనిచేసిన నేతలకు న్యాయం జరిగే విధంగా చూడడం లేదని, కనీసం అధినేతతో పనిచేసిన నేతల పేర్లను ప్రస్తావించే ప్రయత్నం కూడా చేయడం లేదనే అభిప్రాయం వీరి నుంచి వినపడుతోంది. సరైన సమయం వచ్చినప్పుడు తమ సత్తా చూపాలని నాయకులు ఆలోచనలో ఉన్నారు.