ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుణ్యమా అంటూ నిడదవోలు పురపాలక సంఘానికి తీవ్ర నష్టం ఏర్పడుతోంది. నిడదవోలులో చేపట్టిన పాదయాత్ర ఖర్చును
నిడదవోలు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుణ్యమా అంటూ నిడదవోలు పురపాలక సంఘానికి తీవ్ర నష్టం ఏర్పడుతోంది. నిడదవోలులో చేపట్టిన పాదయాత్ర ఖర్చును పురపాలక సంఘమే భరించాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు అధికార పార్టీ పాలకవర్గంతోపాటు అధికారులు కలసి మునిసిపల్ సాధారణ నిధులు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల్లో ఈ ఏడాది జనవరి 18న ముఖ్యమంత్రి పాదయాత్ర చేశారు. పాదయాత్ర మండలంలో సింగవరం నుంచి పట్టణ శివారున సుబ్బరాజుపేట వరకు, అక్కడి నుంచి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వరకు సుమారు మూడు కిలోమీటర్లు సాగింది.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు మొత్తం రూ.6.80 లక్షలు ఖర్చయిందని అధికారులు లెక్కలు కట్టారు. పాదయాత్ర ఖర్చుకు సంబంధించిన మొత్తాన్ని మంజూరు చేయాలని మునిసిపల్ అధికారులు పలుమార్లు జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌కు లేఖలు రాశారు. దీంతో పాదయాత్ర ఖర్చును కౌన్సిల్‌లో ర్యాటిఫికేషన్ తీసుకుని బిల్లులు చెల్లించాలని ఆదేశాలు అందాయి. మునిసిపల్ సాధారణ నిధుల నుంచి సొమ్ము చెల్లించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నెల 27న నిర్వహించనున్న మునిసిపల్ సాధారణ సమావేశపు అజెండాలో ఈ ఆంశాన్ని చేర్చారు. మరి ఆ సమావేశంలో ఏం తేలనుందో వేచి చూడాల్సిందే.
పాదయాత్ర ఖర్చులు
1. పట్టణంలో అద్దె ప్రాతిపదికన నాలుగు జేసీబీలు, రెండు బ్లేడ్ ట్రాక్టర్లకు రూ.2.20 లక్షలు
2. యుద్ధ ప్రాతిపదికన ఫ్లడ్‌లైట్ల ఏర్పాటుకు రూ.1.30 లక్షలు
3. పట్టణంలో మునిసిపల్ బీటీ రోడ్ల మరమ్మతులకు రూ.75 వేలు
4. ఎన్టీఆర్ కాలనీ, ఎన్టీఆర్ విగ్రహం, ప్రభుత్వ ఆసుపత్రి, డిగ్రీ కళాశాల ప్రాంగణంలో స్టేజీ ఫ్లాట్‌పాంల ఏర్పాటుకు రూ.90 వేలు
5. పాదయాత్ర మార్గంలోనూ, బహిరంగ సభలోనూ మంచినీళ్ల ఏర్పాటుకు రూ.50 వేలు
6. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో చంద్రబాబు విశ్రాంతి తీసుకునే గది పక్కనే మరుగుదొడ్డి ఏర్పాటుకు రూ.35 వేలు
7. షామియానాలు, కుర్చీలకు రూ. 25 వేలు
8. ఎన్టీఆర్ కాలనీలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కర్టెన్ ఏర్పాటుకు రూ.25 వేలు, సెమినరీ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఫిలిఫ్స్ కంపెనీ ఎల్‌ఈడీ లైట్ ఏర్పాటుకు రూ.20 వేలు
9. వాహనాల ఇంధన ఖర్చు రూ.10 వేలు