భూమాపై ‘హత్యాయత్నం’ కేసు | tdp plays backstabbing politics, Attempt to murder case on Bhuma Nagi Reddy | Sakshi
Sakshi News home page

భూమాపై ‘హత్యాయత్నం’ కేసు

Published Sat, Nov 1 2014 1:41 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

భూమాపై ‘హత్యాయత్నం’ కేసు - Sakshi

భూమాపై ‘హత్యాయత్నం’ కేసు

నంద్యాల మునిసిపల్ కౌన్సిల్‌లో రసాభాస..
ప్రతిపక్షంపై టీడీపీ సర్కారు మరో కక్షసాధింపు చర్య


నంద్యాల: ప్రతిపక్ష పార్టీని వేధించేందుకు ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని వేచిచూస్తున్న అధికార టీడీపీ సర్కారు.. అందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో చోటుచేసుకున్న స్వల్ప తోపులాట, ఘర్షణ నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై.. హత్యాయత్నం, దాడి కేసులు నమోదు చేసి అరెస్టు చేసేందుకూ సిద్ధపడింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు రాత్రికి రాత్రి ఆయన ఇంటివద్ద పోలీసులను మోహరించింది.

కర్నూలు జిల్లా నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ శుక్రవారం టీడీపీకి చెందిన మునిసిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన సమావేశమైంది. వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ అనూష సమావేశానికి గైర్హాజరు కావడంతో ఆమె స్థానంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వాకా శివశంకర్, మరో కౌన్సిలర్ కృపాకర్ కూర్చున్నారు. వారు వెనుక కుర్చీలోకి వెళ్లాలని టీడీపీ కౌన్సిలర్లు గొడవకు దిగారు. శివశంకర్ సమాధానం చెబుతుండగానే.. ఆయనను సస్పెండ్ చేస్తానంటూ చైర్మన్ హెచ్చరించారు. ఇంతలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సమావేశానికి హాజరయ్యారు. వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నంలో భాగంగా శివశంకర్‌ను వెనుక కుర్చీలో కూర్చోవాలని సూచించారు.

పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఎజెండాలోని అంశాలపై చర్చ జరగకుండానే సమావేశం ముగిసిందని చైర్మన్ ప్రకటించారు. భూమా నాగిరెడ్డి కల్పించుకుని తాను పట్టణ సమస్యలపై చర్చించాల్సి ఉందని పట్టుబట్టి మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే చైర్మన్ మరోసారి సమావేశం ముగిసిందని బెల్ కొట్టడమే కాకుండా.. ఆమె భర్త, కోఆప్షన్ సభ్యుడు దేశం సుధాకర్‌రెడ్డి.. ఎమ్మెల్యే ప్రసంగం వినాల్సిన అవసరం లేదని టీడీపీ కౌన్సిలర్లను ఆదేశించారు. దీనికి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేయటంతో వారితో టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు.

టీడీపీ వర్గీయులు దాడికి దిగటంతో పరిస్థితి కుర్చీలు విసురుకునే వరకు వెళ్లింది. ఎమ్మెల్యే భూమా సర్దిచెప్పబోయినా ఫలితంలేకపోయింది. ఘటనలో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన మైనార్టీ కౌన్సిలర్లు ముర్తుజా, కరీముల్లా గాయపడ్డారు. టీడీపీకి చెందిన వెంకటసుబ్బయ్య, మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్‌లకూ గాయాలయ్యాయి. చైర్మన్, మునిసిపల్ కమిషనర్ చాంబర్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.

అంతకుముందు చైర్‌పర్సన్, టీడీపీ కౌన్సిలర్లు ఏఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ రవికృష్ణ నంద్యాల చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అధికార పార్టీ నేతల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు హత్యాయత్నం, దాడి కేసులు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి భూమాను అరెస్టు చేయడానికి వారెంట్ తీసుకొని పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేనందున ఇంటి వద్దే కాపు కాశారు.

హక్కులను కాలరాస్తున్నారు: భూమా
శాసనసభ్యుని హక్కులను కాలరాస్తున్న మునిసిపల్ చైర్మన్ దేశం సులోచనపై, అధికారులపై శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement