cherukulapadu narayanareddy
-
కార్యకర్తలకు అండగా ఉంటా
- వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి కంగాటి శ్రీదేవి మద్దికెర: తన భర్తను రాజకీయంగా ఎదుర్కోలేక హతమర్చారని అయినా కార్యకర్తలు అధైర్య పడొద్దని తాను ఎల్లావేళలా అండగా ఉంటానని చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి, వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి కంగాటి శ్రీదేవి పేర్కొన్నారు. సోమవారం మొదటిసారిగా మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాలులో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయన మరణం ఒంటరిని చేసిందని భావించానని అయితే ఇంతమంది ఆదరణ చూస్తుంటే అక్కలు, తమ్ముళ్లు, అన్నలు తోడు ఉన్నారనే ధైర్యం వచ్చిందన్నారు. నారాయణరెడ్డి నిత్యం ప్రజల గురించే ఆలోచించేవారని, ఏ చిన్న కష్టమొచ్చినా వెళ్లి పరామర్శించేవారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లాæ పనిచేసి పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేద్దామన్నారు. అనంతరం పలువరు మాట్లాడుతూ కొందరు బీసీ నాయకులమని చెప్పుకుంటూ బీసీలు ఎదగకుండా అణదొక్కుతున్నారన్నారు. నాడు చెరుకులపాడు నారాయణరెడ్డి పోటీ చేయకపోయి వుంటే నేడు పదవులు అలంకరించివుండేవారా అని ప్రశ్నించారు. నేడు అనుభవిస్తున్న మంత్రి పదవి నారాయణరెడ్డి బిక్షేనన్నారు. కార్యక్రమంలో నారాయణరెడి్డ సోదరుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, కుమారుడు రామ్మోహన్‌రెడ్డి, మండల కన్వీనర్ మురుళీధర్రెడ్డి, సర్పంచు లోకిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రాజశేఖర్‌రావు, మాజీ ఎంపీపీ మల్లికార్జున, బసినేపల్లి నీటిసంఘం మాజీ అధ్యక్షుడు భద్రయ్య, ఎంపీటీసీ సభ్యుడు విష్ణు, చంద్రశేఖర్‌రెడ్డి, బాలచంద్ర, వెంకటరాముడు, గోపాల్ పాల్గొన్నారు. 20 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరిక: మండల పరిధిలోని ఎం.అగ్రహారం గ్రామంలో సర్పంచు గంపల వెంకటేశులు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 20 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. తుమ్మిటి కృష్ణమూర్తి, డీలర్ అంజి, హనుమంతు, గోపాల్, హనుమన్నతోపాటు మరో 70 మంది పార్టీలో చేరారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. ప్రజావ్యతిరేక పాలనను ఎండగడుతున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని భావించి పార్టీలో చేరుతున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రవిరెడ్డి, మహేష్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, తిరుమల, విజయుడు, మంజు పాల్గొన్నారు. -
‘నారాయణరెడ్డి’ హత్య కేసులో మరో నలుగురు అరెస్ట్
కృష్ణగిరి: పత్తికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్య కేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం కృష్ణగిరి పోలీస్‌స్టేషన్‌లో డోన్ డీఎస్పీ బాబా ఫకృద్ధీన్ నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. గత నెల 21న చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి గతనెల 24న 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. కేసును ఛేదించేందుకు జిల్లా ఎస్పీ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ముందుగా అరెస్ట్ చేసిన వారిని విచారించిన మేరకు కేసు దర్యాప్తును చేపట్టారు. ఇందులో భాగంగా చెరుకులపాడు గ్రామానికి చెందిన కురువ పెద్దయ్య, కోడుమూరుకు చెందిన నల్లబోతుల గిడ్డయ్య, కంబాలపాడు గ్రామానికి చెందిన చెరుకులపాడు గోపాల్, దేవనకొండ మండలం బేతపల్లె గ్రామానికి చెందిన బైతింపి చిన్నవెంకటయ్య అలియాస్ చిన్నవెంకట్ను రామకృష్ణాపురం సమీపంలోని శివాలయం వద్ద మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. వీరి వద్దనుంచి హత్యకు ఉపయోగించిన రెండు వేటకొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో డోన్ సీఐ శ్రీనివాసులు, కృష్ణగిరి ఎస్ఐ సోమ్లానాయక్, డోన్ రూరల్ ఎస్ఐ రామసుబ్బయ్య, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
హత్యా రాజకీయాలను ప్రజలు క్షమించరు
- వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ - నారాయణరెడ్డి సంతాపభలో పార్టీ ముఖ్య నేతలు అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్దుర్తి రూరల్, కృష్ణగిరి: రాష్ట్రంలో టీడీపీ హత్యా రాజకీయాలు పాల్పడుతోందని..దీన్ని ప్రజలు క్షమించబోరన్న విషయాన్ని గుర్తించుకోవాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెరుకులపాడులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య అధ్యక్షతన దివంగత నేత చెరుకులపాడు నారాయణరెడ్డి సంతాప సభ నిర్వహించారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డిలతో కలిసి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ముందుగా నారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బొత్స మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా పత్తికొండ నియోజకవర్గం నుంచి నారాయణరెడ్డి గెలిచే అవకాశం ఉండడంతో పోలీసుల అండతో టీడీపీ నేతలు ఆయనను హతమార్చారన్నారు. టీడీపీ నేతలు.. పలుచోట్ల పోలీసు ఉన్నతాధికారులను సైతం అవమానిస్తున్నా..అదే పోలీసులు అధికారపార్టీ నాయకులకు కొమ్ముకాస్తుండడం సిగ్గు చేటన్నారు. ప్రజలను మెప్పించి ఓట్లు వేయించుకోవాలే తప్ప ఇలా హత్యా రాజకీయాలకు పాల్పడడం తగదన్నారు. ఓడిపోయే రోజులు దగ్గర పడ్డాయి... టీడీపీ పెద్ద మనుషులు, పోలీసుల సహకారంతోనే నారాయణరెడ్డి హత్య జరిగిందన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ తెలిసిందని పార్టీ అధికార ప్రతనిధి అంబటి రాంబాబు అన్నారు. ప్రాణహాని ఉందని నారాయణరెడ్డి తెలిపినా.. రక్షణ కల్పించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. హత్యా రాజకీయాలను ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతం కాదన్న విషయం వారు గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఓడిపోయే రోజులు దగ్గరపడ్డాయన్నారు. గెలిచి తీరాలన్న కసి పెరిగింది... గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన పెద్దపెద్ద నాయకులకే డిపాజిట్లు రాలేదని, అయితే నారాయణ రెడ్డి..32 వేల ఓట్లు సాధించి రికార్డు సృష్టించారని వైఎస్ఆర్సీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఫ్యాక్షన్ నుంచి దూరంగా జరగాలన్న నారాయణరెడ్డి ఆలోచనే ఆయనను పొట్టన పెట్టకున్నదన్నట్లుగా కనబడుతున్నదన్నారు. నారాయణరెడ్డి హత్య నియోజకవర్గంలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో కచ్చితంగా గెలిచి తీరాలన్న కసిని పెంచిందన్నారు. అధికారపార్టీ నేతలు..విపక్షాన్ని వివిధ పద్ధతులలో అడ్డుకుంటున్నారని, అలా చేతకాని పక్షంలో హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అండగా ఉంటాం... సంతాపసభలో నారాయణరెడ్డి, సాంబశివుడులకు వైఎస్ఆర్సీపీ నేతలు.. మౌనం పాటించి సంతాపం తెలిపారు. అందరి సమక్షంలో తాము, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .. నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి, అన్న ప్రదీప్‌కుమార్‌రెడ్డి, కుటుంబసభ్యులకు అండగా ఉంటామని హామీనిచ్చారు. రాబోయే ఎన్నికల్లో వారి కుటుంబంలో ఎవరు పోటీ చేసినా.. తమ అధినేత చెప్పినట్లు 50 వేలకు మించి ఓట్లతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సంతాప సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి, ఎంపీ బుట్టా రేణుక, అనంతపురం మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, మురళీకృష్ణ, కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హఫీజ్ ఖాన్లు పాల్గొన్నారు. -
నేడు నారాయణరెడ్డి సంస్మరణ సభ
– హాజరుకానున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు బొత్స, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్స్, దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సంస్మరణ సభను బుధవారం చెరుకులపాడులోని ఆయన నివాసంలో నిర్వహించనున్నట్లు ఆయన సోదరుడు ప్రదీప్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి. మాజీ మంత్రి పార్థసారథి, పలువురు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారని వివరించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై నివాళ్లర్పించాలని ఆయన కోరారు. -
రేపు చెరుకులపాడు నారాయణరెడ్డి సంతాపసభ
వెల్దుర్తి రూరల్ : వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్, దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సంతాపసభ బుధవారం నిర్వహించనున్నారు. చెరుకులపాడు గ్రామంలో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా జీ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్‌కుమార్‌రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. సంతాపసభ రోజునే నారాయణరెడ్డి వైకుంఠ సమారాధన నిర్వహిసా్తమని చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నారాయణరెడ్డికి నివాళులర్పించాలని కోరారు. -
‘చెరుకులపాడు’కు ప్రవాసాంధ్రుల నివాళి
వెల్దుర్తి రూరల్ : గత ఆదివారం హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డికి అమెరికాలోని డల్లాస్‌లో ఉంటున్న ప్రవాసాంధ్రులు శనివారం నివాళులర్పించారు. నివాళుర్పించిన వారిలో వైఎస్ఆర్ పార్టీ ప్రవాసాంధ్ర నాయకులు శ్రీనివాసరెడ్డి, అమిత్‌రెడ్డి, మధురెడ్డి, సురేంద్రరెడ్డి, శివశంకర్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నారాయణరెడ్డి మృతి పార్టీకి తీరని లోటన్నారు. వైఎస్ఆర్సీపీపై ప్రజలకు పెరుగుతున్న అభిమానాన్ని ఓర్వలేక టీడీపీ కుట్ర పూరిత రాజకీయాలు చేస్తోందన్నారు. నారాయణరెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు రాజకీయంగా అంతమొందించారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రవాసాంధ్రుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. -
మలుపులో మాటు!
నారాయణరెడ్డి హత్యకు రెండు ప్రాంతాల్లో స్పాట్ - రామకృష్ణాపురం వద్ద కొండల్లో మరో టీం కాపు - మొదటి స్పాట్ పూర్తి కాగానే ఫోన్లో సమాచారం - జంట హత్యల్లో వెలుగులోకి మరో కోణం - ఆ వ్యక్తులు ఎవరనే విషయం వెలుగులోకి రాని వైనం - పోలీసుల దర్యాప్తు ఆ దిశగా సాగాలనే డిమాండ్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని హత్య చేసేందుకు పక్కా ప్లాన్ సాగిందా? ఒకవేళ కల్వర్టు వద్ద దాడి చేసే అవకాశం దక్కకపోతే మరో ప్రాంతంలో అటాక్ చేసేందుకు పథకం రచించారా? రామకృష్ణాపురం సమీపంలో కొండ చరియల మలుపుల వద్ద మరో 25 మంది టీంతో అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా? అక్కడ కూడా మరో రెండు ట్రాక్టర్లు, వేట కొడవళ్లు, బాంబులతో దాడి చేసే ప్లాన్ ఉందా? కల్వర్టు ప్రాంతంలోనే దాడి జరిగి నారాయణ రెడ్డి హతం కావడంతో రెండో ప్రాంతంలో ఉన్న టీం కాస్తా తప్పించుకుందా? అనే వరుస ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఒకవేళ నారాయణ రెడ్డిపై కల్వర్టు ప్రాంతంలో దాడి చేసేందుకు వీలుపడకపోతే.. కొండ చరియల మలుపుల వద్ద దాడి జరిగే అవకాశం ఉందని అక్కడ సంచరించిన వారితో పాటు గ్రామస్తులు తెలుపుతున్న వివరాల ప్రకారం తెలుస్తోంది. కల్వర్టు ప్రాంతంలోనే నారాయణ రెడ్డి చనిపోవడంతో అక్కడ కాపు కాసిన టీంకు ఫోన్ల ద్వారా ఇక్కడి వారు సమాచారం చేరవేయడంతో వారు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ కోణంలో పోలీసులు విచారిస్తే మరింత మంది నిందితుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్కడ కాపు కాసిందెవరు? వాస్తవానికి ఇప్పటి వరకు నారాయణ రెడ్డి హత్య కేసులో హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న నిందితుల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. ఒకవేళ కల్వర్టు వద్ద నారాయణ రెడ్డిని హతమార్చడం మిస్ అయితే.. రామకృష్ణాపురం గ్రామానికి సమీపంలో కొండ మలుపుల వద్ద మరోసారి అటాక్ చేసేందుకు నిందితులు పక్కా ప్లాన్ రచించుకున్నారు. ఇక్కడ కూడా మరో 25 మంది కాపు కాసినట్టు తెలుస్తోంది. మరి ఇక్కడ కాపు కాసి.. అటాక్ చేసేందుకు ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగాల్సిన అవసరం ఉంది. వారి పేర్లు ఇప్పటివరకు బయటకు రాలేదు. అంతేకాకుండా ప్రస్తుతం దొరికిన 12 మంది నిందితులు కూడా కొండ చరియల వద్ద మరో టీం ఉందనే విషయం బయటకు వెల్లడించలేదు. ఈ పరిస్థితుల్లో కొండ చరియల వద్ద కాపు కాసిన టీంలోని వారిని కూడా అదుపులోకి తీసుకుంటే తప్ప ఈ హత్య కేసులో ఉన్న లోతెంతో అర్థమయ్యే పరిస్థితి లేదనే అభిప్రాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెలిబుచ్చుతున్నారు. కల్వర్టు పనులను ఆపిందెవరు? కల్వర్టు ప్రాంతంలో హత్య చేసేందుకు వీలుగా 15 రోజుల నుంచి రెక్కీ జరిగిందని తెలుస్తోంది. పక్కాగా 20 నుంచి 25 మంది వ్యక్తులు నేరుగా అక్కడ సంచరించి మాత్రమే హత్యకు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ జరగాల్సిన పనులను చేయవద్దంటూ అధికార పార్టీ నేతల నుంచే ఒత్తిళ్లు వచ్చినట్టు సమాచారం. ఒకవేళ రోడ్డు పనులు జరిగితే పనులు చేసే వారు సంచరిస్తూ తమ ప్లాన్‌కు అడ్డు వస్తారని భావించే పనులు నిలిపివేశారని తెలుస్తోంది. దీంతో అసలు పనులు చేయవద్దని వారించి నిలువరించిందెవరనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగించాల్సి ఉంది. అయితే, ఇప్పటికే నిందితులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నందున ఈ వివరాలన్నింటినీ పోలీసులు సేకరించే అవకాశం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని పోలీసు కస్టడీకి అడిగితే తప్ప కేసులో మరింత లోతైన విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నిందితుల ఇళ్ల పరిశీలన
కృష్ణగిరి: పత్తికొండ నిమోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి, అతని అనుచరుడు సాంబశివుడు హత్య కేసులో కొందరి నిందితుల ఇళ్లను పోలీసులు పరిశీలించారు. జంట హత్యకేసులో 12 మందిపై కేసు నమోదు కాగా, ఆరుగరు తొగర్చేడు గ్రామస్తులు ఈ మేరకు తొగర్చేడు గ్రామాన్ని శుక్రవారం డోన్ సీఐ శ్రీనివాసులు, కృష్ణగిరి ఎస్ఐ సోమ్లానాయక్‌లు సందర్శించారు. ఈ హత్య కేసులో నిందితుల ఇళ్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలోకి ఎవరైన కొత్త వ్యక్తులు వస్తే తమకు సమాచారమందించాలని ప్రజలకు సూచించారు. -
‘వైఎస్ఆర్ సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు’
-
‘వైఎస్ఆర్ సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు’
చిత్తూరు: టీడీపీ ప్రభుత్వం హత్య రాజకీయాలను పోత్సాహిస్తూ..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఎంపీ మిథున్‌రెడ్డి విమర్శించారు. చిత్తూరు మండలం పిళ్లారిమిట్ట వెంకటాపురం గ్రామంలో జరిగిన గంగజాతరలో ఆయన బుధవారం పాల్గొన్నారు. అమ్మవారి దర్శించుకున్న అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. టీడీపీ రెండేళ్ల పాలనలో హత్య రాజకీయాలు పెచ్చరిల్లాయని అందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నారాయణరెడ్డిని హత్య చేయడం అతి దారుణమన్నారు. నారాయణరెడ్డి హత్య పట్ల టీడీపీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందని, తన ప్రాణ రక్షణకు లైసెన్స్డ్ ఆయుధం కొనసాగించాలని ముందస్తుగా ఆయన అనుమతి కోరినా ఇవ్వకపోవడం ముమ్మాటికే కుట్రేనన్ని తేల్చి చెప్పారు. చంద్రబాబు నీచరాజకీయాలు చేస్తూ టీడీపీ నాయకులైతే ఒక న్యాయం, ప్రతి పక్ష నాయకులకు మరో న్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. కొన్నాళ్లుగా సమసిపోయిన ఫ్యాక్షన్ రాజకీయలకు ముఖ్యమంత్రి తిరిగి ఆజ్యం పోస్తున్నారని విరుచుకుపడ్డారు. జిల్లాలో కూడా పచ్చనేతలు అధికారాన్ని అడ్డం బెట్టుకుని రెచ్చిపోతున్నారని, వైఎస్సార్ నేతలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. దీని బట్టే చంద్రబాబు పాలన ఏ రీతిలో కొనసాగుతుందోఇట్టే భోదపడుతోందన్నారు. ఇలా చేయడం రాజ్యాంగాన్ని విరుద్దమని, ఇప్పటికైనా నీచ రాజకీయాలు మాని చిత్తశుద్దితో పనిచేయాలని ఆయన సూచించారు. -
హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్ సీజ్
– అదుపులో ఇద్దరు వ్యక్తులు కృష్ణగిరి: వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడులను హతమార్చేందుకు వినియోగించిన ఏ1 నిందితుడు చెరుకులపాడుకు చెందిన కురువ రామాంజనేయులు ట్రాక్టర్‌ను సోమవారం తెల్లవారుజామున రామకృష్ణాపురం సమీపంలో పట్టుకున్నట్లు ఎస్ఐ సోమ్లానాయక్ తెలిపారు. ముందస్తు సమాచారంతో దాడి చేసి పట్టుకున్నామని, అయితే ఈ ట్రాక్టర్‌పై ఎరుకలచెర్వుకు చెందిన చంద్ర, చెరుకులపాడుకు చెందిన పెద్దయ్య వస్తున్నారని.. అనుమానంతో వీరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఈ ట్రాక్టర్‌కు ఎలాంటి నెంబర్ లేకపోగా.. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేయించనట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ ముందు భాగం వాహనాన్ని ఢీకొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హత్యలకు ఉపయోగించిన మరో ట్రాక్టర్‌ను పట్టుకోవాల్సి ఉంది. -
ఆగని రోదన.. తీరని వేదన
-
అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు
చెరుకులపాడులో నారాయణ రెడ్డికి అంత్యక్రియలు - గ్రామంలోనే సాంబశివుడికీ అంతిమ సంస్కారాలు - హాజరైన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి - బాధిత కుటుంబాలకు భరోసానిచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత - చివరిచూపునకు భారీగా తరలివచ్చిన జనం - కన్నీటి పర్యంతమైన అభిమానులు - నారాయణరెడ్డి అమర్హై అంటూ నినాదాలు - శోకసంద్రంగా మారిన అంతిమయాత్ర - జిల్లా బంద్ విజయవంతం చెరుకులపాడు కన్నీటి సంద్రమైంది. ఎవరిని కదిలించినా ఉబికి వస్తున్న కన్నీరే. నిన్నటి వరకు తమ మధ్య తిరిగిన నేత ఇక లేరని తెలిసి అభిమానులు కుమిలి కుమిలి ఏడ్చారు. అన్నగా.. ఇంటికి పెద్దకొడుకుగా.. అందరి యోగక్షేమాలు తెలుసుకునే నారాయణ రెడ్డి జ్ఞాపకాలను తలచుకుంటూ కంటతడిపెట్టారు. ఇక మాకు దిక్కెవరంటూ అక్కచెల్లెళ్లు కన్నీరు మున్నీరయ్యారు. అభిమాన నేతకు అంతిమ వీడ్కోలు పలికేందుకు సోమవారం ఉదయం నుంచే చెరుకులపాడు గ్రామానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు. వృద్ధులు, పిల్లలు, మహిళలు.. ఎండను సైతం లెక్కచేయకుండా చివరి చూపునకు నిరీక్షించారు. అంతిమయాత్రలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనడంతో ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. నారాయణ రెడ్డి అమర్ హై, జగనన్నా.. నీవే మాకు దిక్కంటూ అభిమానులు నినదించారు. నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను ప్రతిపక్షనేత పరామర్శించారు. సాంబశివుడు ఇంటికి వెళ్లి ఆయన భార్యాబిడ్డలకు ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. కర్నూలు(వైఎస్‌ఆర్‌సర్కిల్)/కృష్ణగిరి/వెల్దుర్తి రూరల్ ప్రియతమ నేత చెరుకులపాడు నారాయణరెడ్డిని కడసారి చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా చెరుకులపాడు గ్రామానికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే పార్థివ దేహం కోసం ఎదురు చూస్తూ కనిపించారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తవడంతో చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు మృతదేహాలను ప్రత్యేక అంబులెన్స్‌లో ఉదయం 11.30 గంటలకు చెరుకులపాడు గ్రామానికి తీసుకొచ్చారు. మృతదేహాలను చూసి అభిమానులు, కార్యకర్తలు బోరున విలపించారు. పార్థివ దేహాలను స్థానిక పంచాయతీ కార్యాలయ అవరణంలో ఉంచారు. దీంతో ఆ ప్రాంతం రోదనలతో మార్మోగింది. నారాయణరెడ్డి మృతదేహాన్ని చూసి భార్య కంగాటి శ్రీదేవి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజలు కన్నీటి నివాళి అర్పించిన అనంతరం అంతిమ యాత్ర 2.40 గంటలకు ప్రారంభమైంది. నారాయణరెడ్డి అమరహై అంటూ నినాదాలు చేస్తూ అశ్రునయనాల మధ్య అంతిమ యాత్ర కొనసాగింది. ప్రతిపక్షనేత నివాళి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మధ్యాహ్నం 2.55 గంటలకు చెరుకులపాడు గ్రామానికి చేరుకున్నారు. దీంతో అంత్యక్రియల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. జననేతను చూసి జనం మరింత ఉద్వేగానికి లోనయ్యారు. జగనన్నా...నీవే మాకు దిక్కు..మా నాయకుడిని పొట్టన పెట్టుకున్న వారిని వదిలిపెట్టొదంటూ నినదించారు. స్థానిక ప్రాథమిక పాఠశాల పక్కన ఏర్పాటు చేసిన ఘాట్‌లో ఉంచిన మృతదేహానికి ప్రతిపక్షనేత పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియల్లో పాల్గొని సాంబశివుడు ఇంటికి బయలు దేరారు. హతుని భార్యాపిల్లలకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం చెరుకులపాడు నారాయణరెడ్డి ఇంటి వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చెరుకులపాడు శోకసంద్రం.. నారాయణరెడ్డి మృతితో చెరుకులపాడు గ్రామం శోక సంద్రంగా మారింది. అభిమాన నేతన చూసేందుకు కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. గ్రామానికి ఇరువైపులా ఉన్న రహదారులు వాహనాలతో నిండిపోయాయి. గ్రామంలో ఎక్కడ చూసినా జనం కిక్కిరిసి కనిపించారు. అభిమాన నేతను కడసారి చూసేందుకు కొందరు మిద్దెలెక్కారు. చెరుకులపాడు నారాయణరెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. మధుర స్మృతులను తలుచుకుంటూ వేదనా భరితమయ్యారు. అభిమాన నేత పార్థివ దేహాన్ని చూసిన మహిళలు, వృద్ధులు..ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలకు అండగా నిల్చిన నాయకున్ని టీడీపీ నేతలే పొట్టన పెట్టుపెట్టుకున్నారని బోరున విలపించారు. తల్లిదండ్రుల సమాధి వద్దనే అంత్యక్రియలు తల్లిదండ్రులు శివారెడ్డి, నారాయణమ్మలను ఖననం చేసిన చోటనే నారాయణరెడ్డి పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఘాట్ వద్దకు వేలాది మంది చేరుకున్యానరు. దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవిని ఘాట్ వద్దకు రాగానే జనం చలించిపోయారు. ఆమె విలపిస్తున్న దృశ్యాలను చూసిన జనం గద్గద స్వరంతో నారాయణరెడ్డి అమర్‌రహే అంటూ నినదించారు. కుమారుడు మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అంత్యక్రియలను ముగించారు. అంత్యక్రియలు ముగిసినా సమాధిని చూస్తూ అదే ప్రాంతంలో కొందరు కూర్చొండిపోవడంతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకరంగా మారింది. -
బంద్ విజయవంతం
– కర్నూలులో వైఎస్సార్సీపీ నేతల బైక్ ర్యాలీ, నిరసన – వివిధ ప్రాంతాల్లో స్వచ్చంధంగా బంద్ పాటించిన వ్యాపారులు – ఆత్మకూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తల అరెస్ట్, విడుదల – పత్తికొండలో పెద్ద ఎత్తున బంద్‌కు సహకరించిన ప్రజలు కర్నూలు అర్బన్/సిటీ: పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణహత్యను నిరసిస్తు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో సోమవారం బంద్ విజయవంతమైంది. అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలు చేతపట్టుకొని రోడ్లపైకి వచ్చి వ్యాపార, వాణిజ్య సంస్థలను మూయించారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలే స్వచ్ఛందంగా బంద్‌కు సంఘీభావం తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే రోడ్లన్ని నిర్మానుషంగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ రాజకీయ ఆధిపత్యం కోసం చెరుకులపాడు నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడును ముందస్తు ప్రణాళిక మేరకు అతి కిరాతకంగా హత్యలు చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. జిల్లా బంద్‌కు ప్రజలు సహకరించారు. - కర్నూలులో వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ హఫీజ్‌ఖాన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దయ్య, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు రహమాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజుయాదవ్, మహిళా జిల్లా అధ్యక్షురాలు విజయకుమారి, నాయకురాలు ఉమాబాయి ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలోని వైఎస్సార్ కూడలికి చేరుకొని బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే నగరమంతా తిరిగి వాణిజ్య, వ్యాపార సముదాయాలను మూసి వేయించారు. ఈ ర్యాలీ ఆర్ఎస్ రోడ్డు, రాజ్‌విహార్, కలెక్టరేట్, విశ్వేశ్వరయ్య సర్కిల్, సీ క్యాంప్, బిర్లాగేట్, కొత్త బస్టాండ్, చౌరస్తా తదితర ప్రాంతాల్లో సాగింది. - పార్టీ నగర అధ్యక్షులు పీజీ నరసింహులుయాదవ్ ఆధ్వర్యంలో కూడా బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కొండారెడ్డిబురుజు నుంచి కొత్తబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి వ్యాపార సంస్థలను మూసి వేయించారు. - శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్ బుడ్డా శేషారెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరులో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పట్టణంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గోకారి, కరీముల్లాను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కోడుమూరులో చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకు నిరసనగా గంట సేపు బంద్ నిర్వహించారు. - పత్తికొండలో పార్టీ నాయకులు పోచంరెడ్డి మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, అడ్వకేటు నరసింహయ్య ఆచారి తదితరులు పాల్గొని ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు బంద్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే వ్యాపార సంస్థలు, హోటళ్లు మూతబడ్డాయి. - చెరుకులపాడు హత్యకు నిరసనగా ఆళ్లగడ్డలో వైఎస్సార్సీపీ నాయకుడు బిజేంద్రరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాలుగు రోడ్ల కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీ బస్టాండ్ వరకు సాగింది. వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసి వేయించారు. - నంద్యాలలో నియోజకవర్గ ఇన్చార్జ్ రాజగోపాల్‌రెడ్డి చెరుకులపాడు నారాయణరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. - ఎమ్మిగనూరులో పార్టీ కన్వీనర్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, నాగేశ్వరరావు, కొమ్మురాజు, భాస్కర్,చాంద్, నజీర్ అహ్మద్ తదితరులు పట్టణంలో బంద్‌ను నిర్వహించారు. ఈ బంద్ ఉదయం నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు సాగింది. - నందికొట్కూరులో కౌన్సిలర్ మరియమ్మ, పగిడ్యాల మండల కన్వీనర్ రమాదేవి ఆధ్వర్యంలో 11 నుంచి 12 గంటల వరకు బంద్‌పాటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టిరెడ్డి, సుధాకర్, యేసన్న తదితరులు పాల్గొన్నారు. - మంత్రాలయం నియోజకవర్గం మండల కేంద్రమైన కోసిగిలో జడ్పీటీసీ మంగమ్మ, పార్టీ ఇంచార్జి మురళిరెడ్డి, ఎంపీపీ భీమక్క ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. డోన్‌లో నిరసన ర్యాలీ: డోన్ పట్టణంలో జెడ్పీటీసీ శ్రీరాములు ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు హరికిషన్, పార్టీ నాయకులు దినేష్‌గౌడ్, హరి, రాజవర్థన్,రాజశేఖర్ రెడ్డి, రఫి,యంకోబరావు,లక్ష్మికాంతారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్వగృహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పాటబస్టాండ్లో చెరుకులపాడు నారాయణరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జేఎన్‌టీయుఏ పరీక్షలు వాయిదా: చెరుకులపాడు దారుణహత్య నేపథ్యంలో వైఎస్సార్సీపీ జిల్లా బంద్‌కు ఇచ్చిన పిలుపుమేరకు అనంతపురం జేఎన్టీయూ పరిధిలోని బీటెక్, ఫార్మసీ, ఎంబీఏ సెమిష్టర్ పరీక్షలు రాయలసీమ నాలుగు జిల్లాల్లో వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి. -
నేడు జిల్లా బంద్
– పిలుపునిచ్చిన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ – అధికార పార్టీ హత్యారాజకీయాలకు నిరసనగా బంద్ – అంత్యక్రియల్లో పాల్గొననున్న వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జీ చెరకులపాడు నారాయణ రెడ్డి హత్య నేపథ్యంలో సోమవారం కర్నూలు జిల్లా బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రోజురోజుకీ అధికార పార్టీ హత్యారాజకీయాలు పెరిగిపోతున్నాయని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక కేవలం హత్యారాజకీయాలతో అధికారం చెలాయిద్దామంటే కుదరదని తేల్చిచెప్పారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోలేక... ప్రతిపక్ష పార్టీ నేతలను అంతమొందించడం ద్వారా రాజకీయ లబ్ది చేకూర్చుకుందామనే ధోరణిలో అధికార పార్టీ ఉందని మండిపడ్డారు. ఇందుకు అధికారులు వంత పాడటం సమంజసం కాదని హితవు పలికారు. కర్నూలు జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు, మేధావులకు పిలుపునిచ్చారు. మరోవైపు నారాయణ రెడ్డి అంత్యక్రియల్లో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. అంత్యక్రియలకు జగన్ రాక చెరకులపాడు నారాయణ రెడ్డి అంత్యక్రియల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. అధికార పార్టీ హత్యారాజకీయాలపై గవర్నర్‌కు హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన కర్నూలుకు బయలుదేరి చెరకులపాడులో జరిగే నారాయణ రెడ్డి అంతక్రియల్లో పాల్గొంటారని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెరకులపాడు నారాయణ రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారని తెలిపారు. సోమవారం ఉదయం నారాయణ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం జరిగే అవకాశం ఉంది. అనంతరం ఆయన మృతదేహాన్ని సొంత గ్రామం చెరకులపాడుకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
బాబు పాలనలో డొల్లతనం రుజువైంది
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నేతల హత్యల వంటి దుర్మార్గాలతో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎంతో కాలం పరిపాలన సాగించలేదని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్ష నేతలను వేధించేది చాలక ఇంకా ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను హతమార్చడం దారుణమని, ఇలాంటి దురాగతాలను ప్రజలు చూస్తూ సహిస్తారనుకోవడం పొరబాటేనని ఆయన అన్నారు. నారాయణరెడ్డి హత్య కేసు విచారణ, నిందితులను పట్టుకోవడంలో పోలీసు అధికారులు తమ నిష్పాక్షికతను నిరూపించుకోవాలని, టీడీపీ ప్రభుత్వం కూడా నిష్పాక్షికంగా దోషులకు శిక్ష పడేలా వ్యవహరించాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలనలో డొల్లతనం ఈ హత్యతో రుజువైందని ఆయన అన్నారు.