కొత్తపల్లి గీత కులంపై సంధ్యారాణి యూటర్న్
► హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణ
► ముఖ్యమంత్రి ఆదేశాలతోనే నిర్ణయం!
►వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాల నేతలు
కాకినాడ/సాలూరు: అరకు ఎంపీ కొత్తపల్లి గీత గిరిజన మహిళ కాదని, గిరిజనులకు రిజర్వ్ చేసిన పార్లమెంట్ నియోజకవర్గంలో ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో పోటీ చేసి గెలుపొందారని, ఆమె ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఉపసంహరించుకున్నారు. గీత అసలైన గిరిజన మహిళ కాదని, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఎన్నికల్లో పోటీ చేశారని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. తనపై దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలంటూ కొత్తపల్లి గీత చేసుకున్న దరఖాస్తును న్యాయస్థానం తిరస్కరించిన విషయం విదితమే. అంతేగాక దీనిపై విచారణ జరపాల్సిందేనని స్పష్టం చేసింది. ఎంపీ గీతపై కేసు బిగుసుకుంటున్న తరుణంలో సంధ్యారాణి తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం గమనార్హం. దీనిపై ఎమ్మెల్సీ సంధ్యారాణిని మీడియా సంప్రదించగా... కేసు వాపసు తీసుకుంటున్న విషయం వాస్తవమేనని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? అని ప్రశ్నించగా.. ఆమె సమాధానం దాటవేశారు.
2014 ఎన్నికల్లో అరకు ఎంపీగా వైఎస్సార్‌సీపీ తరపున కొత్తపల్లి గీత, టీడీపీ తరపున విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ నేత గుమ్మడి సంధ్యారాణి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కొత్తపల్లి గీత విజయం సాధించారు. కానీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో గీతను టీడీపీ నాయకత్వం టార్గెట్ చేసింది. ఎస్టీ కాదని అప్పటికే గీతపై ఆరోపణలుండడంతో ఆమెపై పోటీ చేసి ఓటమి పాలైన గుమ్మడి సంధ్యారాణితో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగినట్లు ఆరోపణలున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాలతోనే ఎంపీ గీతపై తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఎమ్మెల్సీ సంధ్యారాణి పలు సందర్భాల్లో చెప్పారు. కొత్తపల్లి గీత ఎస్టీ కాదని సవాల్ చేస్తూ... అందుకు తగ్గ ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. న్యాయ పోరాటానికయ్యే ఖర్చంతా పార్టీయే భరిస్తుందని అప్పట్లో సంధ్యారాణికి చంద్రబాబు భరోసా ఇచ్చారు. దీంతో ఖర్చుకు వెనుకాడకుండా ఆమె న్యాయపోరాటం చేశారు. పిటిషన్‌పై వాదనలు జరుగుతుండగానే ఎంపీ గీత వైఎస్సార్‌సీపీకి దూరమయ్యారు. అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబు ఆదేశాలతోనే..
కొత్తపల్లి గీత టీడీపీకి మద్దతు ఇవ్వగానే చంద్రబాబు వైఖరి మార్చుకున్నారు. దీంతో గీతపై సంధ్యారాణి చేస్తున్న న్యాయ పోరాటానికి టీడీపీ నుంచి మద్దతు కరువైంది. అయిప్పటికీ పట్టు వదలకుండా ఆధారాలన్నీ సేకరించి ఆమె న్యాయస్థానంలో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రంగంలోకి దిగారు. ఐదు రోజుల క్రితం ఎమ్మెల్సీ సంధ్యారాణిని తన వద్దకు పిలుపించుకుని, గీతపై వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ఆదేశించారు.
మీరు వదిలినా మేము వదలం
ముఖ్యమంత్రి ఆదేశాలను కాదనలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ సంధ్యారాణి కోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తపల్లి గీత కుల ధ్రువీకరణను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన ఉన్నత న్యాయస్థానంలోనే రెండు రోజుల క్రితం విత్‌డ్రా పిటిషన్ వేశారు. దీంతో కొత్తపల్లి గీతకు ఎంతో ఊరట లభించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకున్న సంధ్యారాణి గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గిరిజన సంఘాల నేతలు ఆమె తీరును తప్పు పడుతున్నారు. అధినేత చెప్పారని కొత్తపల్లి గీతతో రాజీ చేసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. మీరు వదిలేసినా తాము వదిలేది లేదంటూ కొత్తపల్లి గీతపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.