‘కార్పొరేట్’ల బిగ్‌ఫైట్!
త్వరలో జరిగే ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుంపటిని రాజేశాయి. ఆ పార్టీకే చెందిన ఇద్దరు కార్పొరేట్ విద్యావేత్తల మధ్య ‘బిగ్‌ఫైట్’కు తెర లేచింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కోట్లు కుమ్మరించే ఖరీదైన పోరుగా మారిపోయాయి. అందుకు తగ్గట్టుగానే అధికార టీడీపీలో ఇద్దరు ‘బస్తీ మే సవాల్’ అంటూ బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజును ఇప్పటికే టీడీపీ హైకమాండ్ ఆదేశాలతో ఆ పార్టీ జిల్లా నేతలు ఏకగ్రీవంగా బలపరిచారు. జరగనున్నది పార్టీరహితంగా, ఉపాధ్యాయ వర్గాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలైనా.. ఆ పార్టీలో తాజా పరిణామాలతో రాజకీయ రంగు పులుముకున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ చైతన్యరాజు పదవీ కాలం వచ్చే మార్చితో ముగియనుంది. ఈలోపు జరిగే ఎన్నికలకు వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్‌వెలువడుతుందని ఆశావహులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీడీపీ బలపరిచిన చైతన్యరాజు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే అదే పార్టీకే చెందిన ‘ప్రగతి’ విద్యాసంస్థల అధినేత కృష్ణారావు ఎమ్మెల్సీ బరిలో ఉన్నానంటూ గురువారం కాకినాడలో ప్రకటించడం పార్టీలో చిచ్చు రేపింది. మొదటి నుంచి వీరిద్దరిలో ఎవరో ఒకరే బరిలో ఉంటారని పార్టీ నేతలు భావించారు. ఆ దిశగా అంతర్గతంగా సయోధ్య కుదురుతుందనుకున్నారు. శాసనమండలిలో బలం లేని పార్టీలోకి పలువురు ఎమ్మెల్సీలను తీసుకువచ్చినందుకు ప్రతిఫలంగా చైతన్యరాజుకు మద్దతు ఇచ్చినట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. చైతన్యరాజుకు టీడీపీ మద్దతు ప్రకటించాక కృష్ణారావుతో పార్టీ నేతలు మంతనాలు సాగించి.. కేబినెట్ హోదా కలిగిన ఏదో ఒక పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. బరిలో తానున్నానంటూ కాకినాడలో విలేకరుల సమావేశంలో ప్రకటించిన సందర్భంలో కృష్ణారావే ఈ విషయాన్ని తెలియచేశారు.
కృష్ణారావుపై ఫిర్యాదు చేయనున్న ప్రత్యర్థులు
గత సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం నుంచి పార్టీ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బలపరుస్తారని కృష్ణారావు ఆశించినా మరోసారి భంగపాటు తప్పలేదు. పార్టీలో ఉంటూనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కృష్ణారావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ను వ్యతిరేక వర్గం అధిష్టానం ముందుంచే అవకాశం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నాడు ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కుతుందంటూ పేరు ఎత్తకుండానే చంద్రబాబు మాట తప్పుతారని కృష్ణారావు పరోక్షంగా ఎత్తిచూపారని వారు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. ఏదేమైనా పోటీ నుంచి తప్పుకునేది లేదని కృష్ణారావు తెగేసి చెప్పడం గమనార్హం. ఒకే పార్టీ నుంచి పోటీ పడుతున్న ఇద్దరూ కార్పొరేట్ విద్యా రంగానికి చెందిన వారు కావడంతో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత రసపట్టుకు ఆటపట్టు కానున్నాన్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవమున్న చైతన్యరాజు వ్యూహం ముందు కృష్ణారావు ప్రతివ్యూహం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.