శ్రీరాములు (ఫైల్)
కంభం: వైద్యం కోసం కంభం నుంచి హైదరాబాదు వెళ్లిన ఓ ఉపాధ్యాయుడు వసతి గృహం గదిలో మృతిచెంది పడి ఉన్న సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితం, ఎన్‌సీసీ అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఆరవీటి వెంకట శ్రీరాములు ఈనెల 1వ తేదీన హైదరాబాదులోని యల్.వి.ప్రసాద్ కంటి వైద్యశాలలో చూపించుకునేందుకు కంభం నుంచి ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులో వెళ్లాడు. 2వ తేదీ ఉదయం యల్.వి.ప్రసాద్ కంటి వైద్యశాలకు వెళ్లి చూపించుకున్నాడు. ఆ తర్వాత తిరిగి 4వ తేదీ రమ్మని వైద్యశాల సిబ్బంది అతనికి సూచించినట్లు తెలిసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే శ్రీరాములు సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన చెంది హైదరాబాదులోని వైద్యశాలలో సంప్రదించారు. వైద్యం కోసం వచ్చిన మాటవాస్తవమేనని మరలా 4వ తేదీ రమ్మని చెప్పినట్లు అక్కడి సిబ్బంది కుటుంబసభ్యులకు తెలిపారు.
4వ తేదీ వైద్యశాలకు వస్తారని అతని కుటుంబ సభ్యులు అక్కడ ఎదురుచూసినా రాకపోవడంతో ఆందోళన చెందిన వారు జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వైద్యశాలలో వచ్చిన సీసీటీవీ పుటేజీలో పరిశీలించగా 2వ తేదీ వైద్యశాల పరిసరాల్లో ఉన్నట్లు కనిపించింది రాత్రి వరకు అక్కడే ఉన్న అతను ఆతర్వాత ఏమయ్యాడో అర్థం కాలేదు. అప్పటి నుంచి అతని కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు గాలించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాదులోని ఓ వసతి గృహం గది నుంచి దుర్వాసన వస్తుండటంతో తెరచి చూసిన వారికి శ్రీరాములు చనిపోయి మంచం పై పడి ఉండటం కన్పించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీరాములు మృతిచెందాడన్న వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఉపాధ్యాయుడు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న మండలంలోని ఉపాధ్యాయుల దిగ్బ్రాంతికి గురయ్యారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టంలో తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment