సీటు నాదే.. నోటు నాదే!
Published Thu, Jan 28 2016 11:30 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించుకున్న ఓ యువనేత ఇప్పటి నుంచే వసూళ్లకు తెగబడ్డాడు. అధికార పార్టీ అండతో.. ఆ ప్రాంతంలో హల్ చల్ సృష్టిస్తున్నాడు.ఆయన కనుసన్నల్లో మెలిగే అధికారులకే అక్కడ చోటు. బదిలీ అయినా.. అభివృద్ధి పనులైనా.. ఆయన చెప్పిందే వేదం. పవర్ సెంటర్‌గా మారిన ఆయన చుట్టూతే ఇప్పుడు రాజకీయం సాగుతోంది.
యువనేత ‘పవర్’ పాలిటిక్స్
ప్రతి పనికీ ఓ రేటు కట్టి వసూలు
ఆ తర్వాతే పనులు ప్రారంభించాలని హుకుం
ఎమ్మెల్యే సీటు తనకేనని ప్రచారం
నియోజకవర్గంపై ఇప్పటి నుంచే పెత్తనం
మింగుడు పడని మరోవర్గం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ యువ నేత ఆగడాలకు ఆ నియోజకవర్గంలో అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా లైన్ క్లియర్ అయినట్లు చెప్పుకుంటూ.. ఆ ప్రాంతంలో ఇప్పటి నుంచే కలియ తిరుగుతున్నారు. అక్కడ ఎలాంటి అభివృద్ధి పని జరిగినా తనకు వాటా ఇవ్వాల్సిందేనని హుకం జారీ చేశారు. ఇప్పటికే ప్రతి పనిలో తన వాటాగా 6శాతం ఇవ్వాలని అధికారులకు స్పష్టంగా ఆదేశించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని కాంట్రాక్టర్లకూ చేరవేయాలని సందేశం పంపినట్లు తెలిసింది. అదేవిధంగా తన అనుచరవర్గానికీ ఎక్కడికక్కడ పనులు చూపించే పనులు ఆయన పక్కా ప్లాన్ రచిస్తున్నారు.
మీకేం కావాలి..
నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఈ యువనేత గత నెల ఓ మండలంలో అనుచరులతో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి ఎలాంటి పనులు కావాలనే విషయమై ఆరా తీయగా.. పూర్తిగా నిలిచిపోయిన అక్రమ మైనింగ్‌ను పునరుద్ధరించాలని కోరారు. అందుకాయన.. ఇప్పటి నుంచే ప్రారంభించుకోవచ్చని, అయితే ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా చేసుకోవాలని సూచించినట్లు చర్చ జరుగుతోంది. ఇంతటితో ఆగకుండా నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాను కూడా ఆయన దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారని సమాచారం. ఈ అక్రమ వ్యాపారం కోసం సదరు యువనేత వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో పోలీసు, రెవెన్యూ ఉద్యోగులు ఎవరుండాలో చెప్పి బదిలీ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. సదరు యువనేతతో కలిసి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కూడా తమ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సదరు నియోజకవర్గంలో ఒక సీఐతో పాటు ఎస్‌ఐ కూడా అక్రమ ఇసుక దందాలో బాగానే వెనకేసుకున్నట్లు సమాచారం.
నా మాటే వేదం..
వచ్చే ఎన్నికల్లో యువనేత పోటీ చేయబోతున్నారనే విషయంలో ముఖ్య నేత స్పష్టం చేసిన నేపథ్యంలో నియోజకవర్గంలో తన మాటే చెల్లుబాటు కావాలని ఆయన భావిస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో ఏ బదిలీ జరగాలన్నా తన అనుమతి తప్పనిసరి అనే రీతిలో వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. దీంతో నియోజకవర్గంలోని అధికారులు కాస్తా ఈ యువనేత వద్దకు పరుగులు తీస్తున్నారు. నియోజకవర్గంలో అనతి కాలంలోనే ఆయన పవర్ సెంటర్‌గా మారడంతో అధికార పార్టీలోని మరోవర్గం నేతలకు మింగుడు పడని పరిస్థితి నెలకొంది.
Advertisement