
ప్రజా సమస్యలపై పోరాడితే దొంగ కేసులా?
సాక్షి, హైదరాబాద్: సమస్యలపై ప్రజల తరపున ఎవరైతే పోరాడుతున్నారో వారిని నిర్వీర్యం చేసే విధంగా దొంగ కేసులు పెట్టే స్థాయికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారి పోయారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు గద్దె నెక్కిన తరువాత అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టిన వారిలో భూమా నాగిరెడ్డి నాలుగో ఎమ్మెల్యే అని చెప్పారు. నంద్యాల పోలీసుల అక్రమ కేసులకు గురై రిమాండ్ ఖైదీగా ఉంటూ ‘నిమ్స్’లో చికిత్స పొందుతున్న పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డిని జగన్ గురువారం మధ్యాహ్నం పరామర్శించారు. పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలసి ఆసుపత్రికి వచ్చిన జగన్ కొద్దిసేపు భూమాతో గడిపి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యులతో కూడా మాట్లాడారు. అనంతరం ఆయన నిమ్స్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు.
ప్రజల తరఫున పోరాడుతున్న తమ ఎమ్మెల్యేలు ఆర్.కె.రోజా(నగరి), సునీల్ (పూతలపట్టు), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల)పై వరుసగా తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో పట్టణంలో రోడ్ల వెడల్పునకు సంబంధించిన సమస్యలపై ఎమ్మెల్యే హోదాలో భూమా నాగిరెడ్డి ప్రస్తావించకుండా అధికారపక్షం వారు అడ్డుకుని గొడవ సృష్టించారని చెప్పారు. ఆ చిన్న గొడవను హత్యాయత్నం వంటి దారుణమైన కేసుగా మలిచారంటే ఎలాంటి పరిస్థితుల్లోకి వ్యవస్థను తీసుకెళుతున్నారో అర్థమవుతుందన్నారు. ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులను ఇలా ఇబ్బందులు పెట్టడం తగదన్నారు. నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ ఇదే అంశంపై విలేకరులకు అన్ని విషయాలు చెబుతారని కూతురు లాంటి ఆమె ఆవేదన విన్న తరువాతనైనా బాబుకు బుద్ధి వస్తుందని భావిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భూమాపై రౌడీ షీటుకు సంబంధించి కోర్టులో పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.