ఇన్‌చార్జి మంత్రి రాకను జీర్ణించుకోలేకపోతున్న వైనం
ఇప్పటికే వర్గపోరుతో ప్రతి నియోజకవర్గంలోనూ రచ్చ
సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమిలో వర్గ పోరుకు ఇన్‌చార్జి మంత్రి కేటాయింపు మరింత ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో పార్టీ చీలికలుగా మారింది. ఎవరికి వారే.. యమునా తేరే అన్నట్లుగా వ్యవహారం ఉంది. ఇప్పుడు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును నియమించడంతో ఇక్కడి నాయకులు ఒక్కొక్కరూ తారాజువ్వలు, బాంబుల్లా మండిపోతున్నారు.
జిల్లాలో అచ్చెన్న హవా!
అచ్చెన్నాయుడుకు జిల్లా టీడీపీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో శ్రీకాకుళం జిల్లా పరిధిలో పాలకొండ ఉన్నప్పుడు.. ఆ నియోజకవర్గ రాజకీయాలు ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. దీనికి తోడు రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగానూ ఆయన పని చేయడం వల్ల చాలామంది నాయకులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఇదే సందర్భంలో పాలకొండ నియోజకవర్గంలో కళా వెంకటరావు, అచ్చెన్నాయుడు వర్గాల మధ్య ఆది నుంచి ఆదిపత్య పోరు నడిచేది. అప్పట్లో ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ టీడీపీలో ఉంటూ, కళా వెంకటరావు శిష్యునిగా పేరుపొందారు.
ప్రస్తుత పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవితోపాటు, మరి కొంతమంది నియోజకవర్గ ముఖ్యనేతలు అచ్చెన్న వర్గంలో ఉండేవారు. గత ఎన్నికల సమయంలోనూ జయకృష్ణకు టికెట్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో చాలా ప్రయత్నాలే జరిగాయి. చివరి నిమిషంలో ఆయన జనసేనలోకి మారి, టికెట్ సాధించి, ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటికీ నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. జనసేన, టీడీపీలు వేర్వేరుగానే కార్యక్రమాలు చేసుకుంటున్నాయి. టీడీపీలోనూ కొంతమంది పడాల భూదేవి వర్గంతో ఉండిపోగా, మరి కొందరు ఎమ్మెల్యే వెంట నడుస్తున్నారు. సభ్యత్వ నమోదు కూడా ఇదే కోవలో సాగుతోంది.
నివురుగప్పిన నిప్పు
ఒక్క పాలకొండ నియోజకవర్గంలోనే కాక.. మిగిలిన నియోజకవర్గాల్లోనూ కూటమిలో వర్గ పోరు తీవ్రంగా ఉంది. పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర అంతా తానై వ్యవహరిస్తున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ శాసన మండలి సభ్యుడు జగదీష్లతో ఆయనకు మొదటి నుంచి పొసగడం లేదు. బీజేపీ, జనసేన కూడా వేరుగానే ఉన్నాయి. కురుపాం నియోజక వర్గంలో ఎమ్మెల్యే జగదీశ్వరి, టీడీపీ నేత వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్ మధ్య విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాలూరు నియోజక వర్గంలో మంత్రి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్ల మధ్య నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉంది.
అచ్చెన్న నియామకంతో కుదుపు...
ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలంతా తమ కనుసన్నల్లోనే అంతా ఉండాలని భావిస్తూ వచ్చారు. ఇప్పుడు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా అచ్చెన్నాయుడును నియమించడంతో అంతా తలకిందులు అయ్యింది. పాలకొండ కాక, మరో నియోజక వర్గానికి చెందిన నేతకు గత ఎన్నికల ముందు టికెట్ రాకుండా అచ్చెన్నాయుడు చివరి నిమిషం వరకూ ప్రయత్నాలు చేసినట్లు అప్పట్లో జోరుగా వినిపించింది. ఆ నేత వ్యతిరేక వర్గానికి అచ్చెన్న నుంచి పూర్తి మద్దతు ఉంది. చినబాబు ఆశీస్సులు ఉండడంతో అచ్చెన్న ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అప్పటి నుంచి ఆ నేత అచ్చెన్నాయుడు మీద గుర్రుగా ఉన్నారు. జిల్లా రాజకీయాల్లో అచ్చెన్న వేలు పెడితే పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుందని, తన హవాకు బ్రేక్ పడుతుందని భావించిన ఆ నేత.. జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లి, ఇన్‌చార్జి మంత్రిని మార్పు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్‌లకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. వారి విన్నపాన్ని చంద్రబాబు తిరస్కరించినట్లు భోగట్టా.
ఎమ్మెల్యేల దూకుడుకు చెక్ పెట్టేందుకేనా?
మన్యం జిల్లాలో కూటమి ఎమ్మెల్యేల ప్రవర్తన.. పార్టీలో వర్గ పోరుపై చంద్రబాబుకు కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అచ్చెన్న వంటి సీనియర్ నేత ఉంటే.. వారి దూకుడుకు చెక్ పెట్టవచ్చని అధినేత భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఆయనను నియమించినట్లు తెలిసింది. మొత్తంగా ఇప్పటికే వర్గపోరుతో రగిలిపోతున్న జిల్లా కూటమిలో.. ఇన్‌చార్జి నియామక రగడ మరింత చిచ్చురేపినట్లే కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment