అగ్నికి ఆజ్యంపోస్తున్న జనసేన | - | Sakshi
Sakshi News home page

అగ్నికి ఆజ్యంపోస్తున్న జనసేన

Published Thu, Jan 25 2024 1:50 AM | Last Updated on Sat, Feb 3 2024 5:03 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: గిరిజన ముద్దుబిడ్డ పీడిక రాజన్నదొర కష్టం, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో సాలూరు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీకి కంచుకో టగా మారింది. నాలుగు దఫాలుగా తిరుగులేని విజయాలతో రాజన్నదొర సాలూరును తన అడ్డాగా మార్చుకున్నారు. మళ్లీ అక్కడ ఎలాగైనా టీడీపీ ఉనికి చాటుకోవడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏకంగా రాజన్నదొరపై పసలేని ఆరోపణలను ఇటీవల అరకు సభలో సంధించినా గిరిజనం నుంచి పెద్దగా స్పందన లేదు.

గాలిలో దీపం మాదిరిగా పరిస్థితి తారుమారు అయినా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మాత్రం తారస్థాయిలోనే జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్‌, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పొత్తులో భాగంగా జతకట్టిన జనసేన నాయకులు ఇప్పుడు ఆ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. శంబర జాతర సందర్భంగా సాలూరు, మక్కువ మండలాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఆ కుమ్ములాటకు అద్దంపట్టాయి. ‘వీళ్లు మారరురా’ అంటూ టీడీపీ కార్యకర్తలే నొచ్చుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఆర్‌పీ భంజ్‌దేవ్‌, గుమ్మడి సంధ్యారాణి వర్గాల మధ్య అంతర్గత కుమ్ములాటల పంచాయితీ సాక్షా త్తూ చంద్రబాబు సమక్షంలోనే జరిగినా క్షేత్రస్థాయిలో ఏమీ మార్పు కనిపించట్లేదు. తమను టార్గెట్‌ చేసుకొని సంధ్యారాణి అనుచరులు పనిచేస్తున్నారని, పార్టీలో కలుపుకెళ్లే ప్రయత్నాలేవీ చేయట్లేదని భంజ్‌దేవ్‌ వర్గీయులు గళమెత్తుతున్నారు. వెనుకే ఉంటూ మోసం చేసే నాయకులను ముందుగానే దూరంపెట్టే పని సంధ్యారాణి చేస్తున్నారని ఆమె వర్గీయులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు, లేఖలతో మొదలైన యుద్ధం పోలీసు స్టేషన్లలో ఫిర్యాదుల వరకూ వెళ్లింది. ఇది ఇప్పుడు ఫ్లెక్సీల యుద్ధంతో తారస్థాయికి చేరింది. సంధ్యారాణి తీరుతో విసిగిపోయామని, ఆమెకు టికెట్‌ ఇస్తే ఏమాత్రం సహకరించబోమని భంజ్‌దేవ్‌ వర్గీయులు బహిరంగంగానే చెప్పేస్తున్నారు.

తెరపైకి తేజోవతి...
సాలూరు టీడీపీ టికెట్‌ తనదేనని గుమ్మడి సంధ్యారాణి ధీమాగా చెబుతున్నప్పటికీ చంద్రబాబు ఇంకా స్పష్టంగా చెప్పకపోవడంతో ఆమె వర్గీయుల్లో సందేహం నెలకుంది. దీనికితోడు తేజోవతి రంగప్రవేశంతో ఇది మరింత పెరిగింది. ఇటీవల నూతన సంవత్సర వేడుకల్లో ఆమె భంజ్‌దేవ్‌ ఇంటి వద్ద ప్రత్యక్షమవ్వడం సంధ్యారాణి వర్గీయులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ పరిస్థితితో భంజ్‌దేవ్‌ వర్గీయులు నిరాశ వదిలేసి కొత్త ఉత్సాహంతో పార్టీలో క్రియాశీలకమయ్యారు. తేజోవతి సాలూరు గడ్డపై కాలుపెట్టడం వెనుక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చన్నాయుడి ప్రోత్సాహం ఉందని, ఆమెకు బొబ్బిలి నాయకుడు బేబీనాయన ఆశీస్సులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల బొబ్బిలిలో జరిగిన సభలోనే ఆమెకు టీడీపీ కండువా వేసి చంద్రబాబు పార్టీలోకి చేర్చుకోవడం వారి వాదనలకు బలం చేకూరుస్తోంది.

అగ్నికి ఆజ్యంపోస్తున్న జనసేన
తేజోవతికి మద్దతుగా ఉన్న భంజ్‌దేవ్‌ వర్గీయులను టార్గెట్‌ చేస్తూ ఇన్నాళ్లూ సంధ్యారాణి వర్గీయులు చేసినదాన్ని కన్నా అంతకుమించి జనసేన నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో సంధ్యారాణి, భంజ్‌దేవ్‌ వర్గాల మధ్య అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. తనను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టుచేసిన జనసేన కార్యకర్త త్రిపురనేని విజయ్‌ చౌదరిపై సాలూరు టౌన్‌ పోలీసుస్టేషన్‌లో భంజ్‌దేవ్‌ ఫిర్యాదు చేశారు. ఇలాంటి కేసులకు తాను భయపడనని సదరు జనసేన కార్యకర్త మరో వీడియో పోస్టు చేయడం గమనార్హం.

ఫ్లెక్సీలతో యుద్ధం
శంబర జాతర సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ సాలూరు, మామిడిపల్లి, శంబర ప్రాంతాల్లో తేజోవతి వర్గీయులు ఫ్లెక్సీలను పెట్టించారు. ఆ ఫ్లెక్సీల్లో తేజోవతి ముఖాన్ని ఎవరో చింపేశారు. కొన్నిచోట్ల ముఖం కనపడకుండా ఆమె ఫొటోపై సంధ్యారాణి ఫొటోలను అతికించారు. మరోవైపు శంబరలో పెట్టిన ఫ్లెక్సీలో సంధ్యారాణి ముఖం కనిపించకుండా పసుపు రాసేశారు. గెలిచే అవకాశం లేనిచోట నాయకుల కొట్లాటను చూసి జనం నవ్వుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement