టీడీపీ కార్యాలయం ఆవరణలో ఆ పార్టీ నేతతో సర్వేరాయుడు (బోడి గుండు ఉన్న వ్యక్తి), (ఇన్‌సెట్లో) శ్రీరాంనగర్ కాలనీలోని సర్వేను అడ్డుకోవడంతో వారి బాస్‌తో మాట్లాడుతున్న సర్వేరాయుడు(టోపీ)
విజయనగరం, రామభద్రపురం: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగిస్తున్నారని ఓటర్లు ఆందోళన చెందుతున్న విషయం విదితమే. దీనికి సంబంధించి రామభద్రపురం మండలంలో సర్వేరాయుళ్లు హల్‌చల్ చేస్తున్నారు. ఓట్లు తొలగించే విధానం ఇదీ అంటూ డెమో కూడా ఇస్తున్న విషయం తెలిసిందే. టీడీపి నాయకులే ఈ భాగోతానికంతటికీ కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలోని సర్వేరాయుడును స్థానిక టీడీపీ ముఖ్య నాయకుడు ఒకరు శ్రీరాంనగర్ కాలనీకి మంగళవారం తీసుకెళ్లి సర్వే వివరాలు అడిగారు.
కాలనీకి చెందిన వారు కొందరు ఆ దొంగ ఓటర్ల సర్వే వ్యక్తి దగ్గర ఉన్న ట్యాబ్‌ను లాక్కొని సర్వేను తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీకి ముఖ్యనాయుకులై ఉండి ఈ పని చేయడం మంచిది కాదని ఆ నాయకుడిని నిలదీశారు. తాను కూడా టీడీపీకి చెందిన వ్యక్తిని అని సర్వే చేయడం మన కోసమే కదా అని సర్వేరాయుడు వారితో చెప్పడం తమకు ఆశ్చర్యం కలిగించిందని కాలనీ వాసులు చెబుతున్నారు. దీనికి బలం చేకూర్చుతూ ఇంటింటికీ తిరుగుతున్న సర్వే రాయుళ్లను టీడీపీ నాయకులు రక్షణ కల్పించి దగ్గరుండి తీసుకువెళ్లారు. వారిని స్థానిక టీడీపీ కార్యాలయంలో భద్రత కల్పిస్తూ కూర్చునేందుకు సౌకర్యాలు కల్పించారు. వైఎస్సార్‌సీపీ ఓట్లు తొలగిస్తున్నారన్న బలమైన ఆరోపణలకు ఇదే తార్కాణం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment