సమావేశలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు
రామభద్రపురం: బీసీ సామాజికవర్గం తన ఆత్మీయులని ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు నాయుడికి బొబ్బిలి ఎమ్మెల్యే సీటును బీసీలకు కేటాయించే దమ్ము, ధైర్యం ఉందా? అని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ స్థానిక కార్యాలయంలో ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావుతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీల మీద అంతప్రేమ ఉన్న వ్యక్తి బొబ్బిలిలో రాజులకెందుకు పెత్తనం అప్పగిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతులు, మహిళలకు ఏదేదో చేస్తానని వాగ్దానాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
40 ఏళ్లు రాజకీయ అనుభవం, పధ్నాలుగేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు దిగజారుడుతనంతో మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ఓట్లతో గెలిచి, టీడీపీలోకి వచ్చి మంత్రి పదవి పొంది నియోజకవర్గంలో అభివృద్ధి చేయకుండా అవినీతి, కబ్జాలకు పాల్పడిన వారిని పక్కనే పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మత్రులు, ఎమ్మెల్యేలపై చంద్రబాబు నోరుపారేసుకోవడం విచారకరమన్నారు.
పేదల పక్షాన జగన్
తెలుగుదేశం, దాని తోక పార్టీలు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని ఆరోపణలు చేసినా వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని, అది బొబ్బిలితోనే ఆరంభమవుతుందన్నారు. రాష్ట్రంలో పెత్తందారులు, పేదల మధ్య జరుగుతున్న యుద్ధంలో పేదల పక్షాన నిలిచిన సీఎం వైస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు అప్పికొండ లక్ష్మునాయుడు, మండల జేసీఎస్ కన్వీనర్ సింహాచలం నాయుడు, వైస్ ఎంపీపీ బెల్లాన ప్రసాద్, మండల యూత్ ప్రెసిడెంట్ పత్తిగుళ్ల ఏక్‌నాథ్, మండల ఉపాధ్యక్షుడు డర్రు పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment