బంద్ విజయవంతం
బంద్ విజయవంతం
Published Mon, May 22 2017 10:27 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
– కర్నూలులో వైఎస్సార్‌సీపీ నేతల బైక్ ర్యాలీ, నిరసన
– వివిధ ప్రాంతాల్లో స్వచ్చంధంగా బంద్ పాటించిన వ్యాపారులు
– ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల అరెస్ట్, విడుదల
– పత్తికొండలో పెద్ద ఎత్తున బంద్‌కు సహకరించిన ప్రజలు
కర్నూలు అర్బన్/సిటీ: పత్తికొండ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణహత్యను నిరసిస్తు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో సోమవారం బంద్ విజయవంతమైంది. అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలు చేతపట్టుకొని రోడ్లపైకి వచ్చి వ్యాపార, వాణిజ్య సంస్థలను మూయించారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలే స్వచ్ఛందంగా బంద్‌కు సంఘీభావం తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే రోడ్లన్ని నిర్మానుషంగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ రాజకీయ ఆధిపత్యం కోసం చెరుకులపాడు నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడును ముందస్తు ప్రణాళిక మేరకు అతి కిరాతకంగా హత్యలు చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. జిల్లా బంద్‌కు ప్రజలు సహకరించారు.
- కర్నూలులో వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ హఫీజ్‌ఖాన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఎస్‌సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దయ్య, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు రహమాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజుయాదవ్, మహిళా జిల్లా అధ్యక్షురాలు విజయకుమారి, నాయకురాలు ఉమాబాయి ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలోని వైఎస్సార్ కూడలికి చేరుకొని బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే నగరమంతా తిరిగి వాణిజ్య, వ్యాపార సముదాయాలను మూసి వేయించారు. ఈ ర్యాలీ ఆర్‌ఎస్ రోడ్డు, రాజ్‌విహార్, కలెక్టరేట్, విశ్వేశ్వరయ్య సర్కిల్, సీ క్యాంప్, బిర్లాగేట్, కొత్త బస్టాండ్, చౌరస్తా తదితర ప్రాంతాల్లో సాగింది.
- పార్టీ నగర అధ్యక్షులు పీజీ నరసింహులుయాదవ్ ఆధ్వర్యంలో కూడా బైక్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కొండారెడ్డిబురుజు నుంచి కొత్తబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి వ్యాపార సంస్థలను మూసి వేయించారు.
- శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుడ్డా శేషారెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పట్టణంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు గోకారి, కరీముల్లాను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కోడుమూరులో చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకు నిరసనగా గంట సేపు బంద్ నిర్వహించారు.
- పత్తికొండలో పార్టీ నాయకులు పోచంరెడ్డి మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, అడ్వకేటు నరసింహయ్య ఆచారి తదితరులు పాల్గొని ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు బంద్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే వ్యాపార సంస్థలు, హోటళ్లు మూతబడ్డాయి.
- చెరుకులపాడు హత్యకు నిరసనగా ఆళ్లగడ్డలో వైఎస్సార్‌సీపీ నాయకుడు బిజేంద్రరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాలుగు రోడ్ల కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీ బస్టాండ్ వరకు సాగింది. వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసి వేయించారు.
- నంద్యాలలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజగోపాల్‌రెడ్డి చెరుకులపాడు నారాయణరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
- ఎమ్మిగనూరులో పార్టీ కన్వీనర్ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, నాగేశ్వరరావు, కొమ్మురాజు, భాస్కర్,చాంద్, నజీర్ అహ్మద్ తదితరులు పట్టణంలో బంద్‌ను నిర్వహించారు. ఈ బంద్ ఉదయం నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు సాగింది.
- నందికొట్కూరులో కౌన్సిలర్ మరియమ్మ, పగిడ్యాల మండల కన్వీనర్ రమాదేవి ఆధ్వర్యంలో 11 నుంచి 12 గంటల వరకు బంద్‌పాటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టిరెడ్డి, సుధాకర్, యేసన్న తదితరులు పాల్గొన్నారు.
- మంత్రాలయం నియోజకవర్గం మండల కేంద్రమైన కోసిగిలో జడ్పీటీసీ మంగమ్మ, పార్టీ ఇంచార్జి మురళిరెడ్డి, ఎంపీపీ భీమక్క ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.
డోన్‌లో నిరసన ర్యాలీ:
డోన్ పట్టణంలో జెడ్పీటీసీ శ్రీరాములు ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు హరికిషన్, పార్టీ నాయకులు దినేష్‌గౌడ్, హరి, రాజవర్థన్,రాజశేఖర్ రెడ్డి, రఫి,యంకోబరావు,లక్ష్మికాంతారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్వగృహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పాటబస్టాండ్‌లో చెరుకులపాడు నారాయణరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
జేఎన్‌టీయుఏ పరీక్షలు వాయిదా:
చెరుకులపాడు దారుణహత్య నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ జిల్లా బంద్‌కు ఇచ్చిన పిలుపుమేరకు అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలోని బీటెక్, ఫార్మసీ, ఎంబీఏ సెమిష్టర్ పరీక్షలు రాయలసీమ నాలుగు జిల్లాల్లో వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి.
Advertisement