హత్యా రాజకీయాలను ప్రజలు క్షమించరు
హత్యా రాజకీయాలను ప్రజలు క్షమించరు
Published Wed, May 31 2017 11:47 PM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM
- వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ
- నారాయణరెడ్డి సంతాపభలో పార్టీ ముఖ్య నేతలు
అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి
వెల్దుర్తి రూరల్, కృష్ణగిరి: రాష్ట్రంలో టీడీపీ హత్యా రాజకీయాలు పాల్పడుతోందని..దీన్ని ప్రజలు క్షమించబోరన్న విషయాన్ని గుర్తించుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెరుకులపాడులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య అధ్యక్షతన దివంగత నేత చెరుకులపాడు నారాయణరెడ్డి సంతాప సభ నిర్వహించారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డిలతో కలిసి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ముందుగా నారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బొత్స మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా పత్తికొండ నియోజకవర్గం నుంచి నారాయణరెడ్డి గెలిచే అవకాశం ఉండడంతో పోలీసుల అండతో టీడీపీ నేతలు ఆయనను హతమార్చారన్నారు. టీడీపీ నేతలు.. పలుచోట్ల పోలీసు ఉన్నతాధికారులను సైతం అవమానిస్తున్నా..అదే పోలీసులు అధికారపార్టీ నాయకులకు కొమ్ముకాస్తుండడం సిగ్గు చేటన్నారు. ప్రజలను మెప్పించి ఓట్లు వేయించుకోవాలే తప్ప ఇలా హత్యా రాజకీయాలకు పాల్పడడం తగదన్నారు.
ఓడిపోయే రోజులు దగ్గర పడ్డాయి...
టీడీపీ పెద్ద మనుషులు, పోలీసుల సహకారంతోనే నారాయణరెడ్డి హత్య జరిగిందన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ తెలిసిందని పార్టీ అధికార ప్రతనిధి అంబటి రాంబాబు అన్నారు. ప్రాణహాని ఉందని నారాయణరెడ్డి తెలిపినా.. రక్షణ కల్పించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. హత్యా రాజకీయాలను ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతం కాదన్న విషయం వారు గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఓడిపోయే రోజులు దగ్గరపడ్డాయన్నారు.
గెలిచి తీరాలన్న కసి పెరిగింది...
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన పెద్దపెద్ద నాయకులకే డిపాజిట్లు రాలేదని, అయితే నారాయణ రెడ్డి..32 వేల ఓట్లు సాధించి రికార్డు సృష్టించారని వైఎస్‌ఆర్‌సీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఫ్యాక‌్షన్ నుంచి దూరంగా జరగాలన్న నారాయణరెడ్డి ఆలోచనే ఆయనను పొట్టన పెట్టకున్నదన్నట్లుగా కనబడుతున్నదన్నారు. నారాయణరెడ్డి హత్య నియోజకవర్గంలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల్లో కచ్చితంగా గెలిచి తీరాలన్న కసిని పెంచిందన్నారు. అధికారపార్టీ నేతలు..విపక్షాన్ని వివిధ పద్ధతులలో అడ్డుకుంటున్నారని, అలా చేతకాని పక్షంలో హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
అండగా ఉంటాం...
సంతాపసభలో నారాయణరెడ్డి, సాంబశివుడులకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు.. మౌనం పాటించి సంతాపం తెలిపారు. అందరి సమక్షంలో తాము, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .. నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి, అన్న ప్రదీప్‌కుమార్‌రెడ్డి, కుటుంబసభ్యులకు అండగా ఉంటామని హామీనిచ్చారు. రాబోయే ఎన్నికల్లో వారి కుటుంబంలో ఎవరు పోటీ చేసినా.. తమ అధినేత చెప్పినట్లు 50 వేలకు మించి ఓట్లతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సంతాప సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి, ఎంపీ బుట్టా రేణుక, అనంతపురం మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, మురళీకృష్ణ, కర్నూలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ హఫీజ్ ఖాన్‌లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement