‘నారాయణరెడ్డి’ హత్య కేసులో మరో నలుగురు అరెస్ట్
కృష్ణగిరి: పత్తికొండ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్య కేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం కృష్ణగిరి పోలీస్‌స్టేషన్‌లో డోన్ డీఎస్పీ బాబా ఫకృద్ధీన్ నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. గత నెల 21న చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి గతనెల 24న 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. కేసును ఛేదించేందుకు జిల్లా ఎస్పీ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ముందుగా అరెస్ట్ చేసిన వారిని విచారించిన మేరకు కేసు దర్యాప్తును చేపట్టారు. ఇందులో భాగంగా చెరుకులపాడు గ్రామానికి చెందిన కురువ పెద్దయ్య, కోడుమూరుకు చెందిన నల్లబోతుల గిడ్డయ్య, కంబాలపాడు గ్రామానికి చెందిన చెరుకులపాడు గోపాల్, దేవనకొండ మండలం బేతపల్లె గ్రామానికి చెందిన బైతింపి చిన్నవెంకటయ్య అలియాస్ చిన్నవెంకట్‌ను రామకృష్ణాపురం సమీపంలోని శివాలయం వద్ద మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. వీరి వద్దనుంచి హత్యకు ఉపయోగించిన రెండు వేటకొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో డోన్ సీఐ శ్రీనివాసులు, కృష్ణగిరి ఎస్‌ఐ సోమ్లానాయక్, డోన్ రూరల్ ఎస్‌ఐ రామసుబ్బయ్య, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.