ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తాయిలాలు
వద్దన్నవారికీ బలవంతంగాడబ్బు పంపిణీ
చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి..
గుడివాడలో యూటీఎఫ్ నిరసన ధర్నా
ఎమ్మెల్సీ సీటు కోసం టీడీపీ నేతలు కోట్లు కుమ్మరిస్తున్నారు. ఈ నెల 22న జరగనున్న ఎన్నికల్లో తమ అభ్యర్థి విజయంపై అనుమానాలు రావడంతో ఇప్పటి నుంచే ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఓటుకు రూ.3వేల చొప్పున ఎర వేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తెరవెనుక మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.
విజయవాడ : ఈ నెల 22న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం అలవాటైన పచ్చచొక్కా నేతలు ఇప్పుడు మేధావుల ఎన్నికలనూ అదే తరహాలో మార్చేస్తున్నారు. ఈసారి టీడీపీ మద్దతుతో ఏఎస్ రామకృష్ణ బరిలోకి దిగగా, ఆయనకు పోటీగా యూటీఎఫ్ తరఫున కేఎస్ లక్ష్మణరావు నిలిచారు. ఆయన విజయం సాధిస్తారనే అనుమానంతో గురువారం సాయంత్రం టీడీపీ నేతలు రంగంలోకి దిగి నోట్ల పంపిణీకి తెరతీశారు.
చంద్రబాబు ఆదేశాలతోనే..
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం నగరానికి వచ్చారు. ఆయన తిరిగి వెళ్తూ రామకృష్ణ విజయం గురించి ఆరా తీశారు. ఈసారి ఎమ్మెల్సీ సీటు ఏదో విధంగా దక్కించుకోవాలంటూ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు. తక్కువ మెజారిటీ వచ్చిన నియోజకవర్గాలపై సీఎం దృష్టి పెడతారంటూ ప్రచారం జరగడంతో ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేసి చివరి రెండు రోజులు పెద్ద ఎత్తున డబ్బు వెదజల్లుతున్నారు. ముఖ్యంగా తమకు సీట్లు రావని భావించే చోట డబ్బులు గుప్పించాలని నిర్ణయించారు.
యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన
ఉపాధ్యాయులు, అధ్యాపక ఓట్లు కొనేందుకు టీడీపీ నేతలు పోటీపడుతుండడం యూటీఎఫ్ నేతలను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో గురువారం గుడివాడలో ఆ వర్గం నేతలు గురువారం రోడ్డెక్కారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఒక్కో ఓటుకు రూ.3వేల చొప్పున పంపిణీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చోద్యం చూస్తున్న అధికారులు
మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు రంగంలోకి దిగి ఓట్లు తమకు అనుకూలంగా పడేందుకు కావాల్సిన డబ్బు ఎర వేస్తుండటంతో అధికారులు ఏమీ చేయలేక చోద్యం చూస్తున్నారు. యూటీఎఫ్ నేతలు ఫిర్యాదు చేస్తే టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, డబ్బు పంపిణీ జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారే తప్ప ఆ దిశగా జరుగుతున్న చర్యలు మాత్రం నామ మాత్రమే. అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం.
వద్దంటే డబ్బు
యూటీఎఫ్‌కు బలంగా ఉన్న ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు డబ్బు తీసుకుని ఓటు వేయడానికి నిరాకరిస్తున్నారు. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తామని వారు చెబుతున్నా బలవంతంగా డబ్బు అంటగడుతున్నారని సమాచారం. మైలవరం, జగ్గయ్యపేట, పెనమలూరు, గుడివాడ నియోజకవర్గాల్లో ఇప్పటికే ఈ తరహాలో జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో విజయవాడతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లోనూ డబ్బు పంపిణీ చేసేందుకు కసరత్తు జరుగుతోందని సమాచారం.
ఓటుకు 3 వేలు !
Published Fri, Mar 20 2015 12:51 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement