పార్వతీపురం టీడీపీలో కల్లోలం | - | Sakshi
Sakshi News home page

పార్వతీపురం టీడీపీలో కల్లోలం

Published Mon, Aug 14 2023 12:42 AM | Last Updated on Sat, Feb 3 2024 4:35 PM

- - Sakshi

తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరింత తీవ్రమయ్యాయి. ఇటీవల ప్రాజెక్టుల పరిశీలన పేరిట ఈ ప్రాంతానికి వచ్చిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన తరువాత ఇవి మరింత ముదిరి పాకాన పడ్డాయి. చివరకు ఎక్కడ వరకు వెళ్లాయంటే...పార్వతీపురం ఇన్‌చార్జిగా విజయచంద్ర నియామకంపై ఆ పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఈ నియామకంతో పార్టీ మరింత పతనం కావడం ఖాయమని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతుండడం విశేషం.

పార్వతీపురం టౌన్‌: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మూడు ముక్కలాట కొనసాగుతుంది. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జిగా బోనెల విజయచంద్రను అధిష్టానం నియమించింది. ఈయనకు అండగా ఉండాలన్న విషయం స్వయానా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్వతీపురంలో ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో చెప్పినా ఆయనను వ్యతిరేకించే వర్గాలు మూడు ఏర్పడ్డాయని నియోజకవర్గం అంతా గుసగుసలు వినిపిస్తున్నాయి.

స్థానిక తెలుగుదేశం పార్టీ పరిస్థితి, కష్ట కాలంలో పార్టీని గుప్పిట్లో పెట్టుకుని కేడర్‌ చేజారిపోకుండా చుట్టూ రక్షణ కవచంలా కాపాడిన నాయకులను పక్కనపెట్టి, ఇప్పుడు తెలియని అభ్యర్థిని తెచ్చి ఇతనే మొనగాడు అంటే తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అధినేత మాటను ధిక్కరించలేక తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. విశాఖలో ఉంటూ ఎప్పుడు పార్వతీపురం ముఖం చూడని ఎవరికీ తెలియని బోనెల విజయచంద్రను పార్టీ ఇన్‌చార్జిగా నియమించడంపై పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందేమోనన్న ఆందోళన క్యాడర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.

బోనెలపైనా విమర్శలు
మాదిగ జాతి ముసుగులో మా జాతిని మోసం చేసి సంపాదించిన డబ్బులతో రాజ్యాధికారం కోసం బోనెల విజయచంద్ర ఆరాట పడుతున్నాడని ఇన్‌ఫాం ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు గెడ్డం బాపిరాజు నాలుగు రోజుల కిందట మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఎన్నో అక్రమాలకు పాల్పడిన విజయచంద్ర చరిత్ర తెలుసుకోకుండా పార్వతీపురం టీడీపీ ఇన్‌చార్జిగా ఎలా నియమించారని ప్రశ్నించారు. 2014లో ఏర్పడిన ఐఎఫ్‌ఎం (ఇంటలెక్చువల్‌ ఫారం ఫర్‌ మాదిగాస్‌) అనే సంస్థ మాదిగ జాతి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

2018లో ఆ సంస్థ చేసిన కార్యక్రమాలు చూసే ఇన్ఫాంలోకి వచ్చిన బోనెల విజయచంద్ర ఈ సంస్థలో ఉన్న కొంత మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ మేధావులను పక్కదారి పట్టించారన్నారు. ఇదే సంస్థ పేరు మీద కార్యవర్గ సభ్యులు ఎవరూ లేకుండా వైజాగ్‌లోని గీతం యూనివర్సిటీలో కెనరా బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారన్నారు. దేశం టీవీలో విజయచంద్ర డైరెక్టర్‌గా జాయిన్‌ అయ్యి రూ.నాలుగు కోట్లు వసూలు చేసి సంస్థకి ఇవ్వలేదని, ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియక దేశం టీవీ నడుపుతున్న శ్రీనివాసరావు చనిపోయారన్నారు. నలుగురితో కలిసి ఉండని బోనెల విజయచంద్రకు టీడీపీ ఇన్‌చార్జిగా ఎలా నియమించిందో అర్థం కావడం లేదని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

మండలాల్లోనూ ఇదే పరిస్థితి
ఇప్పటికే బలిజిపేట, సీతానగరం మండలాల్లో కొత్త ఇన్‌చార్జిలపై తీవ్ర అసంతృపి్‌త్‌ వ్యక్తం అవుతుంది. పార్వతీపురంలో సైతం పచ్చ జెండాకు రంగు వెలిసిపోతుంది. రెపరెపలాడుతున్న పచ్చజెండాలు ఇవన్నీ ఒక్కసారి మూగబోయాయి. అసలే పార్టీ సరిగా లేని పరిస్థితుల్లో కొత్త ఇన్‌చార్జి నియామకంతో చేజేతులా పార్టీ నాశనం అవుతుందన్న భయం కార్యకర్తలకు పట్టుకుంది.

అధినేతపై సొంత పార్టీ వారే బహిరంగ విమర్శలు
తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే పార్టీకి భవిష్యత్తు ఉండదన్నారు ఆ పార్టీ అరుకు పార్లమెంటరీ ఎస్సీ అధికార ప్రతినిది గర్భాపు ఉదయభాను. ఆయన చంద్రబాబుపై బహిరంగ విమర్శలు చేశారు. పార్టీ కోసం గత ఐదు సంవత్సరాలుగా పని చేస్తూ పార్టీ ఉనికి చాటుతూ పార్టీ కోసం శ్రమిస్తూ అన్ని విధాలా పని చేస్తున్నప్పటికీ మాలాంటి నాయకులకు గౌరవం దక్కడం లేదన్నారు.

ఇటీవల ఏ సర్వే ప్రకారం పార్వతీపురం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జిని నియమించావు.. సర్వేలో అన్నింటిలో కూడా నేను ముందంజలో ఉంటుండగా ఆ సర్వేలను కాదని ఏ లాలూచీతో విజయచంద్రను నియమించావని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయిన రోజుల్లో 2019లో పార్టీని ఎవరూ పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినపుడు నేను మీ వెనుక ఉన్నానని భరోసా కల్పిస్తూ సర్పంచ్‌ అభ్యర్థులకు, ఎంపీటీసీ అభ్యర్థులకు నాకు చేతనైన ఆర్థిక సాయాన్ని చేసి నేనున్నానంటూ భరోసా కల్పించానన్నారు. అప్పటి నుంచి ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తే... నాకు కనీసం ఎటువంటి సమాచారం లేకుండా, కనీసం పట్టించుకోకుండా వేరే వ్యక్తిని ఎలా నియమించావని ప్రశ్నించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement