
తీర్పు రద్దుకు రాష్ట్రపతి వద్దకు టీడీపీ
స్పందించకుంటే విజయవాడలో 3, 4 తేదీల్లో నిరాహార దీక్ష
కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు చంద్రబాబు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజే శ్‌కుమార్ ట్రిబ్యునల్ వెలువరించిన తుది తీర్పు రద్దు చేయాలని,కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో ఢిల్లీ వెళ్లి సోమ, మంగళవారాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర జలవనరులశాఖ మంత్రులను కలుస్తామన్నారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధానమంత్రుల అపాయింట్‌మెంట్లు కోరామన్నారు. తమ డిమాండ్లపై కేంద్రం స్పందించకుంటే వచ్చే నెల 3, 4 తేదీలలో విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద నిరాహార దీక్ష చేపడతానన్నారు. ట్రిబ్యునల్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి,అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తీర్పుపై సుప్రీంకోర్టులో కేసు వేయాలన్నారు. ఆ కేసులో తమ పార్టీ ఇంప్లీడ్ అవుతుందన్నారు.ట్రిబ్యునల్ తీర్పును నిరసిస్తూ కృష్ణా పరివాహక ప్రాంతంలోని రైతులు ఎక్కడికక్కడ రాస్తారోకోలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 2వ తేదీన మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేయాలన్నారు. అందరికీ సమన్యాయం చేయాల్సిన జడ్జి ఇలా చేయడం సరికాదని అన్నారు. తాను ముఖ్యమంత్రి ఉన్నప్పడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకున్నానని చెప్పారు. రాష్ట్ర విభజనపై ఎక్కడ లేని ఆసక్తి చూపుతున్న కేంద్రం రాష్ట్ర ప్రజల బాగోగులపై చూపడం లేదన్నారు. కుప్పం పర్యటనకు వెళ్లే అర్హత జగన్‌కు ఎక్కడ ఉందని ఆయన అన్నారు.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు రాసిన లేఖతోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, దీనికి జగన్‌మోహన్‌రెడ్డి ముందు సమాధానం చెప్పాలన్నారు.
చంద్రబాబు తన ఇంట్లో నిర్వహించిన సమావేశానికి సాక్షిని అనుమతించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్త ఇస్తున్నాం. సాక్షిని అనుమతించి ఉంటే చంద్రబాబును ఈ కింది ప్రశ్నలు అడిగేది.
1.ఆల్మట్టి ఎత్తును పెంచాలని కర్ణాటక ప్రభుత్వం మీరు సీఎంగా ఉన్నప్పుడే నిర్ణయం తీసుకుంది. అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పనులు చేయకుండా ఇప్పుడు గగ్గోలు పెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుంది?
2. 2004లో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. మీరున్న తొమ్మిదేళ్ల కాలంలో ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఈరోజు మిగులు జలాలపై ఆధారపడిన ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేనా?
3. జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం నియోజకవర్గంలో పర్యటించడంపై మీరెందుకు భయపడుతున్నారు? ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని ఒక ప్రాంతంలో పర్యటించరాదని, ఒకవేళ పర్యటించినా ఆయన సభలకు జనం వెళ్లరాదని ఏవిధంగా చెబుతారు?