
నేడు పులిచింతల వద్ద వైఎస్ విజయమ్మ ధర్నా
బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేడు పులిచింతల ప్రాజెక్టు వద్ద ధర్నా చేయనున్నారు. ఇప్పటికే ఆమె హైదరాబాద్లో బయల్దేరారు. సరిగ్గా ఉదయం 10.15 గంటలకు ధర్నా ప్రారంభం అవుతుందని గుంటూరు జిల్లా నాయకులు తెలిపారు. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకు గండికొట్టేలా వ్యవహరించినా నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ప్రజలు కూడా నిరసించారు.
కాగా, బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నిరసిస్తూ నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు మూడు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధర్నాలు ఉంటాయి. తొలిరోజు గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద, రేపు వైఎస్సార్ జిల్లా గండికోట ప్రాజెక్టు వద్ద, ఎల్లుండి శుక్రవారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వద్ద విజయమ్మ ధర్నాలు కొనసాగుతాయి. ఆమెకు మద్దతుగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల రైతులు కూడా దీక్షలు చేస్తామంటున్నారు. ట్రాక్టర్లు వేసుకుని మరీ చాలామంది రైతులు వస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా ప్రాంతాలకు అతీతంగా పులిచింతల ప్రాజెక్టు వద్దకు రైతులు చేరుకుంటున్నారు.