పార్వతీపురంటౌన్: ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ కోరాడ నారాయణరావు వీరంగం సృష్టించాడు. ప్రశాంతంగా జరుగుతున్న పార్వతీపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని రచ్చచేయాలన్న దురుద్దేశంతో గొడవకు దిగాడు. అధికారపక్ష కౌన్సిలర్, దళితుడైన నిమ్మకాయల సుధీర్‌ను కులంపేరుతో దూషించాడు. ఆయనపై దాడికి పాల్పడ్డాడు. దీంతో శనివారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. టీడీపీ కౌన్సిలర్లు సభదృష్టికి తెచ్చిన సమస్యలకు అధికార పక్ష సభ్యులు నిదానంగా సమాధానం చెబుతున్నారు. ఈ దశలో నారాయణరావు సహనం కోల్పోయాడు. అధికారంలేదన్న యావతో ఉగ్రరూపందాల్చాడు. తిట్లదండం అందుకున్నాడు. సభా మర్యాదలను పక్కనపెట్టి దూషించాడు. దీంతో దళిత కౌన్సిలర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నారాయణరావుపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసినట్టు సీఐ కృష్ణారావు తెలిపారు. టీడీపీ కౌన్సిలర్ ఇచ్చిన ఫిర్యాదుపైనా విచారణ చేస్తున్నామన్నారు.
చర్యలకు డిమాండ్
దళితులను కులంపేరుతో కించపరిచిన టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెల్లి కులసంఘం సభ్యులు సొండి గోపి డిమాండ్ చేశారు. టీడీపీ కౌన్సిలర్, నాయకుల తీరుకు నిరసనగా పార్వతీపురం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. గతంలో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ‘దళితులుగా పుట్టాలి అని ఎవరు కోరుకుంటారని’ కించపరిచారని, ఇప్పు డు అదే తోవలో ఆ పార్టీ నాయకులు పయనిస్తు న్నారని దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో రెల్లికుల సభ్యులు గండి లక్ష్మి, సొండి శంకరరావు, న్యాయవాది చైతన్య, పాలకొండ రాజశేఖరు, కోలా రాజు, నిమ్మకాయల సుందరరావు, దేవుపల్లి సోకు, దాసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment