brajesh kumar tribunal
-
నేటి నుంచి కృష్ణా ట్రిబ్యునల్ భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదాలకు సంబంధించి ఏర్పాటైన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మంగళవారం నుంచి భేటీ కానుంది. మూడు రోజులపాటు జరగనున్న సమావేశాల్లో తెలంగాణ, ఏపీలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర వాదనలు వినిపించనున్నాయి. విభజన చట్టంలోని సెక్షన్ 89(ఎ), సెక్షన్ 89(బి)లకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు కేటాయింపులు ఎలా జరపాలన్నది ట్రిబ్యునల్ తేల్చాల్సి ఉన్నందున దీనిపైనే వాదనలు జరిగే అవకాశం ఉంది. మొత్తం జలాలను సమీక్షించి నాలుగు రాష్ట్రాలకు పునఃపంపకం చేయాలని తెలంగాణ కోరుతోంది. గతంలో జరిగిన ఒప్పందాల మేరకు రాష్ట్రంలోని ఆర్డీఎస్కు, రాయలసీమలోని సుంకేశుల, కేసీ కెనాల్‌కు సమాన కేటాయింపులు జరపాల్సి ఉన్నా, ఆర్డీఎస్కు 12 టీఎంసీలు కేటాయించి, సుంకేశులకు మాత్రం 39 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని గట్టిగా చెప్పనుంది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా, నీటి కేటాయింపులు మాత్రం కేవలం 35 శాతం మేర మాత్రమే ఉన్నాయి. కానీ ఏపీలో పరీవాహక ప్రాం తం 31.5 శాతమే ఉన్నా.. కేటాయిం పులు మాత్రం మొత్తం జలాల్లో 60 శాతానికిపైగా జరిపారు. ఈ మేరకు పరీవాహక ప్రాంతం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా కేటాయింపులు పెరగాలన్నది రాష్ట్ర వాదనగా ఉండనుంది. ఇక కర్ణాటక, మహారాష్ట్ర మాత్రం వివాదాన్ని తెలంగాణ, ఏపీలకే పరిమితం చేయాలని కోరనున్నాయి. -
బాబు తీరు వల్లే రాష్ట్రానికి అన్యాయం: విజయమ్మ
-
బాబు తీరు వల్లే రాష్ట్రానికి అన్యాయం: విజయమ్మ
పులిచింతల : కృష్ణా జలాల పంపిణీపై బ్రజేష్ కుమార్ ఇచ్చిన తీర్పుపై న్యాయ పోరాటం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్రానికి వ్యతిరేకంగా వచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీ పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నిరసిస్తూ విజయమ్మ పులిచింతల ప్రాజెక్ట్ వద్ద బుధవారం ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు శరాఘాతమన్నారు. భావి తరాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే జలయజ్ఞం పూర్తి అయ్యేదని విజయమ్మ అన్నారు. చంద్రబాబునాయుడు తన హయాంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన పాలనలో ఒక్క ప్రాజెక్ట్‌కు పునాది పడలేదని, బాబు తీరువల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబుకు దీక్ష చేసే అర్హత లేదన్నారు. కాగా తొలిరోజు పులిచింతల ప్రాజెక్టు , రేపు వైఎస్సార్ జిల్లా గండికోట ప్రాజెక్టు వద్ద, ఎల్లుండి శుక్రవారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద విజయమ్మ ధర్నాలు కొనసాగుతాయి. -
నేడు పులిచింతల వద్ద వైఎస్ విజయమ్మ ధర్నా
బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేడు పులిచింతల ప్రాజెక్టు వద్ద ధర్నా చేయనున్నారు. ఇప్పటికే ఆమె హైదరాబాద్‌లో బయల్దేరారు. సరిగ్గా ఉదయం 10.15 గంటలకు ధర్నా ప్రారంభం అవుతుందని గుంటూరు జిల్లా నాయకులు తెలిపారు. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకు గండికొట్టేలా వ్యవహరించినా నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ప్రజలు కూడా నిరసించారు. కాగా, బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నిరసిస్తూ నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు మూడు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధర్నాలు ఉంటాయి. తొలిరోజు గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద, రేపు వైఎస్సార్ జిల్లా గండికోట ప్రాజెక్టు వద్ద, ఎల్లుండి శుక్రవారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద విజయమ్మ ధర్నాలు కొనసాగుతాయి. ఆమెకు మద్దతుగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల రైతులు కూడా దీక్షలు చేస్తామంటున్నారు. ట్రాక్టర్లు వేసుకుని మరీ చాలామంది రైతులు వస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా ప్రాంతాలకు అతీతంగా పులిచింతల ప్రాజెక్టు వద్దకు రైతులు చేరుకుంటున్నారు. -
తీర్పు రద్దుకు రాష్ట్రపతి వద్దకు టీడీపీ
స్పందించకుంటే విజయవాడలో 3, 4 తేదీల్లో నిరాహార దీక్ష కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు చంద్రబాబు డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజే శ్‌కుమార్ ట్రిబ్యునల్ వెలువరించిన తుది తీర్పు రద్దు చేయాలని,కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో ఢిల్లీ వెళ్లి సోమ, మంగళవారాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర జలవనరులశాఖ మంత్రులను కలుస్తామన్నారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధానమంత్రుల అపాయింట్మెంట్లు కోరామన్నారు. తమ డిమాండ్లపై కేంద్రం స్పందించకుంటే వచ్చే నెల 3, 4 తేదీలలో విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద నిరాహార దీక్ష చేపడతానన్నారు. ట్రిబ్యునల్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి,అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తీర్పుపై సుప్రీంకోర్టులో కేసు వేయాలన్నారు. ఆ కేసులో తమ పార్టీ ఇంప్లీడ్ అవుతుందన్నారు.ట్రిబ్యునల్ తీర్పును నిరసిస్తూ కృష్ణా పరివాహక ప్రాంతంలోని రైతులు ఎక్కడికక్కడ రాస్తారోకోలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 2వ తేదీన మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేయాలన్నారు. అందరికీ సమన్యాయం చేయాల్సిన జడ్జి ఇలా చేయడం సరికాదని అన్నారు. తాను ముఖ్యమంత్రి ఉన్నప్పడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకున్నానని చెప్పారు. రాష్ట్ర విభజనపై ఎక్కడ లేని ఆసక్తి చూపుతున్న కేంద్రం రాష్ట్ర ప్రజల బాగోగులపై చూపడం లేదన్నారు. కుప్పం పర్యటనకు వెళ్లే అర్హత జగన్‌కు ఎక్కడ ఉందని ఆయన అన్నారు.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు రాసిన లేఖతోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, దీనికి జగన్మోహన్రెడ్డి ముందు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు తన ఇంట్లో నిర్వహించిన సమావేశానికి సాక్షిని అనుమతించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్త ఇస్తున్నాం. సాక్షిని అనుమతించి ఉంటే చంద్రబాబును ఈ కింది ప్రశ్నలు అడిగేది. 1.ఆల్మట్టి ఎత్తును పెంచాలని కర్ణాటక ప్రభుత్వం మీరు సీఎంగా ఉన్నప్పుడే నిర్ణయం తీసుకుంది. అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పనులు చేయకుండా ఇప్పుడు గగ్గోలు పెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? 2. 2004లో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. మీరున్న తొమ్మిదేళ్ల కాలంలో ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఈరోజు మిగులు జలాలపై ఆధారపడిన ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేనా? 3. జగన్మోహన్రెడ్డి కుప్పం నియోజకవర్గంలో పర్యటించడంపై మీరెందుకు భయపడుతున్నారు? ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని ఒక ప్రాంతంలో పర్యటించరాదని, ఒకవేళ పర్యటించినా ఆయన సభలకు జనం వెళ్లరాదని ఏవిధంగా చెబుతారు? -
మొదటి ముద్దాయి టీడీపీనే!
బాబు హయాంలో ప్రాజెక్టులు పూర్తి అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ది పక్షపాత ధోరణి మైసూరారెడ్డి ధ్వజం కడప, న్యూస్‌లైన్: రాష్ట్రంలో మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరపకపోవడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీయేనని వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవ హారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ఆరోపించారు. 2004 కన్నా ముందు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పుడే ప్రాజెక్టులు నిర్మించి ఉంటే ఇప్పుడు ట్రిబ్యునల్‌లో నీటి కేటాయింపులు జరిగేవన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆపలేకపోయిందని విమర్శించారు. ఇప్పుడు ఆ రాష్ట్రాలు నిర్మించిన ఆల్మట్టి సహా 12 అక్రమ ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరిపి వాటిని రెగ్యులరైజ్ చేసిందని మైసూరారెడ్డి పేర్కొన్నారు. కడపలోని వైఎస్ గెస్ట్‌హౌస్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు గొడ్డలి పెట్టని, ముఖ్యంగా రాయలసీమ, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు శాశ్వతంగా అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులకే నీటి కేటాయింపులు జరిపారని, దాంతో మన ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులపై ఇప్పటివరకు ఖర్చు పెట్టిన రూ.40 వేల కోట్లు నిరర్థకమయ్యాయన్నారు. మధ్యంతర తీర్పు అనంతరం ట్రిబ్యునల్ పక్షపాత వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్రప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన తెలుగుదేశం పార్టీ కూడా తమ తప్పులు కప్పిపుచ్చుకుంటూ ఇతరులపై బురద జల్లుతోందని మండిపడ్డారు. టీడీపీ తొమ్మిదేళ్ల పాలనలో గాలేరు-నగరికి రూ.17 కోట్లు, హంద్రీ-నీవాకు రూ.13 కోట్లు, వెలిగొండకు రూ. 13 కోట్లు, కల్వకుర్తికి రూ.12 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, నెట్టెంపాడుకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదన్నారు. కానీ, వైఎస్ హయాంలో 2004 నుంచి 2009 వరకు గాలేరు-నగరికి రూ. 4 వేల కోట్లు, హంద్రీ-నీవాకు రూ.4 వేల కోట్లు, వెలిగొండకు రూ. 1443 కోట్లు, నెట్టెంపాడుకు రూ. 1124 కోట్లు, కల్వకుర్తికి రూ. 1930 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. గాలేరు-నగరి ప్రాజెక్టు గ్రావిటీ ప్రకారం ప్రవహించే ప్రాజెక్టు అని, 1994లో ఆ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి పనులు అప్పగించినా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసిందని గుర్తుచేశారు. ట్రిబ్యునల్ తీర్పుపై ప్రభుత్వమే సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి ఉందని, లేనిపక్షంలో రాష్ట్ర ప్రాజెక్టులు స్మారక చిహ్నాలుగా మిగిలిపోతాయన్నారు. సమావేశంలో వైఎస్సార్సీసీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, డీసీసీబీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, కడప సమన్వయకర్త అంజాద్‌బాషా, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, హఫీజుల్లా పాల్గొన్నారు. చంద్రబాబు వైఖరి వల్లనే: సీఎంగా పనిచేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అనుసరించిన వైఖరి వల్లనే జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మన రాష్ట్రానికి ప్రతికూలంగా వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, గట్టు రామచంద్రరావులు విమర్శించారు. వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు తన హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించకపోవడం వల్లే కృష్ణా మిగులు జలాల విషయంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై బురదజల్లేందుకు ప్రయత్నించడం ఆయన కుసంస్కారాన్ని తెలియజేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులుగా ముగ్గురి నియామకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలిలో సభ్యులుగా కొత్తగా ఒ.వి.రమణ (తిరుపతి), పాపకన్ను రాజశేఖరరెడ్డి(వెంకటగిరి), బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి(ఆత్మకూరు)ని నియమించారు. ఈ విషయాన్ని పార్టీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. -
స్మారక చిహ్నాలే!
* కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎమ్మార్పీ, గాలేరు-నగరి, వెలిగొండ, హంద్రీ-నీవాల పరిస్థితి ఇదే * భారీ వర్షాలు వచ్చి నీరు అందుబాటులోకి వచ్చినా.. ఆ ఆయుకట్టుకు నీరు వాడుకోవడం దాదాపు అసాధ్యం * బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులోని వింత నిబంధనల పర్యవసానం సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎమ్మార్పీ, గాలేరు-నగరి, వెలిగొండ, హంద్రీ-నీవా.. ఈ ఆరు ప్రాజెక్టులు కరువు, ఫ్లోరైడ్ పీడిత మహబూబ్‌నగర్, నల్లగొండ, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సుమారు 20 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యం తో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటయ్యాయి. అయితే, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం చూస్తే.. భవిష్యత్‌లో ఆ ప్రాజెక్టులు స్మారక చిహ్నాలుగా మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. నిర్మాణాలు పూర్తయినా.. భారీ వర్షాలు వచ్చి నీరు అందుబాటులోకి వచ్చినా ...ఆ ఆరు ప్రాజెక్టులకు మాత్రం అవసరమైన సమయంలో ఆ నీటిని వాడుకునే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇదీ పంపకం... వాడకం పద్ధతి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కృష్ణాజలాలపై స్పష్టతనిచ్చింది. కృష్ణాపై ఆధారపడ్డ మూడు రాష్ట్రాలు(మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్) కూడా ముందుగా నికర జలాల (75 శాతం డిపెండబిలిటీ ప్రకారం)ను వాడుకోవాల్సి ఉంటుంది. అంటే కర్ణాటక 734 టీఎంసీలు, మహారాష్ట్ర 585 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీల చొప్పున మొత్తం 2130 టీఎంసీలను ఉపయోగించుకోవాలి. ఈ నీటి పరిధి వరకు ఎవరికి ముందు వస్తే వారు ఉపయోగిస్తారు. అంటే దిగువ రాష్ట్రాల్లో నీరు లేకున్నా...ఎగువ ప్రాంతం వారు దిగువకు నీటిని విడుదల చేయకుండనే ఉపయోగించుకోవచ్చు. పైగా ఈ నీటి ఉపయోగానికి సంబంధించి ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఉన్నాయి. అంటే ...ప్రాజెక్టుల వారీగా ఈ నీటిని కేటాయించారు. దాంతో ఒక ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని మరో మరో ప్రాజెక్టుకు ఉపయోగించుకోవడానికి వీలు లేదు. ముఖ్యంగా నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులకు అసలు మళ్లించడానికి వీలు లేదు. ఈ నీటి వాడకం పూర్తయిన తర్వాత అదనపు (65 శాతం డిపెండబిలిటి) జలాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మొత్తం 147 టిఎంసీల ఈ నీటిలో మహారాష్ట్రకు 43 టిఎంసీలు, కర్నాటకకు 61 టిఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 43 టిఎంసీలను కేటాయించారు. తర్వాత నదిలోని 47 సంవత్సరాల సరాసరి ప్రవాహాన్ని అంచనా వేసిన మిగులు జలాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇందులో 35 టిఎంసీలు మహారాష్ట్రకు, 105 టిఎంసీలను కర్నాటకకు, 145 టిఎంసీలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. మనకు కేటాయంచిన 145 టిఎంసీలను నాగార్జునసాగర్ క్యారీ ఓవర్ కింద పరిగణించారు. పైన పేర్కొన్న మొత్తం నీరు 2562 టిఎంసీలు. అసలు సమస్య ఇదీ ! - ప్రస్తుతం వునం వరద జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నందున కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎమ్మార్పీ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు పైన పేర్కొన్న అన్ని రకాల నీటి (నికర, మిగులు, అదనం)లో ఎలాంటి కేటాయింపులు లేవు. అంటే...నదిలో 2562 టింఎసీల నీటి కంటే ఎక్కువ వచ్చిన సందర్భాల్లోనే ఈ ప్రాజెక్టులకు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. - ఒకవేళ వుంచి వర్షాలు కురిసినా వుుందుగా వుూడు రాష్ట్రాలూ తవు నికరజలాలు వాడుకుని, ఆ తరువాత అదనపు జలాలు, మిగులు జలాలు వాడుకున్న తరువాత గానీ ఈ వరదజలాల వాడకం సాధ్యపడదు. ఐతే ఆ వుూడు రకాల జలాల (2562 టీఎంసీలు) ఉపయోగం పూర్తి కావటానికి నవంబరు, డిసెంబరు నెలలు దాటిపోతుంది. - ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్‌కు మిగులుజలాల్లో వాటా ఇస్తున్నట్లే ఇచ్చి వాటిని తెలుగుగంగకు, నాగార్జునసాగర్ క్యారీ ఓవర్‌గా చూపించింది. అంటే ఈప్రాజెక్టులకు తప్పనిసరిగా వరద జలాలు వూత్రమే దిక్కు. 2562 టీఎంసీల వాడకం పూర్తరుుతే ఒక హక్కుగా గాకుండా కేవలం ‘వరదజలాల వాడకంపై స్వేచ్ఛ’ కోణంలో వూత్రమే ఈ ప్రాజెక్టులకు నీటిని వాడుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ ప్రాజెక్టులకు అన్నిరకాల అనువుతులూ కష్టసాధ్యమే! - ఒకవేళ ఈ ఏడాది మాదిరిగా జూన్, జూలై, ఆగస్టు మాసాల్లోనే కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు వచ్చి... అన్ని రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండినా, ఈ ప్రాజెక్టులకు నీటిని మళ్లించడం సాధ్యం కాదు. ఎందుకంటే అప్పటికి మూడు రాష్ట్రాల నీటి వాడకం 2562 టిఎంసీల పరిధి దాటదు. పైగా మూడు రాష్ట్రాల్లోని ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం కూడా 1,500 టిఎంసీల లోపుగానే ఉంటుంది. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 2562 టిఎంసీల వాడకం పూర్తి కాకుండా...వరద నీటిపై ఆధార పడ్డ ప్రాజెక్టులకు నీటిని మళ్లించడానికి వీలు లేదు. ఒక వేళ సొంత రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నా... కొత్తగా ఏర్పడే ‘కృష్ణా జల నిర్ణయ అమలు బోర్డు’ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎగువ రాష్ట్రాల అనుమతి కూడా తప్పని సరి అవుతుంది. - మంచి వర్షాలు కురిసినా, బోర్డు అనువుతించినా... నికర, అదనపు, మిగులుజలాల వాడకం లెక్కలు పూర్తయ్యేలోపు ఖరీఫ్ సీజన్ పూర్తవుతుంది. - ఒకవేళ ఏ అక్టోబర్లోనో వరదలు వచ్చినా...అవి ఎక్కువ రోజులు ఉండవు. రెండు మూడు రోజుల్లోపే వరద ఉదృతి తగ్గిపోతుంది. ఈ వరద జలాలపై ఆధార పడ్డ ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించాలంటే పంపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా 40 నుంచి 80 రోజుల పాటు పంపింగ్ చేస్తేనే... పంటలకు నీటిని అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టుల వినియోగానికి సరిపడా నిల్వ చేసేందుకు రిజర్వాయర్లు లేవు. - నిల్వ రిజర్వాయుర్లు సరిపడా లేనందున పంపింగ్ చేసే నీరు నేరుగా కాలువల్లోకి, పంట పొలాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆమేరకు రోజుల తరబడి నదీప్రవాహంలో నీరు ఉండాలి. రబీ పూర్తయ్యేదాకా రోజూ నీటిని పంపింగ్ చేయాలంటే అన్ని రోజులు నదిలో వరద ఉండదు. - ఒకవేళ రాష్ట్రం క్యారీ ఓవర్ నుంచి ఇవ్వాలనుకున్నా... ఇది నాగార్జునసాగర్‌కే ఆ అవకాశం ఉంది గానీ శ్రీశైలానికి లేదు. పైగా ఆ క్యారీ ఓవర్ నీరు సాగర్ దిగువన ఉన్న ఆయుకట్టుకే పరిమితమైన కోటా. - ఒకవేళ రాష్ట్రం కొంత స్వేచ్ఛ తీసుకుని వున క్యాచ్‌మెంట్‌లో వచ్చే నీటిని ఇవ్వాలనుకున్నా రెండు రకాలుగా సాధ్యం కాదు. ఒకటేమో వున క్యాచ్‌మెంట్‌లో వచ్చేది కేవలం 35 శాతం వూత్రమే. మిగతా నీటిని వునం ఎగువ రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి ఉంది. - పైగా ఈ క్యాచ్మెంట్ నీరు కూడా నికరం, అదనం, మిగులు జలాల లెక్కలో కలిపేసి ఉంటుంది కాబట్టి విడిగా ఇవ్వడం కుదిరే పని కాదు. బోర్డు అంగీకరించదు. -
కృష్ణా జలాలపై సుప్రీంకోర్టుకు వెళ్లండి: మైసూరా
హైదరాబాద్ : కృష్ణా జలాల పంపిణీపై బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌కు చాలా నష్టం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలని..... తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాలని సూచించారు. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తేటతెల్లమైందన్నారు. ట్రిబ్యునల్ తీర్పును సవరించకుంటే రాష్ట్రానికి అన్యాయమే జరుగుతుందన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ విఫలమైందని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలోనే అక్రమ నిర్మాణాలు జరిగాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో రైతులకు మెట్ట పంటల వైపు మళ్లించాలని ఆనాడే చంద్రబాబు అన్నారని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. కాగా మిగులు జలాల పంపిణీ, ఆలమట్టి ఎత్తు పెంపుపై రాష్ట్రం ట్రిబ్యునల్ ఎదుట తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికి..వాటిని పరిగణలోకి తీసుకోకుండా కృష్ణ జలలాపై ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. -
కృష్ణా జలాల పంపిణీపై నేడు తుది తీర్పు
‘బ్రజేశ్‌కుమార్’ మధ్యంతర తీర్పులో మన రాష్ట్రానికి వ్యతిరేకంగా అనేకాంశాలు.. మిగులు జలాల పంపిణీ, ఆలమట్టి ఎత్తు పెంపుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన రాష్ట్రం అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోకుండా తీర్పునిస్తే కృష్ణా రైతులకు తీవ్ర నష్టం ‘రాష్ట్ర విభజన’ నేపథ్యంలో తీర్పునకు ప్రాధాన్యత సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా సంబంధిత రాష్ట్రాల వాదనలను వింటున్న బ్రజేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని కృష్ణా ట్రిబ్యునల్ శుక్రవారం తుది తీర్పును ప్రకటించనున్నది. అరుుతే ఏ విధమైన తీర్పు వెలువడనుందనే అంశమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు వెలువడితే మాత్రం రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో మన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా అనేక అంశాలు ఉన్నాయి. వీటి పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. తుది తీర్పు సందర్భంగా వీటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఆయూ అంశాలను సవరించని పక్షంలో.. రాష్ర్టంలో కృష్ణా జలాలపై ఆధారపడిన రైతాంగం తీవ్రంగా నష్టపోక తప్పదు. ప్రస్తుతం రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ట్రిబ్యునల్ తీర్పునకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ట్రిబ్యునల్ ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమై తీర్పును వెల్లడించనుంది. ఈ దృష్ట్యా రాష్ట్రం తరఫున నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, అంతరాష్ట్ర జల వనరుల విభాగం సీఈ రవూఫ్ తదితర అధికారులు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. ఇదీ నేపథ్యం... కృష్ణానది నీటి వాడకంపై మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో నీటి పంపకాలపై 1969లో ఆర్ఎస్ బచావత్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ట్రిబ్యునల్ 1973లో తీర్పును వెల్లడించింది. అయితే ఈ తీర్పును పునఃపరిశీలించాలని 2002లో మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టును కోరాయి. ఈ క్రమంలో 2004 ఏప్రిల్ 2వ తేదీన జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. జస్టిస్ ఎస్పీ శ్రీవాస్తవ, జస్టిస్ డీకే సేథ్‌లు సభ్యులుగా ఉన్నారు. అప్పటినుంచి పలుమార్లు సమావేశమైన ట్రిబ్యునల్ మూడు రాష్ట్రాల వాదనలను విన్నది. 2010 డిసెంబర్ 30న మధ్యంతర తీర్పును వెల్లడించింది. ఈ తీర్పులో పలు అంశాలు మన రాష్ర్ట ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో రాష్ట్రం సవరణలకు డిమాండ్ చేసింది. గత మూడేళ్లుగా సవరణలపై వాదనలను కొనసాగాయి. ఆయా రాష్ట్రాలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చాయి. ఈ నేపథ్యంలో తుది తీర్పు ప్రకటనకు ట్రిబ్యునల్ సిద్ధమైంది. ఆలమట్టిని నియంత్రిస్తారా? మధ్యంతర తీర్పులో మనం తీవ్రంగా వ్యతిరేకించిన అంశం ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు. కర్ణాటక ప్రభుత్వం కృష్ణానదిపై మన ప్రాంతానికి ఎగువున నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల మనకు సకాలంలో నీరు రావడం ఆగిపోతుంది. ఇప్పటికే 519.6 మీటర్లు ఉన్న ఈ డ్యాం ఎత్తును 524.24 మీటర్లకు పెంచుకునేందుకు ట్రిబ్యునల్ అంగీకరించింది. దీనివల్ల కర్ణాటక ప్రభుత్వం అదనంగా మరో 103 టీఎంసీల నీటిని ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది. దిగువకు వచ్చే నీటి ప్రవాహం గణనీయంగా పడిపోతుంది. అలా జరిగితే కృష్ణానదిపై మన రాష్ట్రంలో ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుంది. మిగులు జలాలతోనే మన భవిష్యత్తు! రాష్ర్టంలో కృష్ణానదిపై ఆధారపడిన ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో మిగులు జలాలను ఆధారంగా చేసుకుని కల్వకుర్తి, నెట్టెంపాడు, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, తెలుగుగంగ, వెలుగొండ, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టులను చేపట్టాం. వీటి కోసం సుమారు 227 టీఎంసీల నీరు అవసరం ఉంది. మొదటి ట్రిబ్యునల్ (బచావత్) ప్రకారం ఈ నీటిని వాడుకునే స్వేచ్ఛ మనకు మాత్రమే ఉంది. కానీ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో మిగులు జలాలను ఎగువ ప్రాంతాలకు కూడా పంపిణీ చేసింది. ఇదే తీర్పు అమల్లోకి వస్తే మనకు మిగులు జలాలు అందుబాటులో ఉండవు. దాంతో పైన పేర్కొన్న ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఎగువ రాష్ట్రాలకు మిగులు జలాల పంపిణీని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు వాదించింది. 65% డిపెండబులిటీపై తీవ్ర అభ్యంతరం.. మరోవైపు ఎగువ రాష్ట్రాలకు నీటి కేటాయింపులను పెంచడానికి వీలుగా ప్రస్తుత ట్రిబ్యునల్ నీటి లభ్యతను అంచనా వేయడంలో కొత్త పద్దతిని అనుసరించింది. సాధారణంగా నదిలో నీటి లభ్యతను అంచనా వేయడానికి 75 శాతం డిపెండబులిటీని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ మాత్రం 65 శాతం డిపెండబులిటీ పద్దతిని అనుసరించింది. ఆ మేరకు నదిలో నీరు ఎక్కువగా ఉందంటూ ఎగువ రాష్ట్రాలకు నీటి కేటాయింపులను పెంచింది. ఈ విధంగా 65 శాతం డిపెండబులిటీ పద్దతిని అనుసరించడాన్ని కూడా రాష్ర్టం తీవ్రంగా వ్యతిరేకించింది. సకాలంలో నీటి విడుదలకు ఆదేశిస్తుందా? కర్ణాటకలో ఆలమట్టి అందుబాటులోకి వచ్చినందున మన ప్రాజెక్టులకు సకాలంలో నీటి విడుదల అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆలమట్టి నిండే వరకు నీటిని దిగువకు విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రాజెక్టులకు నీరు రాదు. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ కారణంగానే నీటి విడుదల విషయంలో కాలపరిమితులను నిర్దేశించాల్సిందిగా రాష్ట్రం ట్రిబ్యునల్‌ను కోరింది. నియంత్రణ బోర్డుకు విస్తృత అధికారాలు ఉంటాయా ? కృష్ణా జలాల వాడకంపై ప్రత్యేక నియంత్రణ బోర్డును ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో సూచించింది. బోర్డులో ఆయా రాష్ట్రాల అధికారులతో పాటు, కేంద్ర అధికారులు కూడా సభ్యులుగా ఉంటారని పేర్కొంది. అయితే ఈ మేరకు ఏర్పడబోయే బోర్డుకు సంక్రమించే అధికారాలపైనే దిగువ రాష్ర్టం భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పటికే తుంగభద్ర బోర్డు నామమాత్రంగా పని చేస్తున్న అనుభవం మనకు ఉంది. ఎగువ ప్రాంతంవారు ఇష్టానుసారంగా నీటిని ఉపయోగించుకున్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కొత్తగా ఏర్పడబోయే కృష్ణానది నియంత్రణ బోర్డు కూడా విస్తృతాధికారాలు లేకుండా తుంగభద్ర బోర్డులాగే ఉంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.