అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు
అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు
Published Mon, May 22 2017 10:44 PM | Last Updated on Wed, Apr 4 2018 9:31 PM
చెరుకులపాడులో నారాయణ రెడ్డికి అంత్యక్రియలు
- గ్రామంలోనే సాంబశివుడికీ అంతిమ సంస్కారాలు
- హాజరైన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
- బాధిత కుటుంబాలకు భరోసానిచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ అధినేత
- చివరిచూపునకు భారీగా తరలివచ్చిన జనం
- కన్నీటి పర్యంతమైన అభిమానులు
- నారాయణరెడ్డి అమర్‌హై అంటూ నినాదాలు
- శోకసంద్రంగా మారిన అంతిమయాత్ర
- జిల్లా బంద్ విజయవంతం
చెరుకులపాడు కన్నీటి సంద్రమైంది. ఎవరిని కదిలించినా ఉబికి వస్తున్న కన్నీరే. నిన్నటి వరకు తమ మధ్య తిరిగిన నేత ఇక లేరని తెలిసి అభిమానులు కుమిలి కుమిలి ఏడ్చారు. అన్నగా.. ఇంటికి పెద్దకొడుకుగా.. అందరి యోగక్షేమాలు తెలుసుకునే నారాయణ రెడ్డి జ్ఞాపకాలను తలచుకుంటూ కంటతడిపెట్టారు. ఇక మాకు దిక్కెవరంటూ అక్కచెల్లెళ్లు కన్నీరు మున్నీరయ్యారు. అభిమాన నేతకు అంతిమ వీడ్కోలు పలికేందుకు సోమవారం ఉదయం నుంచే చెరుకులపాడు గ్రామానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు. వృద్ధులు, పిల్లలు, మహిళలు.. ఎండను సైతం లెక్కచేయకుండా చివరి చూపునకు నిరీక్షించారు. అంతిమయాత్రలో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొనడంతో ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. నారాయణ రెడ్డి అమర్ హై, జగనన్నా.. నీవే మాకు దిక్కంటూ అభిమానులు నినదించారు. నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను ప్రతిపక్షనేత పరామర్శించారు. సాంబశివుడు ఇంటికి వెళ్లి ఆయన భార్యాబిడ్డలకు ధైర్యం చెప్పారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.
కర్నూలు(వైఎస్‌ఆర్‌సర్కిల్)/కృష్ణగిరి/వెల్దుర్తి రూరల్ ప్రియతమ నేత చెరుకులపాడు నారాయణరెడ్డిని కడసారి చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా చెరుకులపాడు గ్రామానికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే పార్థివ దేహం కోసం ఎదురు చూస్తూ కనిపించారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తవడంతో చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు మృతదేహాలను ప్రత్యేక అంబులెన్స్‌లో ఉదయం 11.30 గంటలకు చెరుకులపాడు గ్రామానికి తీసుకొచ్చారు. మృతదేహాలను చూసి అభిమానులు, కార్యకర్తలు బోరున విలపించారు. పార్థివ దేహాలను స్థానిక పంచాయతీ కార్యాలయ అవరణంలో ఉంచారు. దీంతో ఆ ప్రాంతం రోదనలతో మార్మోగింది. నారాయణరెడ్డి మృతదేహాన్ని చూసి భార్య కంగాటి శ్రీదేవి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజలు కన్నీటి నివాళి అర్పించిన అనంతరం అంతిమ యాత్ర 2.40 గంటలకు ప్రారంభమైంది. నారాయణరెడ్డి అమరహై అంటూ నినాదాలు చేస్తూ అశ్రునయనాల మధ్య అంతిమ యాత్ర కొనసాగింది.
ప్రతిపక్షనేత నివాళి..
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధ్యాహ్నం 2.55 గంటలకు చెరుకులపాడు గ్రామానికి చేరుకున్నారు. దీంతో అంత్యక్రియల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. జననేతను చూసి జనం మరింత ఉద్వేగానికి లోనయ్యారు. జగనన్నా...నీవే మాకు దిక్కు..మా నాయకుడిని పొట్టన పెట్టుకున్న వారిని వదిలిపెట్టొదంటూ నినదించారు. స్థానిక ప్రాథమిక పాఠశాల పక్కన ఏర్పాటు చేసిన ఘాట్‌లో ఉంచిన మృతదేహానికి ప్రతిపక్షనేత పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియల్లో పాల్గొని సాంబశివుడు ఇంటికి బయలు దేరారు. హతుని భార్యాపిల్లలకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం చెరుకులపాడు నారాయణరెడ్డి ఇంటి వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చెరుకులపాడు శోకసంద్రం..
నారాయణరెడ్డి మృతితో చెరుకులపాడు గ్రామం శోక సంద్రంగా మారింది. అభిమాన నేతన చూసేందుకు కార్యకర్తలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. గ్రామానికి ఇరువైపులా ఉన్న రహదారులు వాహనాలతో నిండిపోయాయి. గ్రామంలో ఎక్కడ చూసినా జనం కిక్కిరిసి కనిపించారు. అభిమాన నేతను కడసారి చూసేందుకు కొందరు మిద్దెలెక్కారు. చెరుకులపాడు నారాయణరెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. మధుర స్మృతులను తలుచుకుంటూ వేదనా భరితమయ్యారు. అభిమాన నేత పార్థివ దేహాన్ని చూసిన మహిళలు, వృద్ధులు..ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలకు అండగా నిల్చిన నాయకున్ని టీడీపీ నేతలే పొట్టన పెట్టుపెట్టుకున్నారని బోరున విలపించారు.
తల్లిదండ్రుల సమాధి వద్దనే అంత్యక్రియలు
తల్లిదండ్రులు శివారెడ్డి, నారాయణమ్మలను ఖననం చేసిన చోటనే నారాయణరెడ్డి పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఘాట్ వద్దకు వేలాది మంది చేరుకున్యానరు. దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవిని ఘాట్ వద్దకు రాగానే జనం చలించిపోయారు. ఆమె విలపిస్తున్న దృశ్యాలను చూసిన జనం గద్గద స్వరంతో నారాయణరెడ్డి అమర్‌రహే అంటూ నినదించారు. కుమారుడు మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అంత్యక్రియలను ముగించారు. అంత్యక్రియలు ముగిసినా సమాధిని చూస్తూ అదే ప్రాంతంలో కొందరు కూర్చొండిపోవడంతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకరంగా మారింది.
Advertisement
Advertisement