‘వైఎస్‌ఆర్ సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు’
చిత్తూరు: టీడీపీ ప్రభుత్వం హత్య రాజకీయాలను పోత్సాహిస్తూ..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఎంపీ మిథున్‌రెడ్డి విమర్శించారు. చిత్తూరు మండలం పిళ్లారిమిట్ట వెంకటాపురం గ్రామంలో జరిగిన గంగజాతరలో ఆయన బుధవారం పాల్గొన్నారు. అమ్మవారి దర్శించుకున్న అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. టీడీపీ రెండేళ్ల పాలనలో హత్య రాజకీయాలు పెచ్చరిల్లాయని అందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నారాయణరెడ్డిని హత్య చేయడం అతి దారుణమన్నారు.
నారాయణరెడ్డి హత్య పట్ల టీడీపీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందని, తన ప్రాణ రక్షణకు లైసెన్స్‌డ్ ఆయుధం కొనసాగించాలని ముందస్తుగా ఆయన అనుమతి కోరినా ఇవ్వకపోవడం ముమ్మాటికే కుట్రేనన్ని తేల్చి చెప్పారు. చంద్రబాబు నీచరాజకీయాలు చేస్తూ టీడీపీ నాయకులైతే ఒక న్యాయం, ప్రతి పక్ష నాయకులకు మరో న్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.
కొన్నాళ్లుగా సమసిపోయిన ఫ్యాక్షన్ రాజకీయలకు ముఖ్యమంత్రి తిరిగి ఆజ్యం పోస్తున్నారని విరుచుకుపడ్డారు. జిల్లాలో కూడా పచ్చనేతలు అధికారాన్ని అడ్డం బెట్టుకుని రెచ్చిపోతున్నారని, వైఎస్సార్ నేతలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. దీని బట్టే చంద్రబాబు పాలన ఏ రీతిలో కొనసాగుతుందోఇట్టే భోదపడుతోందన్నారు. ఇలా చేయడం రాజ్యాంగాన్ని విరుద్దమని, ఇప్పటికైనా నీచ రాజకీయాలు మాని చిత్తశుద్దితో పనిచేయాలని ఆయన సూచించారు.