నేడు జిల్లా బంద్
– పిలుపునిచ్చిన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ
– అధికార పార్టీ హత్యారాజకీయాలకు నిరసనగా బంద్
– అంత్యక్రియల్లో పాల్గొననున్న వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జీ చెరకులపాడు నారాయణ రెడ్డి హత్య నేపథ్యంలో సోమవారం కర్నూలు జిల్లా బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రోజురోజుకీ అధికార పార్టీ హత్యారాజకీయాలు పెరిగిపోతున్నాయని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక కేవలం హత్యారాజకీయాలతో అధికారం చెలాయిద్దామంటే కుదరదని తేల్చిచెప్పారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోలేక... ప్రతిపక్ష పార్టీ నేతలను అంతమొందించడం ద్వారా రాజకీయ లబ్ది చేకూర్చుకుందామనే ధోరణిలో అధికార పార్టీ ఉందని మండిపడ్డారు. ఇందుకు అధికారులు వంత పాడటం సమంజసం కాదని హితవు పలికారు. కర్నూలు జిల్లా బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు, మేధావులకు పిలుపునిచ్చారు. మరోవైపు నారాయణ రెడ్డి అంత్యక్రియల్లో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొననున్నారు.
అంత్యక్రియలకు జగన్ రాక
చెరకులపాడు నారాయణ రెడ్డి అంత్యక్రియల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. అధికార పార్టీ హత్యారాజకీయాలపై గవర్నర్‌కు హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన కర్నూలుకు బయలుదేరి చెరకులపాడులో జరిగే నారాయణ రెడ్డి అంతక్రియల్లో పాల్గొంటారని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెరకులపాడు నారాయణ రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారని తెలిపారు. సోమవారం ఉదయం నారాయణ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం జరిగే అవకాశం ఉంది. అనంతరం ఆయన మృతదేహాన్ని సొంత గ్రామం చెరకులపాడుకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.