గుమ్మడి సంధ్యారాణికి... తత్వం బోధపడింది! | - | Sakshi
Sakshi News home page

గుమ్మడి సంధ్యారాణికి... తత్వం బోధపడింది!

Published Sun, Oct 15 2023 1:54 AM | Last Updated on Sun, Oct 15 2023 11:36 AM

- - Sakshi

నాడు: రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సాలూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన గౌరవానికి భంగం కలిగేలా టీడీపీ వారు సోషల్‌ మీడియాలో చాలా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టేవారు. అయినప్పటికీ రాజన్నదొర సంయమనం పాటించేవారు. దీన్ని అలుసుగా తీసుకొని టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఆయన్ని వ్యక్తిగతంగానూ కించపరిచేలా పోస్టులుపెట్టారు. వీటిని చూసి విసిగిపోయిన రాజన్నదొర అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలోనూ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డిని, ఆయన కుటుంబసభ్యులను కించపరుస్తూ టీడీపీ వారు అసభ్యకరమై పోస్టులతో పేట్రేగిపోయారు. వైఎస్సార్‌సీపీ అభిమానుల ఫిర్యాదులతో పోలీసులు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అహా... సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారా? అంటూ టీడీపీ నాయకులను గుమ్మడి సంధ్యారాణి సమర్థించేవారు.

నేడు: ‘నేను గుమ్మడి సంధ్యారాణిని... మాజీ ఎమ్మెల్సీని... టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యురాలిని.. అరకు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షురాలిని, సాలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిని... కానీ నా గౌరవానికి భంగం కలిగించేలా, బయటకు చెప్పుకోలేని విధంగా నన్ను లక్ష్యంగా చేసుకొని ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాడు. అతడిపై కఠిన చర్యలు తీసు కోండి...’ అంటూ టీడీపీ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి సాలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుభవమైతే గానీ తత్వం బోధపడలేదు ఆమెకు! తనపై పోస్టులు పెట్టింది సొంత టీడీపీ వ్యక్తేనని తెలిసినా, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికీ సిద్ధమయ్యారు. ఆ వ్యక్తి టీడీపీలో తన ప్రత్యర్థి భంజ్‌దేవ్‌ వర్గీయుడేనని తెలిసి మరింత గరంగరం అవుతున్నారు. కొద్దిరోజులుగా తనను లక్ష్యంగా చేసుకొని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న భంజ్‌దేవ్‌ వర్గీయులను పార్టీ నుంచి పొగపెట్టి అయినా బయటకు పంపించేయాలని రగిలిపోతున్నట్టు తెలిసింది.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాలూరు టీడీపీలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. తనపై, తన వర్గీయులపై సామాజిక మాధ్యమాల్లో తప్పు డు ప్రచారాలు చేస్తున్నారంటూ ఇటీవల ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మడి సంధ్యారాణి సాలూరు పట్టణ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయడం దీనికో నిదర్శనం. పోస్టులు పెట్టిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్‌ అనుయాయుడని తెలిసింది. అయితే ఇప్పటివరకూ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.

తలెగరేస్తే తొక్కేయడమే...
టీడీపీలో తన వర్గీయులే కాదు వ్యతిరేక వర్గం వారైనా తలెగరేస్తే పాతాళానికి తొక్కేసేవరకూ సంధ్యారాణి నిద్రపోరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వద్ద పంచాయితీ జరిగినా సరే తన వైఖరిలో మార్పు ఉండదనే చెబుతున్నారు. పాచిపెంట మండల టీడీపీ అధ్యక్షుడి మార్పు అంశాన్ని సాలూరు ప్రజలు చర్చించుకుంటున్నారు. తనకు కొరకురాని కొయ్యగానున్న భంజ్‌దేవ్‌ విధేయుడు పిన్నింటి ప్రసాద్‌ను ఆ పదవి నుంచి ఇటీవల సంధ్యారాణి తప్పించేశారు. తన అనుచరుడిగాఉన్న ముఖే సూర్యనారాయణకు అధ్యక్ష పదవి అప్పగించారు.

ఇది నచ్చని పాచిపెంట టీడీపీ నాయకులు ఈ పంచాయితీని నేరుగా చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. సాలూరు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఈ విషయం ప్రస్తావించారు. దీంతో చంద్రబాబు సంధ్యారాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారని సాలూరు టీడీపీ నాయకులు ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. చంద్రబాబు తీసుకున్న క్లాసు ఫలితంగా పిన్నింటి ప్రసాద్‌కు మళ్లీ పాచిపెంట టీడీపీ మండల అధ్యక్ష పదవి దక్కింది. కానీ ఇప్పటికీ ప్రసాద్‌తో సంధ్యారాణి ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు.

మక్కువ మండలంలోనూ మంటలు...
బీజేపీ నుంచి ఇటీవలే టీడీపీలో చేరిన పెంట తిరుపతిరావు అన్నా సంధ్యారాణికి పొసగట్లేదు. మక్కువ మండలంలో కాస్త పలుకుబడి ఉన్న తిరుపతిరావు పట్ల తొలి నుంచీ ఆమెది అదే వైఖరి. అతను భంజ్‌దేవ్‌ అభిమానిగా ఉండటమే అసలు కారణం. దీంతో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సాలూరు మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్‌ గొర్లి విజయకుమారి భర్త మధుతో కూడా సంధ్యారాణికి సయోధ్య లేదనేది బహిరంగ రహస్యమే.

ఒంటెద్దు పోకడపై పోస్టులు...
సంధ్యారాణి అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడ నచ్చకే భంజ్‌దేవ్‌ తదితర టీడీపీ నాయకుల అనుచరులు ఆమైపె పోస్టులు పెడుతూ వస్తున్నారు. పార్టీ గ్రూపుల్లోనూ రచ్చ రచ్చ చేస్తున్నారు. భంజ్‌దేవ్‌ మీద గతంలో సంధ్యారాణి వర్గీయులు పెట్టిన పోస్టులు, ఆయన వల్లనే పార్టీ అప్రతిష్ట పాలయిందంటూ చంద్రబాబుకు లేఖలు రాయడం దీనికి ఆజ్యం పోసింది. ఆ పోస్టులు, లేఖలు బయటకు లీక్‌ చేయడం వెనుక సంధ్యారాణి అనుచరుల పాత్ర ఉందని భంజ్‌దేవ్‌ వర్గీయులు రగిలిపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement