సోమవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పాటు మంగళవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్‌దే హవా కొనసాగింది.
చీరాల, న్యూస్‌లైన్ : చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సైకిల్‌కు పంచరైంది. సోమవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పాటు మంగళవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్‌దే హవా కొనసాగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ఎక్కడా కూడా టీడీపీ తన ఆధిక్యతను ప్రదర్శించలేకపోయింది. ఎంపీటీసీ ఫలితాల్లో చీరాల మండలంలో పూర్తిగా ఫ్యాన్‌గాలి వీయగా, వేటపాలెం మండలంలో మాత్రం ఇండిపెండెంట్ ప్యానెల్ చీరాల పరిరక్షణ సమితి హవా కనిపించింది.
నియోజకవర్గంలోని చీరాల మండలంలో మొత్తం 24 ఎంపీటీసీ స్థానాలుండగా వైఎస్‌ఆర్ సీపీ రెబల్ అభ్యర్థిని కలుపుకుని మొత్తం 11 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 9 స్థానాల్లో, చీరాల పరిరక్షణ సమితి 3 స్థానాల్లో, బహుజన సమాజ్ పార్టీ ఒకస్థానంలో విజయం సాధించాయి. వేటపాలెం మండలంలోని 21 స్థానాల్లో చల్లారెడ్డిపాలెం ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవంతో కలుపుకుని చీరాల పరిరక్షణ సమితి 11 స్థానాల్లో, టీడీపీ 5, వైఎస్‌ఆర్ సీపీ 3, ఇండిపెండెంట్ ఒక స్థానంలో విజయం సాధించారు. పురపోరుతో పాటు ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ సీపీ హవా ప్రస్ఫుటంగా కనిపించింది.
చీరాల రూరల్ మండలంలో వైఎస్‌ఆర్ సీపీ తరఫున గవినివారిపాలెం మెయిన్ నుంచి గవిని శ్రీనివాసరావు, గవినివారిపాలెం (ఈగవారిపాలెం) నుంచి గవిని పాపాగారి శ్రీనివాసరావు, కావూరివారిపాలెం నుంచి కావూరి హుస్సేనమ్మ, ఈపూరుపాలెం పద్మనాభునిపేట నుంచి గోలి ఆనందరావు, బుర్లవారిపాలెం నుంచి దేవరపల్లి ఎలీషమ్మ, కొత్తపాలెం నుంచి అన్నపురెడ్డి లక్ష్మి, వాడరేవు మెయిన్ నుంచి మచ్చా జ్యోతి, వాడరేవు పెదబరప నుంచి పిక్కి కాశీరావు, వాడరేవు (కీర్తివారిపాలెం) నుంచి పిన్నిబోయిన రామకృష్ణ, చీరాలనగర్ నుంచి ముచ్చు శివకుమారి గెలుపొందారు. సాల్మన్‌సెంటర్ నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీచేసిన షేక్ బాషా గెలిచిన అనంతరం వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. దీంతో మొత్తం 11 స్థానాలను వైఎస్‌ఆర్ సీపీ కైవసం చేసుకుంది.
వేటపాలెం మండలంలో...
వేటపాలెం మండలంలో గతంలో ఏకగ్రీవమైన చల్లారెడ్డిపాలేన్ని కలుపుకుని మొత్తం 11 స్థానాలలో చీరాల పరిరక్షణ సమితి గెలుపొందింది. కొత్తపేట మెయిన్ నుంచి టి.వెంకటతులసీరామ్, కొత్తపేట సంపత్‌నగర్ నుంచి దాసరి కోటేశ్వరరావు, దేశాయిపేట ఐటీఐ కాలనీ నుంచి వెంగళ భరత్‌బాబు, చల్లారెడ్డిపాలెం మెయిన్ నుంచి రావూరి సుజాత, దేశాయిపేట మెయిన్ నుంచి దంతం శివలక్ష్మి, వేటపాలెం మెయిన్ నుంచి షేక్ గౌసియా, వేటపాలెం రెడ్లలంప నుంచి జాగాబత్తుని శ్రీనివాసులు, వేటపాలెం సర్వోదయకాలనీ నుంచి షేక్ అప్సరున్సీసా, వేటపాలెం చిన్నబజారు నుంచి అంజమ్మ, రామన్నపేట మెయిన్ నుంచి బండ్ల తిరుములాదేవి, పందిళ్లపల్లి తోకపేట నుంచి పేరిశెట్ల పద్మజ గెలుపొందారు.
అలానే వైఎస్‌ఆర్ పీపీ తరఫున కొత్తపేట ఐఎల్‌టీడీ కాలనీ నుంచి రొడ్డా మంగమ్మ, దేశాయిపేట జీవరక్షనగర్ నుంచి పాలెపు ఆల్ఫెడ్, పుల్లరిపాలెం నుంచి కోడూరి వెంకటేశ్వర్లు గెలుపొందారు. టీడీపీ తరఫున అక్కాయిపాలెం నుంచి బుర్ల సుబ్బరావమ్మ, దేశాయిపేట అనుమల్లిపేట నుంచి కట్టా గంగయ్య, దేశాయిపేట రామానగర్ నుంచి బుర్రా కవిత, రామన్నపేట రావూరిపేట నుంచి పేర్నేటి సుమతి, పందిళ్లపల్లి మెయిన్ నుంచి జి.వాణి గెలుపొందారు. పాపాయిపాలెం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి సూరగాని లక్ష్మి విజయం సాధించారు. రెండు మండలాల్లో టీడీపీ అభ్యర్థి ఎంపీపీ అయ్యే అవకాశాలు లేకపోవడంతో ఆ పార్టీకి నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగిలింది.