![- - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/11/Kothapalli-Geetha-1.jpg.webp?itok=ZxQC9XFA)
రంపచోడవరంలో ఆమె నిర్వహించిన ర్యాలీకి స్పందన కరువు
సమావేశం, ర్యాలీకి టీడీపీ నేతలు దూరం
జనసేన శ్రేణులదీ అదే పరిస్థితి
‘వన్ ఉమన్ షో’గా కార్యక్రమం
అరకు ఎంపీ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు కూటమి నేతలు షాకిచ్చారు. ఆమె నిర్వహించిన ఎన్నికల ర్యాలీకి డుమ్మా కొట్టి ఏకాకిని చేశారు. రంపచోడవరం టికెట్ తమకు రాకుండా చేసిన ఆమెకు తమ సత్తా ఏంటో చూపించేలా టీడీపీ నేతలు వ్యవహరించారు. జనసేనకు చెందిన ముఖ్యనేతలు కూడా దూరంగా ఉన్నారు. దీంతో కూటమిలో కుంపటి రాజుకుంది.
రంపచోడవరం: అరకు ఎంపీ కూటమి అభ్యర్థి, బీజేపీ నేత కొత్తపల్లి గీతకు చుక్కెదురైంది. బుధవారం రంపచోడవరం, గంగవరం, అడ్డతీగలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీకి టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు డుమ్మాకొట్టారు. ఆశించిన స్థాయిలో ఆ పార్టీతోపాటు జనసేన నేతలు రాకపోవడంతో ఈ కార్యక్రమం ‘వన్ ఉమన్ షో’గా మారింది. బాపనమ్మ గుడి వద్ద నుంచి రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల వరకు ర్యాలీకి జనం లేక మొక్కుబడిగా సాగింది.
ఆమె పెత్తనమేంటి?
రంపచోడవరం మండలానికి సంబంధించి ముఖ్యమైన నాయకులు ర్యాలీకి రాలేదు. టీడీపీ పార్టీ వ్యవహారాల్లో కొత్తపల్లి గీత తలదూర్చడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆగ్రహంతో ఉన్న వారంతా ర్యాలీకి హాజరు కాకుండా సత్తా చూపించారు. దీంతో కూటమిలో నేతల విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రంపచోడవరం అసెంబ్లీ సీటును మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూ రమేష్ ఆశించడం తెలిసిందే. వీరిని కాదని పార్టీ అధిష్టానం మిరియాల శిరీషాదేవి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి తమకు గీత వల్లే అన్యాయం జరిగిందని వారంతా గుర్రుగా ఉన్నారు. శిరీషా దేవి నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు కూడా వారు దూరంగానే ఉంటున్నారు.
ఈ పరిస్థితుల్లో నిర్వహించిన ర్యాలీకి శిరీషాదేవిపైన కొత్తపల్లి గీత ఆధారపడ్డారు. అయితే ఆమె ఆశించినట్టుగా పార్టీ శ్రేణులు, జనాన్ని తీసుకురాలేకపోయారు. ప్రధాన సెంటర్ అయిన గంగవరంలో ఆగకుండానే ర్యాలీ ముందుకు సాగడం అక్కడి టీడీపీ నేతలను మరింత అసంతృప్తికి గురి చేసింది. గంగవరం మండలానికి చెందిన సీనియర్ నాయకులు ఇప్పటికే రంపచోడవరం టీడీపీ అభ్యర్థిని మార్పు చేయాలని తీర్మానం చేసి పార్టీ పరిశీలకుడికి పంపించారు. ఈ మండలం నుంచి ఒకరిద్దరు నాయకులు తప్ప ముఖ్య నాయకులు ఎవ్వరూ ర్యాలీలో పాల్గొనలేదు. అడ్డతీగల దేవీగుడి సెంటర్‌లో ర్యాలీ అనంతరం ఎంపీ అభ్యర్థి గీత మాట్లాడారు. అయితే అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ శ్రేణులు కూడా హాజరు కాలేదు.
చివరికి అరకొరగా జనం: సీతపల్లి నుంచిప్రారంభమైన ర్యాలీ రంపచోడవరం చేరుకునే సరికి అరకొరగా మాత్రమే జనం మిగిలారు. స్థానిక అంబేడ్కర్ సెంటర్‌లో కొద్ది నిమిషాలు కొత్తపల్లి గీత మాట్లాడారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆమె చెప్పడంతో.. 2014 ఎన్నికల తరువాత ఎప్పుడూ తమకు కనిపించని గీత ఇప్పుడేం చేస్తుందంటూ స్థానికులు చర్చించుకున్నారు.
భవిష్యత్తు కార్యాచరణపై నేడు టీడీపీ నేతల సమావేశం
రంపచోడవరం టీడీపీ అభ్యర్థిగా మిరియాల శిరీషాదేవిని ప్రకటించిన నాటి నుంచి టీడీపీలో రగిలిన ఆగ్రహజ్వాలలు కొనసాగుతున్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం జరగలేదని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆరోపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాడేరులో టీడీపీ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానని ప్రకటించడంతో రంపచోడవరంలో కూడా టీడీపీ రెబల్ అభ్యర్థిని బరిలో దింపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగానే గురువారం రంపచోడవరంలో టీడీపీ నేతలు సమావేశం కానున్నట్లు సమాచారం. అభ్యర్థి మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వారంతా ఎదురు చూశారు. అయితే ఎటువంటి స్పందన లేకపోవడంతో తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment