జిల్లా తెలుగుదేశంలో అప్పుడే టిక్కెట్ల హడావుడి మొదలైంది. అధినేత కబురు చేయగానే... ఎవరికి వారే తమతమ అనుయాయులతో అమరావతి తరలి వెళ్లారు. ఓ వైపు సిటింగ్‌లను మారుస్తారంటూ ప్రచారం జరగడం... కొందరిపై అవినీతి ఆరోపణలు రావడం... కొత్తకొత్త ఆశావహులంతా తమ మద్దతుదారులతో బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. కొందరైతే సిటిం గ్‌లపై అవినీతి చిట్టాలు కూడా తీసుకెళ్లారు. కొన్ని సీట్ల విషయంలో ముందస్తుగానే ఒప్పందా లు జరుగుతుండటం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపికకోసం అధినేత చేపట్టిన సమీక్షఎవరిని గట్టెక్కిస్తుందో... ఇంకెవరిని ముంచేస్తుందో... శుక్రవారానికి తేలిపోనుంది.
సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లా తెలుగుదేశం పార్టీలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. దీనికి శుక్రవారం బీజం పడబోతోంది. ఆ పార్టీలో నడుస్తున్న అంతర్గత కుమ్ములాటలపై అమరావతి వేదికగా అధినేత ముందు పంచాయితీ జరగనుంది. ఎవరికి వారే టీడీపీ నేతలు తమ తమ మద్దతుదారులతో రాజధానికి పయనమయ్యారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న వారు చంద్రబాబును చేరేలోపే తమలో తాము అంతర్గత ఒప్పందాలు చేసుకుంటున్నారు. జిల్లా రాజకీయంలో కీలకంగా భావిస్తున్న విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షను చంద్రబాబు శుక్రవారం అమరావతిలో నిర్వహించనుండటంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో జిల్లాలోని విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి,గజపతినగరం, బొబ్బిలి, శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. దాదాపు 14 లక్షల మంది ఓటర్లున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న విజయనగరం పార్లమెంట్‌కు, దాని పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీకి చెందిన వారే ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరిలో ఒకరు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీకి వెళ్లిపోయినా రికార్డుల ప్రకారం ఇంకా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వీరిలో ఎవరికి మళ్లీ టిక్కె ట్టు ఇవ్వాలనేదానిపై ఒక స్పష్టత తెచ్చుకునేందుకు, అవసరమైతే అభ్యర్థులను ఖరారు చేసుకునేందుకు అమరావతిలో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
జిల్లానుంచి తరలిన నేతలు
పార్టీ అధినేత పిలుపు మేరకు, సమీక్షలో పాల్గొనేందుకు జిల్లా నుంచి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ నేతలు అమరావతికి గురువారమే బయలుదేరి వెళ్లారు. వీరంతా ఎవరికి వారు తమ తమ గ్రూపు నేతలతో వేర్వేరుగా వెళ్ల డం విశేషం. కొందరు కొత్తవారు సిటింగ్‌లపై అవినీతి చిట్టాలు తీసుకువెళ్లారు. విజయనగరం నుంచి ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, యాదవ సామాజిక వర్గ నేతలు వెళ్లారు. అనుకున్నట్లుగానే వీరిలో ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. వీరికి సొంత పార్టీ పెద్దమనిషి నుంచే పోటీ ఎదురవుతోంది. ఎంపీ అశోక్‌గజపతిరాజు తన కుమార్తె అదితి గజపతికి ఎమ్మెల్యే టిక్కెట్టు అడగాలని చూస్తున్నారు. అదే జరిగితే గీత, ప్రసాదులకు ఆశాభంగం తప్పదు. వీరికి ఊరట కలిగే అంశం కూడ ఒకటుంది. అదేమిటంటే అదితి కి టిక్కెట్టు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు. కాబట్టి వీరిలో ఒకరికి అవకాశం వస్తుందనుకుంటున్నారు. కానీ ఈసారి తాను ఎంపీగా పోటీకి దిగనని అశోక్ చెబుతుండటంతో ఆ మాటమీదే ఆయన నిలబడితే ఆయనకు ఎమ్మె ల్యే టిక్కెట్టు ఇచ్చినా ఇవ్వొచ్చు. ఇలా కూడా వీరిద్దరిపై కత్తి వేలాడుతోంది.
నాయుడికి సోదరుని గండం
గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడికి కూడా పోటీ తప్పలేదు. అతని సొంత అన్న కొండబాబే ఈయనకు అడ్డుపడుతున్నారు. చంద్రబాబు కూడా ఈ సారి గజపతినగరం అభ్యర్థిని మార్చాలని భావిస్తున్నారు. అశోక్ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే గనుక నాయుడిని విజయనగరం ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని కూడా ఒక ఆప్షన్ పెట్టుకున్నారు. అప్పుడు గజపతినగరానికి మీసాల గీతను ఎమ్మెల్యేగా పంపే అవకాశాలను పరిశీలిస్తారని పార్టీ వర్గాల సమాచా రం. జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్ కూడా చినబాబు ఆశీస్సు లతో ఆశావహుల జాబితాలో చేరారు. నెల్లిమర్ల టిక్కెట్టుపైనా పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడితో పాటు భోగాపురం, డెంకాడ ఎంపీపీలు కర్రోతు బంగార్రాజు, కంది చంద్రశేఖర్, ఆనంద్ ఫౌం డేషన్ వ్యవస్థాపకుడు కడగల ఆనంద్‌కుమార్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు పోటీపడుతున్నారు.
కిమిడికి వ్యతిరేకంగా ఒక్కటైన ప్రత్యర్థులు
చీపురుపల్లిలో ఎమ్మెల్యే కిమిడి మృణాళికి వ్యతిరేకంగా కొంత కాలంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్న జెడ్పీ వైస్ చైర్మన్‌తో పాటు మరికొందరు ఆమెకు టిక్కెట్టు ఇవ్వవద్దని చెప్పనున్నారు. ఇటీవల తెరపైకి వచ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఓఎస్‌డీ టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేయనున్నారు. ఆయన ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో అన్నదమ్ములే అక్కడి టిక్కెట్టు కోసం పోటీపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి సుజయ్‌కు అతని తమ్ముడు బేబీనాయన రూపంలో కత్తి వేలాడుతోంది. ఈ ఇద్దరిలో ఎవరి మంత్రాంగం ఫలించి ఎవరిని టిక్కెట్టు వరిస్తుందోననేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ బేబి నాయనకే టిక్కెట్టు ఇవ్వాలనుకుంటే సుజయ్‌ను విజయనగరం ఎంపీ రెండవ ఆప్షన్ అభ్యర్థి కానున్నారు. ఇక వీరితో పాటు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఆమె వ్యతిరేకవర్గం మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, జెడ్పీ చైర్‌పర్సన్ శోభాస్వాతిరాణి కూడా అమరావతికి చేరుకున్నారు. అయితే గురువారం వీరంతా సమావేశమై కోళ్లనే ఎస్‌కోట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చేయాలని తీర్మానించారు. ఆగర్భ శత్రువులుగా కనిపించే ఈ రెండు వర్గాలూ కలవడం వెనుక అంతర్గత ఒప్పందాలున్న ట్లు సమాచారం. ఇలా జిల్లా టీడీపీ ముఖ్య నేతలంతా అమరావతిలో తమ పార్టీ అధినేత వద్ద సీట్ల పంచా యితీకి సన్నద్ధమయ్యారు. ఎవరి భవితవ్యం ఏమిటనేది సాయంత్రానికి తేలిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment