
కార్యాలయాన్ని ముట్టడిస్తున్న గోకర్నపల్లి గ్రామస్తులు
శ్రీకాకుళం ,పొందూరు: మండలంలో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గోకర్నపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చింతాడ ప్రసాదరావు, కిల్లి నాగేశ్వరరావులు ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిషత్ కార్యాలయం, వెలుగు కార్యాలయాలను సుమారు 200 మంది ముట్టడించారు. టీడీపీ జెండాలతో ఎంపీడీఓ కార్యాలయంలోకి ప్రవేశించి రసాభాస చేశారు. కుర్చీలను విరగ్గొట్టారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఒక వర్గానికే పింఛన్లు, పసుపు–కుంకుమ చెక్‌లు ఇమ్మని చెప్పారా అని ఈఓపీఆర్‌డీ మధుసూదనరావును నిలదీశారు. రచ్చబండ వద్ద పింఛన్లు ఇవ్వాలని ఎంపీడీఓ ఆదేశాలిస్తే వీఆర్‌ఓ జనక చక్రవర్తి సర్పంచ్ ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయడం ఏంటని ప్రశ్నించారు. వీఆర్‌ఓ రాజీకీయం చేస్తున్నారని, వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయం బయటకు ఉద్యోగులను పంపించేశారు. పోలీసులు సముదాయిస్తున్నప్పటికీ లెక్కచేయలేదు. ఆందోళనను కొనసాగిస్తూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీఓ కార్యాలయానికి తాళాలు వేశారు. పక్కనే ఉన్న వెలుగు కార్యాలయానికి చేరుకొని ఏపీఎం మంగమ్మను బయటకు పిలిచి తాళాలు వేశారు.
తమ గ్రామంలో పసుపు–కుంకుమ చెక్‌లను సర్పంచ్ ఇంటికి అందించారని నిలదీశారు. రచ్చబండ దగ్గర ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారా అంటూ ఏపీఎంపై మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు మంగమ్మను వెలుగు కార్యాలయంలోకి పంపిచేశారు. పసుపు–కుంకుమ చెక్కులను అందించే వరకు ఇక్కడే కూర్చుంటామని బైఠాయించారు. ఇంతలో సీఐ విశ్శేశ్వరరావు, ఎంపీడీఓ చింతాడ లక్ష్మీబాయి, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నెపు రాము అక్కడకు చేరుకోవడంతో ఆందోళన కొనసాగించారు. పింఛన్లు, పసుపు–కుంకుమ చెక్‌లు తక్షణమే ఇవ్వాలని, లేదంటే రచ్చబండ వద్ద అందించాలని డిమాండ్ చేశారు. గ్రామంలోబతికున్న ఇద్దరు చనిపోయారని డెత్ సర్టిఫికెట్లను సృష్టించి వారి భార్యలకు పింఛన్లు ఎలా ఇస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. దీనిపై ఎంపీడీఓ స్పందించి విచారణ జరిపిస్తామని హామీఇచ్చారు. అనంతరం ఎంపీడీఓ చాంబర్‌లో కాసేపు చర్చించుకున్న అధికారులు బయటకు వచ్చి బుధవారం పింఛన్లు, చెక్‌లు రచ్చబండ వద్దే అందిస్తామని హామీనిచ్చారు. దీంతో గ్రామస్తులు వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment