‘పోరాటానికి’ వెన్నుపోటు !
‘పోరాటానికి’ వెన్నుపోటు !
Published Wed, Mar 19 2014 3:04 AM | Last Updated on Fri, Aug 10 2018 6:50 PM
పార్వతీపురం టౌన్, న్యూస్‌లైన్ : పార్టీని నమ్ముకుని చాలా కాలంగా సేవ చేస్తున్న తెలుగు తమ్ముళ్లు నాయకుల ఆగడాలను సహిం చలేకపోయారు. తమకు టిక్కెట్లు ఇస్తున్నట్టు చేసిన టీడీపీ గిరిజన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలుపెరగని పోరాటం చేసిన తమను ఇరకాటంలో పెట్టారని కోపోద్రిక్తులవుతున్నారు. నీతిమాలిన రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేశారని ఆరోపిస్తున్నారు.మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఎస్టీయా కాదా అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం. దేనికిందకొస్తారన్నది న్యాయస్థానంలో తేలే అంశం. కాకపోతే, ఈ వ్యవహారంలో టీడీపీ అనుసరించిన ద్వంద్వ విధానమే తప్పు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. శత్రుచర్ల విజయరామరాజు కుల వివాదంపై టీడీపీ నేత నిమ్మక జయరాజ్ సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నారు. న్యాయస్థానాలను తరుచూ ఆశ్రయిస్తున్నారు.
అందుకు టీడీపీ పూర్తిగా సహకరించింది. ఆర్థిక, న్యాయపరమైన సహాయ సహాకారాలను అందించింది. రాజధానిలో ఎప్పటికప్పుడు కేసును ముందుకునడిపిస్తూ వచ్చింది. కుల వివాదం రూపంలో శత్రుచర్లను దెబ్బకొట్టేందుకు అన్ని రకాల శక్తియుక్తులను ప్రదర్శించింది. చెప్పాలంటే నిమ్మక జయరాజ్‌ను పావుగా వాడుకుందన్న వాదనలు ఉన్నాయి. ఎవరిపైనైతే పరోక్ష పోరాటం చేసిందో అదే నాయకుడ్ని ఈ రోజు పార్టీలోకి ఆహ్వానించింది. జరిగిన పరిణామాలను గమనించిన టీడీపీ గిరిజన నేతలంతా అవాక్కయ్యారు. ఇంత ఘోరమా అని ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారిపోవాలా అని అంతర్మథనం చెందుతున్నారు. ప్రత్యర్థిగా ఉన్నప్పుడు తమను పావుగా వాడుకుని, ఇప్పుడు అతనిని పార్టీలో చేర్చుకున్నారని, తామంతా ఏమైపోవాలని వాపోతున్నారు. పక్కలో బల్లెం పెట్టుకున్నట్టే అయ్యిందని కూడా మదనపడుతున్నారు.
అప్పుడు పార్టీకి శత్రుచర్ల వెన్నుపోటు
ఇదంతా ఒక ఎత్తు అయితే టీడీపీ తరఫున ఎంపీగా ఎన్నికైన శత్రుచర్ల విజయరామరాజు అప్పట్లో కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సమ యంలో టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసి, వెన్నుపోటు పొడిచిన సందర్భం ఇప్పటికీ టీడీపీ నేతలను బాధిస్తోంది. ఆ మధ్య శత్రుచర్ల రాకను వ్యతిరేకిస్తూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు తమ అనుచరుల వద్ద ఇదే విషయాన్ని వ్యక్తం చేశారు. కాకపోతే అశోక్ మాట చెల్లుబాటు కాకపోవడంతో శత్రుచర్ల ఓవర్ టేక్ చేశారు. కానీ, టీడీపీ నాయకుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి ఉంది. అంతేలే వెన్నుపోటు రాజకీయాలు నెరిపే పార్టీలో వెన్నుపోటుదారులు ప్రోత్సహించరని అనుకోవడం తమ పొరపాటు అని అంతర్మథనం చెందుతున్నారు. మొత్తానికి శత్రుచర్ల రాకతో కురుపాం టీడీపీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Advertisement
Advertisement