Bhanjdev
-
గుమ్మడి సంధ్యారాణికి... తత్వం బోధపడింది!
నాడు: రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సాలూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన గౌరవానికి భంగం కలిగేలా టీడీపీ వారు సోషల్ మీడియాలో చాలా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టేవారు. అయినప్పటికీ రాజన్నదొర సంయమనం పాటించేవారు. దీన్ని అలుసుగా తీసుకొని టీడీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఆయన్ని వ్యక్తిగతంగానూ కించపరిచేలా పోస్టులుపెట్టారు. వీటిని చూసి విసిగిపోయిన రాజన్నదొర అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలోనూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డిని, ఆయన కుటుంబసభ్యులను కించపరుస్తూ టీడీపీ వారు అసభ్యకరమై పోస్టులతో పేట్రేగిపోయారు. వైఎస్సార్సీపీ అభిమానుల ఫిర్యాదులతో పోలీసులు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అహా... సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారా? అంటూ టీడీపీ నాయకులను గుమ్మడి సంధ్యారాణి సమర్థించేవారు. నేడు: ‘నేను గుమ్మడి సంధ్యారాణిని... మాజీ ఎమ్మెల్సీని... టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యురాలిని.. అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలిని, సాలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిని... కానీ నా గౌరవానికి భంగం కలిగించేలా, బయటకు చెప్పుకోలేని విధంగా నన్ను లక్ష్యంగా చేసుకొని ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాడు. అతడిపై కఠిన చర్యలు తీసు కోండి...’ అంటూ టీడీపీ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి సాలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుభవమైతే గానీ తత్వం బోధపడలేదు ఆమెకు! తనపై పోస్టులు పెట్టింది సొంత టీడీపీ వ్యక్తేనని తెలిసినా, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికీ సిద్ధమయ్యారు. ఆ వ్యక్తి టీడీపీలో తన ప్రత్యర్థి భంజ్‌దేవ్ వర్గీయుడేనని తెలిసి మరింత గరంగరం అవుతున్నారు. కొద్దిరోజులుగా తనను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న భంజ్‌దేవ్ వర్గీయులను పార్టీ నుంచి పొగపెట్టి అయినా బయటకు పంపించేయాలని రగిలిపోతున్నట్టు తెలిసింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాలూరు టీడీపీలో వర్గవిభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. తనపై, తన వర్గీయులపై సామాజిక మాధ్యమాల్లో తప్పు డు ప్రచారాలు చేస్తున్నారంటూ ఇటీవల ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గుమ్మడి సంధ్యారాణి సాలూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం దీనికో నిదర్శనం. పోస్టులు పెట్టిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్ అనుయాయుడని తెలిసింది. అయితే ఇప్పటివరకూ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. తలెగరేస్తే తొక్కేయడమే... టీడీపీలో తన వర్గీయులే కాదు వ్యతిరేక వర్గం వారైనా తలెగరేస్తే పాతాళానికి తొక్కేసేవరకూ సంధ్యారాణి నిద్రపోరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వద్ద పంచాయితీ జరిగినా సరే తన వైఖరిలో మార్పు ఉండదనే చెబుతున్నారు. పాచిపెంట మండల టీడీపీ అధ్యక్షుడి మార్పు అంశాన్ని సాలూరు ప్రజలు చర్చించుకుంటున్నారు. తనకు కొరకురాని కొయ్యగానున్న భంజ్‌దేవ్ విధేయుడు పిన్నింటి ప్రసాద్‌ను ఆ పదవి నుంచి ఇటీవల సంధ్యారాణి తప్పించేశారు. తన అనుచరుడిగాఉన్న ముఖే సూర్యనారాయణకు అధ్యక్ష పదవి అప్పగించారు. ఇది నచ్చని పాచిపెంట టీడీపీ నాయకులు ఈ పంచాయితీని నేరుగా చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. సాలూరు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఈ విషయం ప్రస్తావించారు. దీంతో చంద్రబాబు సంధ్యారాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారని సాలూరు టీడీపీ నాయకులు ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. చంద్రబాబు తీసుకున్న క్లాసు ఫలితంగా పిన్నింటి ప్రసాద్‌కు మళ్లీ పాచిపెంట టీడీపీ మండల అధ్యక్ష పదవి దక్కింది. కానీ ఇప్పటికీ ప్రసాద్‌తో సంధ్యారాణి ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. మక్కువ మండలంలోనూ మంటలు... బీజేపీ నుంచి ఇటీవలే టీడీపీలో చేరిన పెంట తిరుపతిరావు అన్నా సంధ్యారాణికి పొసగట్లేదు. మక్కువ మండలంలో కాస్త పలుకుబడి ఉన్న తిరుపతిరావు పట్ల తొలి నుంచీ ఆమెది అదే వైఖరి. అతను భంజ్‌దేవ్ అభిమానిగా ఉండటమే అసలు కారణం. దీంతో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సాలూరు మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ గొర్లి విజయకుమారి భర్త మధుతో కూడా సంధ్యారాణికి సయోధ్య లేదనేది బహిరంగ రహస్యమే. ఒంటెద్దు పోకడపై పోస్టులు... సంధ్యారాణి అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడ నచ్చకే భంజ్‌దేవ్ తదితర టీడీపీ నాయకుల అనుచరులు ఆమైపె పోస్టులు పెడుతూ వస్తున్నారు. పార్టీ గ్రూపుల్లోనూ రచ్చ రచ్చ చేస్తున్నారు. భంజ్‌దేవ్ మీద గతంలో సంధ్యారాణి వర్గీయులు పెట్టిన పోస్టులు, ఆయన వల్లనే పార్టీ అప్రతిష్ట పాలయిందంటూ చంద్రబాబుకు లేఖలు రాయడం దీనికి ఆజ్యం పోసింది. ఆ పోస్టులు, లేఖలు బయటకు లీక్ చేయడం వెనుక సంధ్యారాణి అనుచరుల పాత్ర ఉందని భంజ్‌దేవ్ వర్గీయులు రగిలిపోతున్నారు. -
సాక్షి ఎఫెక్ట్: భంజ్‌దేవ్‌కు భారీ దెబ్బ
అధికారం అండతో అక్రమాలకు పాలడ్డారు. అడ్డగోలుగా భూములు ఆక్రమించేసి చేపల చెరువులు తవ్వించేశారు. ఇదేమని ప్ర శ్నిస్తే అది తమ తాతలనాటి ఆస్తులంటూ బుకాయించారు. అంతేనా... సాగుకు వినియోగించాల్సిన నీటినీ చెరువులకు మళ్లించేశారు. దర్జాగా వ్యాపారం చేసుకుని కాసులు కూడేశారు. అధికారం మారింది. వారి తలరాత కూడా మారిపోయింది. అడ్డగోలు అక్రమాలపై వరుసగా ప్రచురితమైన సాక్షి కథనాలు అధికారులను కదిలించాయి. జిల్లా కలెక్టర్‌కు న్యాయస్థా నం నుంచి ఆదేశాలూ అందాయి. విచారణ చేపట్టిన జిల్లా అధికారులు అవన్నీ అక్రమాలేనని తేల్చారు. ఇన్నాళ్లు సర్కారును... ప్రజలను మభ్యపెట్టినందుకు తగిన శిక్ష విధించారు. ఏకంగా ఆక్వా లైసెన్సును రద్దు చేస్తూ తీర్మానించారు. ఇదీ సాలూరు టీడీపీ ఇన్చార్జి భంజ్‌దేవ్‌కు తగిలిన భారీదెబ్బ. సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం అడ్డుపెట్టుకుని సాలూరు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, ఆయన సోదరుడు ఏపీ భంజ్‌దేవ్ సాగించిన చేపల చెరువుల వ్యాపారంలో అక్రమాలు నిజమేనని సష్టమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక కమిటీ నిర్ధారించింది. చేపల చెరువు తవ్వకానికి గ్రామదేవత స్థలాన్ని ఆక్రమించినట్టు నిర్ధారణయింది. దీని ఫలితంగా పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామంలో చేపల చెరువు ఏర్పాటుకోసం గతంలో మంజూరు చేసిన అనుమతులు రద్దు చేస్తూ అక్వాకల్చర్ చెరువుల అనుమతులకోసం ఏర్పాటైన జిల్లా కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా జిల్లా స్థాయి కమిటీ అధ్యక్షలు కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, సభ్యులు జాయిం ట్ కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెం కటరావు, మత్స్యశాఖ ఉప సంచాలకులు టి.సుమలత, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సుదర్శన, వ్యవసాయ శాఖ డీడీ నంద్, భూగర్భ జలశాఖ ఇన్చార్జి డీడీ రమణమూర్తి గురువారం సమావేశమై తీర్మానించారు. అవన్నీ అక్రమాలే: పాచిపెంట మండలం విశ్వనాథపురంలో సర్వే నంబరు 12–1 లో ఆరు ఎకరాల స్థలంలో ఏపీ భంజ్‌దేవ్ చేపల చెరువు ఏర్పాటు చేసేందుకు గతంలో దరఖాస్తు చేసుకోగా ఆ మండల తహసీల్దార్ సిఫారసు మేరకు జిల్లా కమిటీ గతంలో ఆమోదం తెలిపింది. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చెపల చెరువు భూములపై దర్యాప్తు జరిపిన పార్వతీపురం సబ్ కలెక్టర్ నేతత్వంలోని సబ్ కమిటీ గ్రామదేవతకు చెందిన భూములు ఆక్రమిస్తూ ఈ చెరువు తవ్వించినట్టు నిర్థారించింది. ఈ స్థలానికి హక్కుదారుగా గ్రామదేవత వున్నారని, సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్ లో ఈ మేరకు నమోదై వున్నట్టు సబ్ కమిటీ పేర్కొంది. సర్వే నం.12–1లోని స్థలంపై అక్వా రైతు ఆర్పీ భంజ్‌దేవ్ సోదరుడైన ఏ.పి.భంజ్‌దేవ్‌కు ఎలాంటి న్యాయపరమైన హక్కు లేనందున సబ్ కలెక్టర్ కమిటీ నివేదిక ఆధారంగా జిల్లా స్థాయి కమిటీలో అనుమతులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు ఇదే వ్యక్తుల చేతిలో గ్రామంలోని సర్వే నెంబరు 14–1లో 3.25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన చేపల చెరువులోనూ 2.81 ఎకరాల ప్రభుత్వ ఇనాం భూమి ఆక్రమణకు గురైనట్టు సబ్ కలెక్టర్ నేతత్వంలోని సబ్ కమిటీ నిర్ధారించింది. ఈ చెరువు ఏర్పాటుకు జిల్లా స్థాయి కమిటీ అనుమతి పొందలేదని, ఈ చెరువు కూడా అక్రమమైనదేనని కమిటీ నిర్థారించింది. ఈ మేరకు ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణలు తొలగించాలని, అక్రమంగా ఏర్పాటు చేసిన చెరువులను కూడా నిర్మూలించాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్టు ఆదేశాలు... సబ్‌కలెక్టర్ విచారణ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భంజ్‌దేవ్, అతని సోదరులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ, గ్రామ దేవత భూములను ఆక్రమించుకుని చేపల చెరువులు సాగు చేసుకుంటున్నారు. రైతులు సాగునీటికి వాడాల్సిన పెద్దగెడ్డ జలాశయ నీటిని తమ చేపల చెరువుకు మళ్లించుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై స్థానికులు కొందరు న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరిలో హైకోర్టు బెంచ్ ఒక తీర్పు వెలువరించింది. చెరువులపై విచారణ జరిపి, ఆక్రమితమని తేలితే ధ్వంసం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. విచారణ బాధ్యతలను సబ్‌కలెక్టర్‌కు జిల్లా కలెక్టర్ అప్పగించారు. సాక్షి కథనాల్లో చెప్పిన అంశాలన్నీ వాస్తవాలేనని సబ్ కలెక్టర్ విచారణలో తేలింది. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా కమిటీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. సంచలనం సృష్టించిన సాక్షి భంజ్‌దేవ్ చేపల చెరువుల ఆక్రమణలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. అన్ని ఆధారాలతో వరుస కథనాలను ప్రచురించింది. వాటిని కూడా పిటిషన్‌దారులు కోర్టుకు సమర్పించారు. అదే విధంగా ‘సాక్షి’ కథనాల కారణంగా నియోజకవర్గ ప్రజల్లో చైతన్యం వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం భంజ్‌దేవ్‌ను పిలిపించి వివరణ కోరారు. దశాబ్దాలుగా జరుగుతున్న అక్రమానికి అడ్డుకట్టవేయడంలో ప్రధాన భూమిక పోషించిన ‘సాక్షి’ చరిత్ర సృష్టించింది. -
టీఢీపీ
►సంధ్యారాణి వర్సెస్ భంజ్‌దేవ్ ►సాలూరు తెలుగుదేశం పార్టీలో ముదిరిన అంతర్గత పోరు ►పరస్పరం దెబ్బతీసుకునే ప్రయత్నాలు ►విభేదాల నడుమ వాయిదా పడిన తహశీల్దార్ కార్యాలయం ప్రారంభం అనూహ్యంగా పార్టీలో ఎదిగిన వ్యక్తి హవా వల్ల తన ప్రాబల్యానికి ఎక్కడ గండిపడుతుందో అని ఒకరు. తనకు వచ్చిన అవకాశంతో ప్రాబల్యం పెంచుకోడానికి, భవిష్యత్‌లో ఎదురులేకుండా చేసుకోవడానికి మరొకరు. పరస్పరం చెక్ పెట్టుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో సాలూరు నియోజకవర్గ టీడీపీ నాయకుల్లో అంతర్గత పోరు నడుస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్ మధ్య నువ్వానేనా అన్నట్టు అంతర్గత పోరు నడుస్తోంది. సాలూరు నియోజకవర్గ టీడీపీలో అంతర్గత పోరు ఈనాటిది కాదు. 2009ఎన్నికల సమయంలో గుమ్మడి సంధ్యారాణి పార్టీలో చేరిన దగ్గరి నుంచి ప్రారంభమయ్యింది. ఎస్టీ కుల వివాదం కారణంగా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయిన దగ్గరి నుంచి భంజ్‌దేవ్ ప్రాబల్యం తగ్గిపోయింది.సంధ్యారాణి ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీలో క్రీయాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. భంజ్‌దేవ్ తన స్పీడ్‌ను తగ్గించారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా ఎస్టీ సర్టిఫికెట్ చేతికి రావడంతో భంజ్‌దేవ్ మళ్లీ తెరపైకొచ్చారు. తనకున్న సీనియారిటీ, పార్టీలో ఉన్న పలుకుబడితో ఎమ్మెల్యే టిక్కెట్‌ను దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో సంధ్యారాణికి మొండి చేయి ఎదురైంది. తప్పనిపరిస్థితుల్లో ఆమెను బలవంతంగా అరకు ఎంపీగా అధిష్టానం పోటీ చేయింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కారణంగా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి భంజ్‌దేవ్‌కు దక్కింది. అలాగే భంజ్‌దేవ్ తీరుకు అడ్డుకట్ట పడేలా ఎస్టీ కోటాలో, కీలక మంత్రి అండదండలతో సంధ్యారాణికి అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇంకేముంది నియోజకవర్గంలో సంధ్యారాణి ప్రాబల్యం పెరిగినట్టు అయ్యింది. అంతటితో ఆగిపోకుండా ఎస్టీ కోటాలో మంత్రి పదవి కూడా దక్కుతుందనే ప్రచారం నడుస్తోంది. దీంతో భంజ్‌దేవ్ తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. ఇప్పుడే ఆమెను డ్యామేజ్ చేయకపోతే సంధ్యారాణికి హవాకు బ్రేక్ పడదనే అభిప్రాయానికొచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమెపై ఉన్న ఆరోపణల్ని అస్త్రంగా చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. షిప్ట్ ఆపరేటర్ల పోస్టులను అమ్ముకున్నారని, మక్కువ మండలంలోని వెంగళరాయసాగర్ జలాశయం పనులలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని భంజ్‌దేవ్ ఫిర్యాదు చేసినట్టు జోరు గా చర్చ సాగుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే సంధ్యారాణి చేతుల మీదుగా సోమవారం జరగనున్న తహశీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంపైనా భంజ్‌దేవ్ తన అక్కసు చూపించినట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి ఉంటుండగా సంధ్యారాణి ఎలా ప్రారంభిస్తారని ఏకంగా కేంద్రమంత్రి అశోక్, జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌లకు ఫిర్యాదు చేసినట్టు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన తహశీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. భంజ్‌దేవ్ ప్రయత్నాలు ఇలా ఉంటే గుమ్మడి సంధ్యారాణి కూడా తానేమీ తక్కువ కాదంటూ భంజ్‌దేవ్‌పై ఎస్టీ కుల వివాద ఉచ్చు బిగించేలా ఆయనపై పోరాడుతున్న గిరిజన సంఘాలకు లోపాయికారీగా సహకరిస్తున్నారని భంజ్‌దేవ్ వర్గం భావిస్తోంది. అదే విధంగా ఆయనవైపు తిరుగుతున్న నాయకుల్ని తనవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వీరిద్దరి మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. -
సబ్‌కలెక్టర్ మెడకు కుల ధ్రువీకరణ వివాదం ?
సాక్షి ప్రతినిధి, విజయనగరం : కుల ధ్రువీకరణ అంశం ఐఏఎస్ అధికారిణిని ఇబ్బందుల్లోకి నెట్టనుందా? సాలూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్పీ భంజ్‌దేవ్ గిరిజన కులస్తుడేనంటూ జారీ చేసిన ధ్రువీకరణ పత్రంతో పార్వతీపురం సబ్ కలెక్టర్ చిక్కుల్లో పడ్డారా? భంజ్‌దేవ్ కొండదొర అంటూ ఆగమేఘాలపై ధ్రువీకరించి వివాదంలో ఇరుక్కున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. గవర్నర్ హౌస్ నుంచి వచ్చిన విచారణ ఆదేశాలు అందుకు ఊతమిస్తున్నాయి. సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి భంజ్‌దేవ్ గిరిజనుడు కాదని 2006 మార్చి 10న హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై భంజ్‌దేవ్ స్టే కోరినా కోర్టు తిరస్కరించింది. దీంతో భజంద్దేవ్కు మంజూరు చేసిన ఎస్టీ సర్టిఫికెట్‌ను రద్దుచేయాలని ఏపీ గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, న్యాయవాది రేగు మహేశ్వరరావు.. కలెక్టర్, సబ్కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. అయితే ప్రభుత్వ మెమో ద్వారా సాలూరు తహశీల్దారుతో దర్యాప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. భంజ్‌దేవ్, అతని కుటుంబంపై విచారణ చేసి ఇతను గిరిజన కులానికి చెందని వారని సాలూరు తహశీల్దారు నిర్ధారించి, డాక్యుమెంట్లతో సహా సబ్‌కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. దీన్ని ఆధారంగా చేసుకుని ఆప్పటి ఆర్డీఓ స్వయంగా విచారణ చేసి భంజ్‌దేవ్ క్షత్రియుడని నిర్ధారించినట్టు తెలిసింది. అయితే పెండింగ్‌లో ఉన్న భంజ్‌దేవ్ కుల వివాదం ఇటీవల ఎన్నికల ముందు మళ్లీ తెరపైకొచ్చింది. ఈ ఏడాది మార్చి 29న ఆర్పీ భంజ్ దేవ్ గిరిజనుడేనంటూ పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్వేతామహంతి తనంతట తానుగా ఆదేశాలు జారీ చేయడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఇదే వివాదంపై మళ్లీ రేగు మహేశ్వరరావు గవర్నర్, రాష్ట్రపతిని కలసి కుల వివాదాన్ని వివరించారు. ఇప్పుడు దానిని గవర్నర్ పరిశీలించి విచారణకు ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఆరోపణలు నిజమైతే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతుగా విచారణ జరిపి వాస్తవాలు బయటకు లాగితే, పిటీషనర్ల ఆరోపణలు నిజమైతే సబ్ కలెక్టర్ ఇబ్బందుల్లో పడతారన్న వాదన విన్పిస్తోంది. -
టీడీపీలో అంతర్గత పోరు!
సాలూరు, న్యూస్‌లైన్: సాలూరు నియోజకవర్గంలోని టీడీపీలో అంతర్గత పోరు నెలకొంది. ఇన్నాళ్లూ అంతా సవ్యం గానే ఉందనుకున్న నేతల మధ్య విభేదాలు ఇప్పు డు బయటపడుతున్నాయి. సాలూరు అసెంబ్లీ టిక్కెట్‌ను ఆర్పీ భంజ్‌దేవ్‌కు కేటాయించడంతో సంధ్యారాణి వర్గీయులు భగ్గుమంటున్నారు. గత ఎన్ని కల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైనప్పటి నుంచీ ఈసారి కూడా సాలూరు అసెంబ్లీ అభ్యర్థివి నువ్వే...కష్టపడి పని చేయని చెబుతూ వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు ఆఖరు నిమిషంలో మొండిచేయి చూపడాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన ఆమెను కాదని, చివరి నిమిషంలో భంజ్‌దేవ్‌కు ఎందుకు టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. అయితే సంధ్యారాణికి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తే.. పార్టీలో ఉంటూ మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్ ఆమె గెలుపునకు ఎట్టి పరిస్ధితుల్లోనూ సహకరించరని, అందువల్లే ఆయనకు టిక్కెట్ ఇచ్చినట్టు నేతలు చెబుతున్నారు. అందుకే భంజ్‌దేవ్‌కు సాలూరు అసెంబ్లీ స్థానాన్ని, సంధ్యారాణికి ఎంపీ టిక్కెట్ ఇచ్చినట్టు పేర్కొంటున్నారు. కానీ పార్టీలో ఎవరిని కదిపినా.. సంధ్యారాణికి అన్యా యం జరిగిందనే అంటున్నారు. ఐదేళ్ల పాటు పార్టీ ని నడిపించిన ఆమే గెలవకుంటే.. భంజ్‌దేవ్ ఎలా గెలుస్తారని ప్రశ్నిస్తున్నారు.