ప్రకాశం, యద్దనపూడి (పూనూరు): పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడికి, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు మధ్య జరిగిన వివాదంలో ఉపాధ్యాయుడు సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించడంతో సహచర ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు బెంబేలెత్తారు. ఈ సంఘటన పూనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినే సమయంలో ఓ ఉపాధ్యాయుడికి, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు ఓ కుర్చి వద్ద మెదలైన స్వల్ప వాదన చినికి చినికి గాలివానలా మారింది. సదరు ఉపాధ్యాయుడు సిబ్బందిపై కుర్చి ఎత్తి పైపైకి వెళ్లాడు. కుర్చీ ఎత్తి దౌర్జనం చేయబోవడంటంతో విషయం ఆ నోటా ఈనోటా గ్రామంలో చర్చ జరిగింది.
విషయం తెలిసిన విలేకరులు నాన్ టీచింగ్ సిబ్బందిని వివరణ కోరగా అంతా చూస్తుండగా తనపై దౌర్జనం జరిగిన మాట వాస్తవమేనని తెలిపాడు. ఇదే విషయమై ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణను వివరణ కోరగా మంగళవారం తాను సెలవులో ఉన్నానని, గొడవ జరిగిన మాట వాస్తవమేనని తెలిపారు.
ఈ విషయమై ఎంపీడీఓ జాకీర్‌హుస్సేన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడు దౌర్జనం గురించి గతంలోనే తన దృష్టికి వచ్చిందని, మంగళవారం జరిగిన ఘటనపై తనకు నివేదిక ఇమ్మన్ని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించానన్నారు. నివేదిక అందగానే జిల్లా అధికారులకు పంపుతానన్నారు. ఇది ఇలా ఉండగా గ్రామస్తులు విద్యార్థుల ముందే ఉపాధ్యాయుడు సంస్కార రహితంగా అసభ్య పదజాలం వాడటమేమిటని, ఇకముందు ఇలా జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment