నంద్యాలపై టీడీపీ వింత లెక్కలు!
♦ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఖర్చు రూ.300 కోట్లు!
♦ అధికారులు నమోదు చేసింది రూ.16.60 లక్షలు మాత్రమే
♦ అభ్యర్థి చూపిస్తున్న ఎన్నికల వ్యయం రూ.6.49 లక్షలు
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాలలో అధికార పార్టీ అభ్యర్థి ఎన్నికల వ్యయానికి సంబంధించి చూపుతున్న లెక్కలు విస్తుగొలుపుతున్నాయి. ఎన్నికల్లో నెగ్గేందుకు కోట్లాది రూపాయలను వెదజల్లిన టీడీపీ తమ అభ్యర్థి ఖర్చు కేవలం రూ.6.49 లక్షలే అని పేర్కొనటంపై జనం నివ్వెరపోతున్నారు. ఉప ఎన్నికలో ఎలాగైనా నెగ్గేందుకు టీడీపీ డబ్బులు పారించిందనేది బహిరంగ సత్యం. నియోజకవర్గం మొత్తమ్మీద దాదాపు రూ.300 కోట్లు కుమ్మరించినట్లు అంచనా. టీడీపీ నేతల డబ్బు పంపిణీపై ‘సాక్షి’లో సాక్ష్యాలతో సహా కథనాలు ప్రచురితమయ్యాయి.
చంద్రబాబు పర్యటన ఖర్చే రోజుకు రూ.కోటి
ఉపఎన్నికల్లో అధికార పార్టీ మద్యాన్ని ఏరులై పారించింది. మద్యం ఖర్చే రూ.కోట్లలో ఉంది. అయితే టీడీపీ అభ్యర్థి చూపిన ఖర్చు అక్షరాలా కేవలం 6 లక్షల 49 వేల రూపాయలు మాత్రమే. కాంగ్రెస్ అభ్యర్థి కంటే దాదాపు రూ.20 వేలు ఎక్కువగా చూపారు. నామినేషన్ రోజు నుంచి పోలింగ్‌కు రెండు రోజుల ముందు వరకు టీడీపీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.6.49 లక్షలేనట. నంద్యాలలో 20 మందికి పైగా మంత్రులు తిష్టవేశారు. నామినేషన్ దాఖలైన తర్వాత సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించారు. ఈ పర్యటన ఖర్చే రోజుకు రూ.కోటి వరకు ఉంటుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పర్యటించారు.
టీడీపీ తరఫున బీజేపీ నేతలూ ప్రచారం చేశారు. అయినప్పటికీ టీడీపీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.6.49 లక్షలే అని చూపడం గమనార్హం. అభ్యర్థులు చేసిన ఖర్చును ఎన్నికల అధికారులు పరిశీలించి షాడో అబ్జర్వేషన్ రికార్డులో నమోదు చేస్తారు. దాని ప్రకారం కూడా టీడీపీ అభ్యర్థి చేసిన ఎన్నికల ఖర్చు రూ.16.60 లక్షలు అని చూపిస్తుండటంతో జనం నివ్వెరపోతున్నారు. ఇక వైఎస్సార్ సీపీ అభ్యర్థి రూ.17.50 లక్షలు, కాంగ్రెస్ అభ్యర్థి రూ.6.59 లక్షలు ఖర్చు చేసినట్లు షాడో అబ్జర్వేషన్ రికార్డులో నమోదు చేశారు. కాగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రూ.10.39 లక్షలు, కాంగ్రెస్ అభ్యర్థి రూ.6.67 లక్షలు ఎన్నికల ఖర్చుగా చూపారు.