సాక్షి ఎఫెక్ట్‌: భంజ్‌దేవ్‌కు భారీ దెబ్బ | Special Committee Has Confirmed The Irregularities Committed By Former TDP MLA RP Bhanjdev | Sakshi
Sakshi News home page

భంజ్‌దేవ్‌కు భారీ దెబ్బ

Published Fri, Dec 20 2019 11:16 AM | Last Updated on Fri, Dec 20 2019 3:47 PM

Special Committee Has Confirmed The Irregularities Committed By Former TDP MLA RP Bhanjdev - Sakshi

కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ అధ్యక్షతన సమావేశమైన జిల్లా స్థాయి కమిటీ

అధికారం అండతో అక్రమాలకు పాలడ్డారు. అడ్డగోలుగా భూములు ఆక్రమించేసి చేపల చెరువులు తవ్వించేశారు. ఇదేమని ప్ర శ్నిస్తే అది తమ తాతలనాటి ఆస్తులంటూ బుకాయించారు. అంతేనా... సాగుకు వినియోగించాల్సిన నీటినీ చెరువులకు మళ్లించేశారు. దర్జాగా వ్యాపారం చేసుకుని కాసులు కూడేశారు. అధికారం మారింది. వారి తలరాత కూడా మారిపోయింది. అడ్డగోలు అక్రమాలపై వరుసగా ప్రచురితమైన సాక్షి కథనాలు అధికారులను కదిలించాయి. జిల్లా కలెక్టర్‌కు న్యాయస్థా నం నుంచి ఆదేశాలూ అందాయి. విచారణ చేపట్టిన జిల్లా అధికారులు అవన్నీ అక్రమాలేనని తేల్చారు. ఇన్నాళ్లు సర్కారును... ప్రజలను మభ్యపెట్టినందుకు తగిన శిక్ష విధించారు. ఏకంగా ఆక్వా లైసెన్సును రద్దు చేస్తూ తీర్మానించారు. ఇదీ సాలూరు టీడీపీ ఇన్‌చార్జి భంజ్‌దేవ్‌కు తగిలిన భారీదెబ్బ. 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం అడ్డుపెట్టుకుని సాలూరు టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్, ఆయన సోదరుడు ఏపీ భంజ్‌దేవ్‌ సాగించిన చేపల చెరువుల వ్యాపారంలో అక్రమాలు నిజమేనని సష్టమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక కమిటీ నిర్ధారించింది. చేపల చెరువు తవ్వకానికి గ్రామదేవత స్థలాన్ని ఆక్రమించినట్టు నిర్ధారణయింది. దీని ఫలితంగా పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామంలో చేపల చెరువు ఏర్పాటుకోసం గతంలో మంజూరు చేసిన అనుమతులు రద్దు చేస్తూ అక్వాకల్చర్‌ చెరువుల అనుమతులకోసం ఏర్పాటైన జిల్లా కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా జిల్లా స్థాయి కమిటీ అధ్యక్షలు కలెక్టర్‌ డా.ఎం.హరిజవహర్‌ లాల్, సభ్యులు జాయిం ట్‌ కలెక్టర్‌ కె.వెంకటరమణా రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెం కటరావు, మత్స్యశాఖ ఉప సంచాలకులు టి.సుమలత,  కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సుదర్శన, వ్యవసాయ శాఖ డీడీ నంద్, భూగర్భ జలశాఖ ఇన్‌చార్జి డీడీ రమణమూర్తి గురువారం సమావేశమై తీర్మానించారు.

అవన్నీ అక్రమాలే:
పాచిపెంట మండలం విశ్వనాథపురంలో సర్వే నంబరు 12–1 లో ఆరు ఎకరాల స్థలంలో ఏపీ భంజ్‌దేవ్‌ చేపల చెరువు ఏర్పాటు చేసేందుకు గతంలో దరఖాస్తు చేసుకోగా ఆ మండల తహసీల్దార్‌ సిఫారసు మేరకు జిల్లా కమిటీ గతంలో ఆమోదం తెలిపింది. ఇటీవల జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ చెపల చెరువు భూములపై దర్యాప్తు జరిపిన పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ నేతత్వంలోని సబ్‌ కమిటీ గ్రామదేవతకు చెందిన భూములు ఆక్రమిస్తూ ఈ చెరువు తవ్వించినట్టు నిర్థారించింది. ఈ స్థలానికి హక్కుదారుగా గ్రామదేవత వున్నారని, సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌ లో ఈ మేరకు నమోదై వున్నట్టు సబ్‌ కమిటీ పేర్కొంది.

సర్వే నం.12–1లోని స్థలంపై అక్వా రైతు ఆర్‌పీ భంజ్‌దేవ్‌ సోదరుడైన ఏ.పి.భంజ్‌దేవ్‌కు ఎలాంటి న్యాయపరమైన హక్కు లేనందున సబ్‌ కలెక్టర్‌ కమిటీ నివేదిక ఆధారంగా జిల్లా స్థాయి కమిటీలో అనుమతులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు ఇదే వ్యక్తుల చేతిలో గ్రామంలోని సర్వే నెంబరు 14–1లో 3.25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన చేపల చెరువులోనూ 2.81 ఎకరాల ప్రభుత్వ ఇనాం భూమి ఆక్రమణకు గురైనట్టు సబ్‌ కలెక్టర్‌ నేతత్వంలోని సబ్‌ కమిటీ నిర్ధారించింది. ఈ చెరువు ఏర్పాటుకు జిల్లా స్థాయి కమిటీ అనుమతి పొందలేదని, ఈ చెరువు కూడా అక్రమమైనదేనని కమిటీ నిర్థారించింది. ఈ మేరకు ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణలు తొలగించాలని, అక్రమంగా ఏర్పాటు చేసిన చెరువులను కూడా నిర్మూలించాలని సమావేశంలో నిర్ణయించారు.

కోర్టు ఆదేశాలు... సబ్‌కలెక్టర్‌ విచారణ 
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భంజ్‌దేవ్, అతని సోదరులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ, గ్రామ దేవత భూములను ఆక్రమించుకుని చేపల చెరువులు సాగు చేసుకుంటున్నారు. రైతులు సాగునీటికి వాడాల్సిన పెద్దగెడ్డ జలాశయ నీటిని తమ చేపల చెరువుకు మళ్లించుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై స్థానికులు కొందరు న్యాయస్థానంలో పిటిషన్‌ కూడా వేశారు. ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరిలో హైకోర్టు బెంచ్‌ ఒక తీర్పు వెలువరించింది. చెరువులపై విచారణ జరిపి, ఆక్రమితమని తేలితే ధ్వంసం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. విచారణ బాధ్యతలను సబ్‌కలెక్టర్‌కు జిల్లా కలెక్టర్‌ అప్పగించారు. సాక్షి కథనాల్లో చెప్పిన అంశాలన్నీ వాస్తవాలేనని సబ్‌ కలెక్టర్‌ విచారణలో తేలింది. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా కమిటీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. 

సంచలనం సృష్టించిన సాక్షి 
భంజ్‌దేవ్‌ చేపల చెరువుల ఆక్రమణలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. అన్ని ఆధారాలతో వరుస కథనాలను ప్రచురించింది. వాటిని కూడా పిటిషన్‌దారులు కోర్టుకు సమర్పించారు. అదే విధంగా ‘సాక్షి’ కథనాల కారణంగా నియోజకవర్గ ప్రజల్లో చైతన్యం వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం భంజ్‌దేవ్‌ను పిలిపించి వివరణ కోరారు.  దశాబ్దాలుగా జరుగుతున్న అక్రమానికి అడ్డుకట్టవేయడంలో ప్రధాన భూమిక పోషించిన ‘సాక్షి’ చరిత్ర సృష్టించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement