సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదాలకు సంబంధించి ఏర్పాటైన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మంగళవారం నుంచి భేటీ కానుంది. మూడు రోజులపాటు జరగనున్న సమావేశాల్లో తెలంగాణ, ఏపీలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర వాదనలు వినిపించనున్నాయి. విభజన చట్టంలోని సెక్షన్ 89(ఎ), సెక్షన్ 89(బి)లకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు కేటాయింపులు ఎలా జరపాలన్నది ట్రిబ్యునల్ తేల్చాల్సి ఉన్నందున దీనిపైనే వాదనలు జరిగే అవకాశం ఉంది.
మొత్తం జలాలను సమీక్షించి నాలుగు రాష్ట్రాలకు పునఃపంపకం చేయాలని తెలంగాణ కోరుతోంది. గతంలో జరిగిన ఒప్పందాల మేరకు రాష్ట్రంలోని ఆర్డీఎస్‌కు, రాయలసీమలోని సుంకేశుల, కేసీ కెనాల్‌కు సమాన కేటాయింపులు జరపాల్సి ఉన్నా, ఆర్డీఎస్‌కు 12 టీఎంసీలు కేటాయించి, సుంకేశులకు మాత్రం 39 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని గట్టిగా చెప్పనుంది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా, నీటి కేటాయింపులు మాత్రం కేవలం 35 శాతం మేర మాత్రమే ఉన్నాయి. కానీ ఏపీలో పరీవాహక ప్రాం తం 31.5 శాతమే ఉన్నా.. కేటాయిం పులు మాత్రం మొత్తం జలాల్లో 60 శాతానికిపైగా జరిపారు. ఈ మేరకు పరీవాహక ప్రాంతం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా కేటాయింపులు పెరగాలన్నది రాష్ట్ర వాదనగా ఉండనుంది. ఇక కర్ణాటక, మహారాష్ట్ర మాత్రం వివాదాన్ని తెలంగాణ, ఏపీలకే పరిమితం చేయాలని కోరనున్నాయి.
నేటి నుంచి కృష్ణా ట్రిబ్యునల్ భేటీ
Published Tue, Apr 5 2016 4:27 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM
Advertisement
Advertisement