ఎన్నికల నియమావళికి టీడీపీ తూట్లు
కర్నూలు(అగ్రికల్చర్) : శాసనమండలి ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల నియమావళికి తూట్లు పొడుస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.శివానందరెడ్డి కోడ్ ఉల్లంఘించడంపై నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థి డి.వెంకటేశ్వరరెడ్డితో కలసి మంగళవారం ఆయన రిటర్నింగ్ అధికారి, జేసీ హరికిరణ్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడ్ అమలులో ఉండగా జూపాడుబంగ్లా మండల పరిషత్ కార్యాలయంలో అధ్యక్షుని కుర్చీలో కూర్చొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో సమావేశమై టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డిని గెలిపించాలని మాండ్ర ప్రచారం చేయడం కోడ్‌కు విరుద్ధమన్నారు. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై జేసీ స్పందిస్తూ తక్షణం విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం బుడ్డా రాజశేఖర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి జిల్లాలో బలం లేకపోయినా ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీకి నిలపడం చూస్తే ఓటుకు నోటుతో గట్టెక్కే ప్రయత్నం స్పష్టమవుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను, మున్సిపల్ కౌన్సిలర్లను అధికార బలంతో లోబర్చుకుని గెలుపొందేందుకు ఆ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోందన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు తరహా విధానాన్ని ఇక్కడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లాలోనూ టీడీపీ నేతలు ఓటుకు నోట్లు ఇచ్చి గెలుపొందే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారన్నారు. అయినప్పటికీ అదే ప్రయత్నం ఇక్కడా చేస్తున్నారన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘిస్తోందన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన మాండ్ర శివానందరెడ్డి ఎన్నికల నియమావళికి తూట్లు పొడవటం దారుణమైన విషయమన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ తరపున గెలిచి.. టీడీపీ అనుకూలంగా ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్న ఎంపీపీ మంజులపైనా అనర్హత వేటు వేసి ఎంపీటీసీ సభ్యత్వాన్నిరద్దు చేయాలని ఆయన కోరారు.