
బాబు తీరు వల్లే రాష్ట్రానికి అన్యాయం: విజయమ్మ
కృష్ణా జలాల పంపిణీపై బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై న్యాయ పోరాటం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు.
పులిచింతల : కృష్ణా జలాల పంపిణీపై బ్రజేష్ కుమార్ ఇచ్చిన తీర్పుపై న్యాయ పోరాటం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్రానికి వ్యతిరేకంగా వచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీ పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నిరసిస్తూ విజయమ్మ పులిచింతల ప్రాజెక్ట్ వద్ద బుధవారం ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్కు శరాఘాతమన్నారు. భావి తరాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే జలయజ్ఞం పూర్తి అయ్యేదని విజయమ్మ అన్నారు. చంద్రబాబునాయుడు తన హయాంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన పాలనలో ఒక్క ప్రాజెక్ట్కు పునాది పడలేదని, బాబు తీరువల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. చంద్రబాబుకు దీక్ష చేసే అర్హత లేదన్నారు. కాగా తొలిరోజు పులిచింతల ప్రాజెక్టు , రేపు వైఎస్సార్ జిల్లా గండికోట ప్రాజెక్టు వద్ద, ఎల్లుండి శుక్రవారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద విజయమ్మ ధర్నాలు కొనసాగుతాయి.